బద్వేలు ఉపఎన్నికకు శుక్రవారం నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి విజయానంద్ ప్రకటించారు. నామినేషన్ వేసే సమయంలో ఒక్కరే వెళ్లాలని స్పష్టం చేశారు. ర్యాలీలను నిషేధించామన్నారు. ఈనెల 30న పోలింగ్‌, నవంబర్‌ 2న ఓట్ల లెక్కింపు ఉంటుందని ఆయన తెలిపారు. ఈనెల 8 వరకు నామినేషన్ల స్వీకరణ, 11న పరిశీలన ఉంటుందని విజయానంద్ తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 13 వరకు గడువు ఉందని ప్రకటించారు. ఈవీఎంలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేవని ఎన్నికల ప్రధాన అధికారి తెలిపారు.


Also Read: బద్వేలు ఉప ఎన్నిక బరిలో నిలిచే ప్రధాన పార్టీల అభ్యర్థులు వీరే..


గత ఎన్నికల్లో వైసీపీ విజయం 


గత ఎన్నికల్లో బద్వేలు ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో మార్చి 28న మృతి చెందారు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కడపలో ఆర్థోపెడిక్ డాక్టర్​గా వెంకటసుబ్బయ్య కొంత కాలం పనిచేశారు. 2019లో తొలిసారిగా బద్వేలు నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలుపొందారు. బద్వేలు నియోజకవర్గం ఎస్సీ సామాజిక వర్గానికి రిజర్వు చేశారు. రెండేళ్ల నుంచి వెంకట సుబ్బయ్య క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ మృతి చెందారు. దీంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. గత ఎన్నికల్లో వెంకటసుబ్బయ్యపై పోటీ చేసి ఓటమి పాలైన ఓబులాపురం రాజశేఖర్‌ను టీడీపీ మరోసారి బరిలో నిలిపింది. వైసీపీ నుంచి వెంకట సుబ్బయ్య సతీమణి సుధను అభ్యర్థిగా ప్రకటించింది.


Also Read: బద్వేలు ఉపఎన్నికపై సీఎం జగన్ సమావేశం... గతంలో కన్నా ఎక్కువ మెజారిటీ రావాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం... అన్ని వర్గాలను కలుపుకొని వెళ్లాలని ఆదేశం


కొవిడ్ నిబంధనలు పాటించాలి


ఉపఎన్నికల్లో కచ్చితంగా కొవిడ్‌ నిబంధనలు పాటించాలని కేంద్రం ఎన్నికల సంఘం తెలిపింది. సమావేశాల్లో 30 శాతం మందిని, బహిరంగ సభల్లో అయితే మైదానం సామర్థ్యంలో 50 శాతం మందిని మాత్రమే అనుమతించాలని సూచించింది. ఎలక్షన్ స్టార్ క్యాంపైనర్స్ సంఖ్య 20 మందికి మించకూడదని ప్రకటించింది. రోడ్‌ షోలు, కార్లు, మోటారు సైకిళ్లు, సైకిల్‌ ర్యాలీలకు అనుమతిలేదని స్పష్టంచేసింది. అభ్యర్థులు, ప్రతినిధులు ఐదుగురికి మించకుండా ఇంటింటి ప్రచారం చేసుకోవచ్చని తెలిపింది. ఎన్నికల రోజున అభ్యర్థి రెండు వాహనాలతో ముగ్గురు వ్యక్తులతోనే పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించవచ్చని పేర్కొన్నారు.


272 పోలింగ్‌ స్టేషన్లు


బద్వేలు నియోజకవర్గం పరిధిలోని బద్వేలు, గోపవరం, అట్లూరు, బి.కోడూరు, పోరుమామిళ్ల, కాశినాయన, కలసపాడు మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో 272 పోలింగ్‌ స్టేషన్లు ఉన్నాయి. జనవరి, 2011వ తేదీ నాటికి  2,12,739 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 1,06,650 మంది, 1,06,069 మంది మహిళ ఓటర్లుగా ఉన్నారు. తాజా ఓటర్ జాబితా ఇంకా వెలువడనుంది. 


Also Read: బద్వేలు ఉప ఎన్నిక బరిలో నిలిచే ప్రధాన పార్టీల అభ్యర్థులు వీరే..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి