చిన్న చిన్న పనులు కూడా వాయిదా వేసేవాళ్లు ఎంతో మంది. పనులు ఎప్పటికప్పుడు చేయడం వల్ల ఆ పని పూర్తవుతుంది. కానీ ఎంత మంది వాయిదా వేయకుండా సకాలంలో పనులు చేస్తున్నారు? అలా చేసేవాళ్లందరూ మానసిక రోగాల బారిన పడే అవకాశం తక్కువే. ఎవరైతే వాయిదా పద్దతులు ఫాలో అవుతారో వారు మాత్రం భవిష్యత్తులో త్వరగా డిప్రెషన్ బారిన పడే అవకాశం ఉంది. వాయిదా వేయడం అనేది సోమరితనాన్ని, సమయ నిర్వహణ లేమిని సూచిస్తుంది. అధ్యయనాల ప్రకారం ఈ రెండు లక్షణాలు మూడ్ మేనేజ్మెంట్‌కు సంబంధించినవి. వాయిదా వేసే లక్షణమున్న వ్యక్తులు పనిని ప్రారంభించకుండానే వాయిదా వేస్తారు, లేదా పని మధ్యలో వాయిదా వేస్తారు. దీన్ని చాలా చిన్న విషయంగా తీసుకోవద్దు.
మెదడుతో సంబంధం
మెదడులోని కొన్ని భాగాలు కొన్ని విషయాలను నియంత్రణలో ఉంచుకుంటాయి. అంటే నడవడం, తినడం, ఆలోచించడం... ఇలా ప్రతిపనిని మెదడులోని ఒక్కోప్రాంతం చేస్తాయి. అలాగే వాయిదా వేయడం కూడా మెదడులోని కొన్నిప్రాంతాల పనితీరును సూచిస్తుంది. మెదడులోని భావోద్వేగాల నియంత్రణతో ముడిపడి ఉన్న ప్రాంతాలు వాయిదా వేసే వ్యక్తులలో భిన్నంగా ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. సాధారణంగా పరీక్షల కోసం చదవడం లేదా గడువులోగా ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడం వంటివి మానసికంగా భారంగా ఉండే పనులు. ఇలాంటివే ఎక్కువగా మెదడు వాయిదా వేయమని చెబుతుంది.
ఎవరు వాయిదా వేస్తారు?
మనస్తత్వవేత్తల ప్రకారం, ఎవరికైతే ఆత్మగౌరవం తక్కువగా ఉందో, ఎవరైతే పనిని తప్పించుకోవాలని చూస్తారో వారి మెదడే ఇలా వాయిదా వేయమని చెబుతుంది. ఎంత ముఖ్యమైన పని అయినా తప్పించుకునే భాగంలో వాయిదా వేస్తుంది. వీరిలో ఎక్కువ మంది డిప్రెషన్, మానసిక ఆందోళనల బారిన పడే అవకాశం ఎక్కువని కొత్త అధ్యయనం చెబుతోంది. కాబట్టి వాయిదా పద్ధతులు మానేయాలని సూచిస్తోంది. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామంతో సహా మంచి జీవనాన్ని సాగించేవారిలో వాయిదా వేసే అలవాటు తక్కువ.
వాయిదా వేయకుండా ఉండాలంటే...
వాయిదా వేయడం ఎలా ఆపాలి? అనే దాని కన్నాముందుగా మానసిక ఆరోగ్యాన్ని, భావోద్వేగాలను నియంత్రణలో ఉంచుకోవడం వంటి అంశాలపై దృష్టి పెట్టాలి. అలాగే వాయిదా వేయకుండా ఉండేందుకు కొన్ని చిట్కాలు పాటించాలి.
1. ఇతర విషయాల గురించి ఆలోచించడం తగ్గించి పనిపై దృష్టి కేంద్రీకరించాలి.
2. పనిని పాయింట్ల వారీగా విడగొట్టుకుని ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ రావాలి.
3. పని ముగిసే వరకు టైమ్ టేబుల్ వేసుకుని దాన్నే అనుసరించాలి.
4. పోషకాహారం తినండి.
5. వ్యాయామం, ధ్యానం వంటివి చేయండి.
Also read: క్లియోపాత్రా అందం రహస్యం ఇదే, ఇలా చేస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే
Also read: గర్భనిరోధక మాత్రల వల్ల భవిష్యత్తులో గర్భస్రావం, క్యాన్సర్ వంటి సమస్యలు వస్తాయా? ఏది అపోహ, ఏది నిజం?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.