జనసేన - బీజేపీ మిత్రపక్షాలు. కానీ ఆ రెండు పార్టీలు కలిసి నడుస్తున్న పరిస్థితులు ఎక్కడా ఆంధ్రప్రదేశ్‌లో కనిపించడం లేదు. కలసి పోరాటాలు చేయాలని.. కలసి కార్యక్రమాలు ఖరారు చేసుకోవాలని ఓ సమన్వయ కమిటీని కూడా నియమించుకున్నారు. కానీ ఆ కమిటీ ఎప్పుడూ సమావేశం కాలేదు. ఓ వైపు కేంద్ర నేతలతో జనసేన అగ్రనేతలకు సత్సంబంధాలు ఉన్నాయి. కానీ ఆ ప్రభావం రాష్ట్ర పార్టీ వ్యవహారాల్లో మాత్రం కనిపించడం లేదు. జనసేనను కలుపుకోకపోగా .. ఇటీవలి కాలంలో పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేయడం ఎక్కువైంది. ముఖ్యంగా సోము వీర్రాజు సందర్భం లేకపోయినా పవన్ కల్యాణ్ ప్రస్తావన తీసుకు వస్తున్నారు. ఎందుకిలా జరుగుతోంది ? జనసేన నాయకత్వానికి.. బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి మధ్య చెడిందా ?
Also Read: ప్రాణ త్యాగం అవసరంలేదు ప్లకార్డులు పట్టుకోండి చాలు... వైసీపీ ఎంపీలపై పవన్ విమర్శలు...
పవన్‌ను పదే పదే ఎందుకు సోము వీర్రాజు పొలిటికల్ సీన్‌లోకి లాక్కొస్తున్నారు !?
పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర సమస్యలపై పోరాడాలని బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు బుధవారం ప్రెస్‌మీట్‌లో డిమాండ్ చేశారు. ఆయన ఇతర విషయాలు చాలా మాట్లాడారు కానీ.. పవన్ కల్యాణ్ ప్రస్తావన ఎందుకు..? అదీ కూడా ఆయన రాజకీయం ఎలా చేయాలన్నదానిపై ఆయన డిమాండ్ ఏమిటి ? అన్నది చాలా మందికి పజిల్‌గా మారింది. నిజానికి సోము వీర్రాజు పవన్‌ను టార్గెట్ చేయడం ఇదే మొదటి సారి కాదు. గత వారం పవన్ కల్యాణ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయడంపై విమర్శలు గుప్పించారు మిత్రపక్షం అయిన జనసేనను ప్రశ్నిస్తూ .. పవన్ కల్యాణ్‌ను నిలదీస్తూ మీడియా సమావేశంలో మాట్లాడారు. పవన్ కల్యాణ్ ఒక్క స్టీల్ ప్లాంట్ అంశంపైనే మాట్లాడటం సరి కాదని.. ప్రస్తుత..గత ప్రభుత్వాలు అమ్మేసిన సంస్థలగురించి కూడా మాట్లాడాలని డిమాండ్ చేసినట్లుగా మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ ఒక్కటే కనిపిస్తోందా అని ప్రశ్నించారు. సోము వీర్రాజు సందర్భం లేకపోయినా పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించడం జనసేన వర్గాలను సైతం ఆశ్చర్య పరిచింది. తాజాగా ఉత్తరాంధ్ర సమస్యలపైనా పవన్ పోరాటం చేయాలని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.
సోము వీర్రాజుకు "ఫుల్ టీ" కావాలట..! అంటే .. విలీనం కోరుకుంటున్నారా ?
