కడప జిల్లాలోని బద్వేల్‌ నియోజకవర్గ ఉపఎన్నికకు దూరంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్‌ బ్యూరో బద్వేల్‌ ఉప ఎన్నికలో పోటీ చేయకూడదని నిర్ణయించుకుంది. దివంగత ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య సతీమణికే టికెట్‌ ఇచ్చిన కారణంగా పోటీకి విముఖత వ్యక్తంచేసింది. సంప్రదాయాలను గౌరవించి బద్వేల్‌లో పోటీ చేయడం లేదని ప్రకచించింది. వైసీపీ ఎమ్మెల్యే  వెంకటసుబ్బయ్య క్యాన్సర్ వ్యాధి కారణంగా మృతి చెందారు. దీంతో బద్వేల్‌ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. అయితే పొలిట్‌ బ్యూరో నిర్ణయానికి ముందు బద్వేల్‌ అభ్యర్థిగా ఓబులాపురం రాజశేఖర్‌ను టీడీపీ ఖరారు చేసింది. 2019లో బద్వేల్‌ టీడీపీ అభ్యర్థిగా రాజశేఖర్‌ పోటీ చేసి ఓటమిపాలయ్యారు. దివంగత ఎమ్మెల్యే సతీమణికే వైసీపీ టికెట్‌ ఇచ్చినందున పోటీకి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించింది. సంప్రదాయాలకు గౌరవించి ఏకగ్రీవానికి సహకరించాలని చంద్రబాబు అన్నారు. 




Also Read: బద్వేలు ఉపఎన్నికకు నోటిఫికేషన్ విడుదల.. నేటి నుంచి నామినేషన్లు స్వీకరణ.. ర్యాలీలు నిషేధం..


జనసేన కూడా దూరం 


కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ ఉపఎన్నికలో పోటీపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ క్లారిటీ ఇచ్చారు. దివంగత ఎమ్మెల్యే భార్యకే టికెట్‌ ఇచ్చినందున జనసేన పోటీ చేయడం లేదని తెలిపారు. బద్వేలు జనసేన నేతలతో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. ఎన్నిక ఏకగ్రీవం చేసుకోవాలని వైసీపీకి సూచించారు. బద్వేలు నియోజకవర్గ ఉప ఎన్నిక ఈనెల 30న జరగనుంది. తాజాగా టీడీపీ కూడా పోటీకి దూరంగా ఉంటున్నట్లు ప్రకటించింది. 


Also Read: బద్వేలు ఉప ఎన్నికల్లో పోటీ చేస్తాం.. జగన్ పార్టీకి భయపడేది లేదు.. సోము వీర్రాజు వెల్లడి


బరిలో నిలిచేందుకు బీజేపీ సై


కానీ బద్వేల్ ఉపఎన్నికలో పోటీ చేసేందుకు బీజేపీ సిద్ధమవుతుంది. బీజేపీ మిత్రపక్షమైన జనసేన పోటీకి దూరంగా ఉన్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా కడప జిల్లా నేతలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు భేటీ అయ్యారు. బద్వేల్‌లో బీజేపీ పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆ విషయాన్ని జాతీయ నాయకత్వానికి తెలియజేశామని సోము వీర్రాజు తెలిపారు. స్థానికంగా ముగ్గురు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.  బీజేపీ, జనసేన ప్రజాక్షేత్రంలో కలిసి పని చేస్తామని సోము వీర్రాజు అన్నారు. బీజేపీ సిద్ధాంతం ప్రకారం కుటుంబ రాజకీయాల్ని వ్యతిరేకిస్తుందన్నారు. భారతదేశ వ్యాప్తంగా కుటుంబ పాలన వ్యవస్థ విస్తరించిందని, ఏపీలో కూడా కుటుంబ పాలన సాగుతోందన్నారు. దానికి వ్యతిరేకిస్తూనే బద్వేల్ ఎన్నికల పోటీలో నిలవాలని నిర్ణయించామన్నారు. ఈ విషయాన్ని కేంద్రానికి నివేదించామన్నారు. వైసీపీ ప్రభుత్వంపై ఉన్న ప్రజావ్యతిరేకతను ఉపఎన్నికలో ఎత్తి చూపుతామని సోము వీర్రాజు చెప్పారు. 


Also Read: బద్వేలులో జనసేన పోటీ చేయడం లేదు... స్పష్టం చేసిన పవన్ కల్యాణ్... అనంతపురం సభలో కీలక వ్యాఖ్యలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి