అఫ్గానిస్థాన్ కాబూల్‌లోని ఓ మసీదుపై బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో చాలా మంది పౌరులు చనిపోయినట్లు ఏఎన్‌ఐ వార్తా సంస్థ వెల్లడించింది. ఈద్గా మసీదు లక్ష్యంగా బాంబు దాడి జరిగినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనకు ఇప్పటివరకు ఎవరూ బాధ్యత వహించలేదు. అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించిన తర్వాత అక్కడ బాంబు దాడులు, హింసాత్మక ఘటనలు అధికమయ్యాయి. ముఖ్యంగా ఐసిస్ నుంచి తీవ్రమైన ముప్పు ఎదురవుతోంది.
ఇటీవల..
నంగార్హర్ ప్రాంతంలోని జలాలాబాద్‌లో తాలిబన్ వాహనాలే లక్ష్యంగా ఇటీవల వరుస పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ఈ దాడికి పాల్పడింది.
జంట పేలుళ్లు..
కాబుల్ విమానాశ్రయంపై ఇటీవల జరిగిన జంట ఆత్మాహుతి దాడుల్లో 108 మంది మరణించారు. ఇందులో 13 మంది అమెరికా సైనికులు కాగా.. 95 మంది అఫ్గాన్ వాసులు. 150 మంది గాయపడ్డారు. ఈ దాడికి ఐఎస్‌ఐఎస్-ఖోర్సా బాధ్యత తీసుకుంది. మృతుల్లో 28 మంది తమ వారు కూడా ఉన్నారని తాలిబన్లు ప్రకటించారు.
అమెరికా బలగాలు అఫ్గాన్‌ను వీడిన తర్వాత తాలిబన్లు మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఒక్కప్పటి హింసాకాండకు, నియంత చర్యలకు పాల్పడమని చెప్పినప్పటికీ మహిళలపై అరాచకాలు అలానే కొనసాగుతున్నాయి. మహిళలను విధుల్లోకి హాజరుకాకుండా తాలిబన్లు నియంత్రిస్తున్నారు. కో- ఎడ్యుకేషన్‌ను బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు. అఫ్గాన్ మహిళల వస్త్రధారణపైనా ఆంక్షలు విధించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదని ఆదేశాలు జారీ చేశారు.
జర్నలిస్టులపై కూడా దాడులు పెరిగిపోయాయి. తమకు వ్యతిరేకంగా పనిచేసే జర్నలిస్టులను బహిరంగంగానే కాల్చిచంపారు. అయితే పైకి మాత్రం అంతా సవ్యంగా ఉందంటున్నారు. సరిహద్దు దేశాలతో మంచి సంబంధాలు కోరుకుంటున్నామని తాలిబన్లు అంటున్నారు అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.
Also Read: Mumbai Rave Party: డ్రగ్స్ కేసులో షారుక్ ఖాన్ కుమారుడు.. వైద్య పరీక్షలకు తరలింపు!