MLC Kavitha visits Khairatabad Ganesh: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఖైరతాబాద్ వినాయకుడ్ని దర్శించుకున్నారు. మంగళవారం ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకున్న కవిత ప్రత్యేక పూజలు నిర్వహించి, మంగళ హరతులిచ్చారు. ఈ సందర్భంగా కవిత మాట్లడుతూ ఖైరతాబాద్ వినాయకుడిని ప్రజలంతా కొంగు బంగారంలా కొలుస్తారని అన్నారు. మట్టితో తొలిసారి యాభై అడుగుల విగ్రహం చేయడం, వైభవంగా పూజలు నిర్వహించడంపట్ల కమిటీ సభ్యులను అభినందించారు.


ప్రజలు ఏడాదంతా ఎదురుచూస్తారు.. కవిత
ఖైరతాబాద్ వినాయకుడి కోసం ప్రజలు ఏడాదంతా ఎదురు చూస్తారని, ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. మట్టితో ఇంత భారీ విగ్రహం తయారు చేయడం ప్రపంచానికి గొప్ప సందేశం ఇచ్చినట్లేనని, పర్యావరణ పరిరక్షణలో ఇది మరో మేల్కొలుపని కొనియాడారు. ఎంతో సంకల్పంతో ముందుకు సాగుతున్న  ఖైరతాబాద్ వినాయకుడి ఉత్సవ కమిటీ సభ్యులకు అభినందనలు తెలియజేశారు.






రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలి 
తెలంగాణ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ఖైరతాబాద్ గణపతిని ఎమ్మెల్సీ కవిత ప్రార్థించారు. అన్ని మతాల వారు కలసిమెలసి ఉండాలని కోరుకుంటున్నాను. తెలంగాణ రాకముందు ఖైరతాబాద్ గణేషుడిని దర్మించుకున్నప్పుడు ప్రత్యేక రాష్ట్రం రావాలని కోరుకున్నాము. ఇప్పుడు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని వేడుకుంటున్నామని కవిత అన్నారు. అందరూ సంతోషంగా ఉండాలని మహా గణపతిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, చైర్మన్లు గజ్జల నగేష్ మరియు మేడే రాజీవ్ సాగర్ పాల్గొన్నారు.


68 ఏళ్లలో ఖైరతాబాద్ తొలిసారిగా..
పర్యావరణ పరిరక్షణ కోసం తొలిసారిగా మట్టి గణపతి విగ్రహం తయారుచేశారు. 1954వ సంవత్సరంలో తొలిసారి ఒక్క అడుగుతో మొదలైన ఖైరతాబాద్ గణేశుడు ప్రతి ఏటా ఒక్కో అడుగు పెంచుకుంటూ వస్తున్నాం. అయితే ఖైరతాబాద్ గణేశుడి విగ్రహం 60 అడుగులకు చేరిన తర్వాత 2014లో షష్టిపూర్తి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నిమజ్జనం సమస్యలు, ఆకారం సమస్యలను అధిగమించేందుకు ప్రతి ఏటా ఎత్తు తగ్గిస్తూ వస్తున్నారు. ఈ సంవత్సరం 50 అడుగుల గణేశుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయగా, 68 ఏళ్ల ఖైరతాబాద్ గణేష్ చరిత్రలో తొలిసారి మట్టి గణపతి విగ్రహం రూపొందించారు. ఈ ఏడాది ఖైరతాబాద్ గణపయ్య పేరు పంచముఖ మహాలక్ష్మి గణపతి.


రెండేళ్లుగా నగరంలో కరోనా మహమ్మారి గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనానికి కాస్త విఘ్నం కలిగించగా, ఈ ఏడాది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పలు జాగ్రత్తలు తీసుకుని నిమజ్జనం జరిగేలా చేయనుంది. భక్తులు తమ విగ్రహాలను నిమజ్జనం చేయడానికి నగరంలో పలుచోట్ల పోర్టబుల్ ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ఫైబర్ రీన్‌ఫోర్స్డ్ ప్లాస్టిక్ వాటర్ పాండ్‌లను ఏర్పాటు చేసింది. మరోవైపు హుస్సేన్ సాగర్, ఇతర పెద్ద జలాశయాలలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (PoP) తో తయారుచేసిన గణపతి విగ్రహాలను నిమజ్జనం చేయడానికి వీలులేదని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. దాంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు పర్యావరణాన్ని కాపాడటమే లక్ష్యంగా తెలంగాణ సర్కార్ చర్యలు చేపట్టింది.