సోము వీర్రాజు ప్రెస్‌మీట్‌లో కొన్ని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. తమకు ఫుల్ టీ కావాలంటూ మిత్రపక్ష రాజకీయాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు వ్యాఖ్యానించారు. జనేన పార్టీ గుర్తు గాజు గ్లాస్. అందులో టీ ఉండదు. ఇఏ ఉద్దేశంతో సోము వీర్రాజు ఇప్పుడీ వ్యాఖ్యలు చేశారన్నది హాట్ టాపిక్‌గా మారింది. జనసేనను బీజేపీలో విలీనం చేయాలని కోరుకుంటున్నారా లేక పొత్తు పెట్టుకున్నందున బీజేపీ బాధ్యతలు కూడా పవన్ కల్యామఅ తీసుకోవాలని అనుకుంటున్నారా.. అన్నది క్లారిటీ లేని అంశంగా మారింది.
Also Read: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనసేన ఉద్యమం ! బీజేపీ కలసి వస్తుందా ?
పవన్‌ను బీజేపీ రాష్ట్ర నాయకత్వం దూరం పెడుతోందా !?
ఢిల్లీ స్థాయిలో బీజేపీ నేతలతో పవన్ కల్యాణ్ సన్నిహితంగా వ్యవహరిస్తున్నప్పటికీ రాష్ట్ర స్థాయిలో ఎవరూ కలిసే పరిస్థితి కొద్ది రోజులుగా కనిపించడం లేదు. కలసి కట్టుగా నిర్ణయాలు తీసుకోవడం లేదు. జనసేన - బీజేపీ నేతలు ఎవరి దారి వారిదే అన్నట్లుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. సోము వీర్రాజు స్వయంగా వెళ్లి పవన్ కల్యాణ్‌తో బద్వేలు ఎన్నికపై చర్చించినా అసలు ఎవరు పోటీ చేయాలి. .. పోటీ చేయాలా వద్దా అన్న అంశాలపై నిర్ణయం తీసుకోవడంలో విఫలమయ్యారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. తాము పోటీ చేయడం లేదని నేరుగా బీజేపీకి చెప్పడానికి కూడా సిద్ధపడలేదు. ఆయన తన నిర్ణయాన్ని జనం మధ్యనే ప్రకటించారు. పవన్ ప్రకటించే వరకూ బీజేపీ నేతలకు కూడా ఈ విషయం తెలియదు. తిరుపతి ఉపఎన్నికల విషయంలోనూ ఇరు పక్షాల మధ్య అంతగా పొత్తు ఫలితాలను ఇవ్వలేదు. ఆ ఎన్నికల సమయంలో జనసేన ఓటు బ్యాంక్‌ను ఆకర్షించడానికి పవన్ కల్యాణ్‌ను సోము వీర్రాజు అనేక విధాలుగా పొగిడారు. కానీ తర్వాత సీన్ మారిపోయింది. పవన్ కల్యాణ్‌ను ఏ విషయంలోనూ పట్టించుకోవడం లేదు.
Also Read: వివాదంలో జనసేన ఎమ్మెల్యే రాపాక ! అనర్హతా వేటు పడుతుందా ?
పవన్‌కు రాజకీయంగా కష్టం వచ్చినప్పుడు అండగా ఉండని బీజేపీ !
మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్‌సీపీ నేతలు టార్గెట్ చేశారు. తిట్ల దండకం వినిపించారు. అయితే ఏపీ బీజేపీ నేతలు మాత్రం నోరు మెదపలేదు. తమ మిత్రునికి కనీసం నైతిక మద్దతు కూడా ఇవ్వ లేదు. చివరికి టీడీపీ నేతలు కూడా వైఎస్ఆర్‌సీపీ నేతలు అలా మాట్లాడటం సరి కాదని మండిపడ్డారు. ఏపీ బీజేపీ నేతలు మాత్రం.. ఓ చిన్న ట్వీట్లు లేదా.. ఓ చిన్న ప్రకటనతో సరి పెట్టారు. మిత్రునిగా దారుణమైన ఎటాక్ జరుగుతూంటే సపోర్ట్ చేయాల్సిన రేంజ్‌లో చేయలేదన్న అభిప్రాయం మాత్రం అంతటా వినిపించింది.
