ఆంధ్రప్రదేశ్‌లో పొత్తులో ఉన్న పార్టీలు బీజేపీ, జనసేన మధ్య సంబంధాలు అంత గట్టిగా లేవని మరోసారి నిరూపితమయింది. బద్వేలు ఉపఎన్నికల విషయంలో పోటీ విషయంపై రెండు పార్టీలు రెండు భిన్నమైన దారుల్లో వెళ్తున్నాయి. తాము పోటీ చేయబోవడం లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. తాము పోటీ చేసి తీరుతామని భారతీయ జనతా పార్టీ తేల్చేసింది. ఉమ్మడి అభ్యర్థిని పెట్టాలనుకున్న పార్టీలు ఇలా వేర్వేరుగా ప్రకటనలు చేయడంతో రెండు పార్టీల మధ్య ఉందా లేదా అన్నట్లుగా ఉన్న పొత్తు తెగిపోయిందని రాజకీయవర్గాలు ఓ అంచనాకు వస్తున్నాయి.
పోటీ చేయడం లేదని జనసేనాధినేత ఏకపక్ష ప్రకటన !
బద్వేలు ఉపఎన్నికల్లో పోటీ చేసేది లేదని అనంతపురంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. జనసేన పోటీ చేయడానికి ఆసక్తిగా ఉందని ప్రచారం జరిగింది. అయితే అక్కడ చనిపోయిన ఎమ్మెల్యే సుబ్బయ్య భార్య సుధకే వైసీపీ టిక్కెట్ ఇచ్చినందున విలువల్ని పాటిస్తామంటూ పవన్ కల్యాణ్ ప్రకటించారు. గత ఎన్నికల్లోనూ జనసేన అక్కడ పోటీ చేయలేదు. బీఎస్పీకి మద్దతిచ్చారు. కానీ నోటా కన్నా తక్కువ ఓట్లు వచ్చాయి. బీజేపీ పరిస్థితి అంతే. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో పోటీ చేయకపోవడమే మంచిదని పవన్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అమరావతిలో ఉన్న పవన్ కల్యాణ్‌ను సోము వీర్రాజు స్వయంగా వెళ్లి పవన్ కల్యాణ్‌తో బద్వేలు ఎన్నికపై చర్చించారు. అయితే తమ పార్టీ నిర్ణయాన్ని బీజేపీకి అప్పుడు పవన్ కల్యాణ్ చెప్పలేదు. దీంతో ఉమ్మడి అభ్యర్థే ఉంటారని సోము వీర్రాజు చెప్పుకొచ్చారు. ఇప్పుడు పవన్ ప్రకటనతో ఆయనను చిన్నబుచ్చినట్లయింది.
Also Read : బద్వేల్ ఉపఎన్నికపై టీడీపీ కీలక నిర్ణయం... పోటీకి దూరంగా ఉంటున్నట్లు ప్రకటన..
పోటీ చేయక తప్పని పరిస్థితిలో బీజేపీ !
బద్వేలులో పోటీ నుంచి జనసేన వైదొలుగుతున్నట్లుగా పవన్ కల్యాణ్ ప్రకటిచే వరకూ బీజేపీ నేతలకూ తెలియదు. బీజేపీ అభ్యర్థి నిలబడితే జనసేన మద్దతిస్తుందని.. లేకపోతే జనసేనకు తాము మద్దతిస్తామని భావిస్తున్నారు. అయితే పవన్ నిర్ణయం శరాఘాతంలా తగలడంతో వారికి ఏమి చేయాలో పాలు పోవడం లేదు. అయితే జనసేన సొంత నిర్ణయం తీసుకోవడంతో ఇక పొత్తు లేకుండా సొంతంగా పోటీ చేయాలన్న అభిప్రాయానికి వచ్చారు. టీడీపీ కూడా పోటీలో లేకపోవడంతో ఇదే అదనుగా గత ఎన్నికల కన్నా ఎక్కువ ఓట్లు తెచ్చుకుని బలపడ్డామన్న సంకేతాలను పంపాలని నిర్ణయించారు.2014లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన విజయజ్యోతి అనే నేతతో పోటీ చేయడానికి మంతనాలు జరిపారు. గత ఎన్నికల తర్వాత కడప తెలుగుదేశం పార్టీ నేతలు సీఎం రమేష్, ఆదినారాయణ రెడ్డి వంటివారు బీజేపీలో చేరారు. వారి దన్నుతో బలం పుంజుకోవచ్చని బీజేపీ రాష్ట్ర నాయకత్వం అంచనాతో ఉంది.
