భవానీపుర్‌లో తనకు ఎదురులేదని బంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి రుజువు చేశారు. భవానీపుర్ ఉపఎన్నికల్లో భాజపా అభ్యర్థి ప్రియాంక టిబ్రేవాల్‌పై 58,832 ఓట్ల తేడాతో జయకేతనం ఎగురవేశారు. ఈ విజయంతో దీదీ సీఎం పీఠాన్ని నిలబెట్టుకున్నారు.
తొలి రౌండ్ నుంచే..
తొలి రౌండ్ నుంచే మమతా బెనర్జీ దూకుడు ప్రదర్శించారు. మొత్తం 21 రౌండ్ల పాటు కౌంటింగ్ జరిగింది. రౌండు రౌండుకు మమతా బెనర్జీ ఆధిక్యత కనబరిచారు. ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్‌కు మంచి పట్టుండడంతో దీదీ గెలుపు ఖాయమైంది.
దీదీ ఆనందం..
మమతా బెనర్జీ విజయం సాధించడంతో టీఎంసీ కార్యకర్తలు ఆమె నివాసం వద్ద సంబరాలు జరుకున్నారు. సెప్టెంబర్ 30న ఈ భవానీపుర్ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. 53 శాతం పోలింగ్ నమోదైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నందిగ్రామ్‌లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అనంతరం భవానీపుర్ నుంచి పోటీకి దిగారు. ముఖ్యమంత్రిగా కొనసాగాలంటే తప్పక గెలవాల్సిన ఈ ఎన్నికలో మమత భారీ విజయం సాధించారు.