కొందరికి కొన్ని ఆహారాలు పడవు, కానీ ఆ విషయం వారికి తెలియదు. తినేస్తూ ఉంటారు. దీని వల్ల కొంతమంది తీవ్రమైన అలెర్జీల బారిన పడతారు. తరచూ మనం తినే ఆహారాలలో ఎక్కువ శాతం అలెర్జీకి కారణమయ్యే ఆహారాలు ఇక్కడ ఇచ్చాం. ఇవి తిన్నాక మీకు ఏదైనా తేడాగా అనిపించినా, రియాక్షన్ వచ్చినా వెంటనే తినడం మానేయాలి. ఎందుకంటే కొన్ని సార్లు ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడతాయి. 
 
ఆవు పాలు
ఆవు పాలు తాగాక మీకు అసౌకర్యంగా, పొట్టనొప్పిగా అనిపిస్తోందా? అయితే మీకు లాక్టోస్ ఇన్టోలరెన్స్ అనే సమస్య ఉన్నట్టే. ఈ అలెర్జీ ఉన్నవారికి పాలల్లోని లాక్టోజ్‌ను అరిగించుకోలేరు. దీంతో డయేరియా బారిన పడతారు. లేదా వాంతి చేసుకుంటారు. మూడు సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. వయసు పెరిగేకొద్దీ సమస్య తగ్గుముఖం పడుతుంది. కేవలం పాలే కాదు, పాలు ఆధారిత పదార్ధాలైన పెరుగు, చీజ్, వెన్న లాంటివి కూడా వీరికి పడవు. వారికి దద్దుర్లు, వాపు, వాంతులు, విరేచనాలు వంటివి కలుగుతాయి. పాలు తాగిన అయిదారు నిమిషాల తరువాతే ప్రతిచర్య మొదలవుతుంది. ఇది ప్రేగుల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. 


గుడ్లు
గుడ్లు పడని వారు కూడా ఎంతో మంది ఉన్నారు. కానీ వారికి ఆ విషయం తెలియదు. ఒక అధ్యయనం ప్రకారం 68శాతం మంది పిల్లల్లో గుడ్లు అలెర్జీని కలిగిస్తున్నాయి. పదహారేళ్లు దాటాక అలెర్జీ కలగడం తగ్గిపోతుంది. గుడ్డు తిన్నవెంటనే పొట్ట నొప్పి, అతిసారం, దద్దుర్లు, శ్వాసకోశ సమస్యలు వస్తే ఓసారి ఆలోచించుకోవాలి. 


వేరుశెనగలు
వేరుశెనగలు పడకపోతే మాత్రం వాటికి దూరంగా ఉండడం మంచిది. ఇది ఒక్కోసారి ప్రాణాంతకంగా మారుతుంది. వేరుశెనగలు పడకపోతే చర్మం దద్దుర్లు, ఆ దద్దుర్లు ఎర్రగా మారడం, దురద, నోరు, గొంతులో జలదరింపు కలగడం వంటివి కలుగుతాయి. వికారంగా అయి వాంతి కూడా వస్తుంది. గొంతులో ఉక్కిరిబిక్కిరి అయినట్టు అవుతుంది. పీనట్ బటర్ కూడా వీరికి పడదు. 


సోయా
సోయా అలెర్జీలు పిల్లల్లో కలగడం సాధారణం. ఇది సోయా లేదా సోయా ఆధారిత ఆహారాన్ని తినడం వల్ల కలుగుతుంది. అయితే పిల్లలు పెద్దవుతున్న కొద్దీ ఈ అలెర్జీని అధిగమిస్తారు. కొందరిలో మాత్రం జీవితాంతం ఉండిపోయే అవకాశం ఉంది. ఈ అలెర్జీ వచ్చిన వారిలో దురద, నోరు, ముక్కు నుంచి నీరు కారడం, దద్దుర్లు, ఆస్తమా, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది వంటివి కలుగుతాయి. సోయాపాలు,సోయా టోఫులు తినడం వల్ల అలెర్జీ కలుగుతుంది. 


గోధుమలు
గోధుమ అలెర్జీ అన్నది గ్లూటెన్ వల్ల కలుగుతుంది. గోధుమల్లోనే గ్లూటెన్ ఉంటుంది. ఇది పడని వారు గోధుమలకు దూరంగా ఉండాలి. చపాతీలు తిన్నాక చర్మంపై దద్దుర్లు, వాంతులు, వాపు వంటివి కలిగితే గ్లూటెన్ అలెర్జీ ఉందేమో చెక్ చేసుకోవాలి. సెలియాక్ డిసీజ్ గోధుమలు పడకపోతే వస్తుంది. 


Also read: గర్భిణిలు కాకరకాయ తింటే చాలా సమస్యలు దరిచేరవు, మీ బిడ్డకోసమైనా తినండి


Also read: ఇంట్లోనే వేడి వేడి మొక్కజొన్న గారెలు, తింటే ఎంతో బలం





గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.