Also Read: ఏపీలో బీజేపీ - జనసేన అనధికారిక కటీఫ్ ! బద్వేలు పోటీనే తేల్చేసిందా ?
ఏపీ బీజేపీ నాయకత్వంపై పవన్‌కు సదభిప్రాయం లేదా !?
రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలపై పవన్ కల్యాణ్‌కు అంత సదభిప్రాయం లేదని అందుకే.. వీలైనంత దూరం పాటిస్తున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. జనసేనతో పొత్తు ఉందని.. అవసరానికిమాత్రమే వాడుకుని ఇతర సందర్భాల్లో ఒక్క బీజేపీని మాత్రమే ప్రమోట్ చేసుకుంటున్నారని జనసేన వర్గాలు అసంతృప్తితో ఉన్నాయి. కనీసం ప్రజాపోరాటాలకు సిద్ధమైనప్పుడు కూడా జనసేనతో కలిసి పోరాటం చేయాలన్న ఆలోచన చేయడం లేదు. ఉద్యోగ క్యాలెండర్‌పై బీజేపీ పోరాడింది. కానీ.. జనసేనకు సమాచారం లేదు. అలాగే కొన్ని కార్యక్రమాల్లోనూ అదే పరిస్థితి. ఏపీ బీజేపీ నేతలు వ్యూహాత్మకంగా జనసేనను నిర్వీర్యం చేసేప్లాన్ అమలు చేస్తున్నారన్న అనుమానాలు పవన్ కల్యాణ్‌లో ఉన్నాయని అంటున్నారు. వాస్తవానికి బీజేపీ- జనసేన ఓ సమన్వయ కమిటీని ఏర్పాటు చేసుకుని ఆ కమిటీ సమావేశాల్లో నిర్ణయాలు తీసుకుని సంయుక్తంగా కార్యాచరణ చేపట్టాలని గతంలోనే నిర్ణయించారు. కానీ ఆ సమావేశాలు చివరి సారిగా ఎప్పుడు జరిగాయో రెండు పార్టీల నేతలకు అసలు అసలు గుర్తుందో లేదో తెలియదు. బీజేపీ తీరు వల్ల జనసేన క్యాడర్‌లోనూ అసంతృప్తి పెరిగిపోతోంది. స్థానిక ఎన్నికల తర్వాత... తిరుపతి మున్సిపల్ ఉపఎన్నిక తర్వాత బీజేపీ - జనసేన మధ్య గ్యాప్ బాగా పెరిగింది. దీన్ని సరి చేసుకునే ప్రయత్నాన్ని ఏపీ బీజేపీ నాయకత్వం చేయలేదు. ప్రస్తుత బీజేపీ ఏపీ నాయకత్వంలో అధికార పార్టీ సానుభూతిపరులు ఎక్కువగా ఉన్నారని వీరు ఎవరూ పవన్ కల్యాణ్ మీద సదభిప్రాయంతో ఉన్నట్లుగా కనిపించరని ఎక్కువ మంది జనసేన క్యాడర్ భావిస్తోది.
మిత్రుల మధ్య దూరం ఇరువురికీ నష్టమే !
ఎన్నికలు లేకపోయినా పవన్ కల్యాణ్ రెండేళ్ల కిందటే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అలాంటి అవసరం ఆ సమయంలో లేదు. కానీ సుదీర్ఘ పోరాటం చేసి వచ్చే ఎన్నికల నాటికి బలంగా ఎదగాలన్న లక్ష్యంతో ఆ పొత్తు పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. కానీ రెండు వైపుల నుంచి సహకారం కొరవడం.. నమ్మకం తగ్గిపోవడం.. సోము వీర్రాజు పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేయడం.. వారి మధ్య దూరాన్ని అంతకంతకూ పెంచుతోంది. ఇది రెండు పార్టీలకూ ఇబ్బంది కరమే.
Also Read: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పోరాటం ఎవరి కోసం? పార్టీ కోసమా? సినీ పరిశ్రమ కోసమా?