Also Read: బద్వేలు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తాం.. జగన్ పార్టీకి భయపడేది లేదు.. సోము వీర్రాజు వెల్లడి
బీజేపీ పోటీ చేస్తే జనసేన మద్దతు లేనట్లే !
బద్వేలులో బీజేపీ పోటీ చేసినా జనసేన మద్దతివ్వడం మాత్రం సాధ్యం కాదు. ఎందుకంటే పవన్ కల్యాణ్ దివంగత ఎమ్మెల్యే భార్య డాక్టర్ సుధకే మద్దతిస్తున్నట్లుగా చెప్పారు. దివంగత ఎమ్మెల్యే భార్య కాబట్టి పోటీ చేయడం లేదని చెప్పడం నేరుగా మద్దతివ్వడం కిందకే వస్తుంది. ఇప్పుడు మిత్రపక్షం పోటీ చేసినా జనసేన మద్దతు ఇవ్వరు. ఇది బీజేపీకి మరింత ఇబ్బందికరమైన పరిస్థితి తెస్తుంది. అక్కడి జనసేన ఓట్లు బదిలీ అవుతాయా లేదా అన్న ది సమస్య కాకుండా రెండు పార్టీల మధ్య చెరపలేని అంతరాలు ఏర్పడినట్లుగా సందేశం ప్రజల్లోకి క్యాడర్‌లోకి వెళ్లిపోతుందని ఆందోళన చెందుతున్నారు.
Also Read : బూతులు తిడితే ఇక తాట తీయడమే .. రాజమండ్రిలో పవన్ మాస్ వార్నింగ్ !
పొత్తు కొనసాగింపుపై రెండు పార్టీలకూ ఆసక్తి లేదా !?
ఢిల్లీ స్థాయిలో బీజేపీ నేతలతో పవన్ కల్యాణ్ సన్నిహితంగా వ్యవహరిస్తున్నప్పటికీ రాష్ట్ర స్థాయిలో ఎవరూ కలవడం లేదు. అటు జనసేన నేతలు బీజేపీతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా లేరు. అటు బీజేపీ నేతలు కూడా జనసేన పార్టీ నేతలతో కలిసేందుకు రెడీగా లేరు. రెండు పార్టీల ఢిల్లీ నేతల మధ్య సఖ్యత ఉంది కానీ.. రాష్ట్ర స్థాయి నేతలు.. ద్వితీయ శ్రేణి నేతలు.. క్యాడర్ మధ్య అసలు ఎలాంటి ఆసక్తి కనిపించడం లేదు. అందుకే తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల్లో కానీ.. ఆ తర్వాత జరిగిన స్థానిక ఎన్నికల్లో కానీ రెండు పార్టీలు కలిసి సాధించిన విజయాలేవీ లేవని గుర్తు చేస్తున్నారు. బద్వేలు నిర్ణయంతో ఇక రెండు ప ార్టీలు కలసి కట్టుగా రాజకీయాలు చేసే పరిస్థితి లేదని తేలిపోయిందని అంచనా వేయవచ్చు.
Also Read : మాటల్లో చెప్పిన ‘రాజకీయం’ చేతల్లో చూపిస్తే తిరుగులేనట్లే..! పవన్ కల్యాణ్ ‘సొంత’ బాట ..?