సులువైన గర్భనిరోధక పద్ధతి గర్భనిరోధక మాత్రలు వాడడం. కానీ వాటిని వాడడం వల్ల చాలా సమస్యలు వస్తాయని ఎంతో మంది అభిప్రాయం. ఇందులో ఎంతవరకు నిజమో తెలిపే కథనమే ఇది. గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 20 కోట్లకు మందికి పైగా మహిళలు నోటి ద్వారా మింగే గర్భనిరోధక మాత్రలను తీసుకుంటున్నారు. అయితే వారి మనసులో ఎన్నో అనుమానాలు. చుట్టుపక్కల వారు వాటిని తీసుకోవడం భవిష్యత్తులో తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతూ ఉంటారు. అవి మహిళల మనసులో తీవ్ర గందరగోళానికి కారణమవుతాయి. స్త్రీల లైంగిక, పునరుత్పత్తి ఆరోగ్యానికి సంబంధించి ఉన్న అనేక అపోహలు, సందేహాలు నివృత్తి చేయడమే మా ముఖ్య ఉద్దేశం.
అపోహ: గర్భనిరోధక మాత్రలు వాడడం వల్ల బరువు పెరుగుతారు
నిజం: గర్భనిరోధక మాత్రలు తేలికపాటి దుష్ప్రభావాలను కలిగి ఉంటాయి. అయితే గర్భనిరోధక మాత్రలకు, బరువు పెరగడానికి మధ్య ఎలాంటి సంబంధం ఉన్నట్టు అధ్యయనాలు తేల్చలేదు. వాటిని వాడడం వల్లే బరువు పెరిగామనుకోవడం కేవలం అపోహ.
అపోహ: గర్భనిరోధక మాత్రలు క్యాన్సర్‌కు కారణమవుతాయి
నిజం: ఇది పూర్తిగా అపోహే. ఈ మాత్రలను వాడడం వల్ల క్యాన్సర్ రాదు. నిజం చెప్పాలంటే ఇవి ఎండోమెట్రియల్, అండాశయ క్యాన్సర్ వంటివి రాకుండా అడ్డుకుంటాయని అధ్యయనాలు నిరూపించాయి.
అపోహ: ఇవి మహిళల్లో సహజ సంతానోత్పత్తికి ఆటంకం కలిగిస్తాయి
నిజం: ఫ్యామిలిప్లానింగ్ ఆపరేషన్ చేసుకుంటే తప్ప ఇతర ఏ గర్భనిరోధక పద్ధతి మీ సంతానోత్పత్తికి అడ్డుకోలేదు. గర్భనిరోధక మాత్రలు సంతానోత్పత్తి వ్యవస్థకు ఎలాంటి హాని కలిగించదు. ఎప్పుడైతే మళ్లీ మీరు గర్భం ధరించాలనుకుంటున్నారో అప్పుడు వీటిని ఆపేస్తే సరి.
అపోహ: ఈ మాత్రలు లైంగిక వ్యాధులను కలిగిస్తాయి.
నిజం: కండోమ్‌లు వంటివి వాడినప్పుడు అవి చిరిగిపోవడం వల్ల లైంగిక వ్యాధులు సంక్రమించే అవకాశం ఉంది. కానీ గర్భనిరోధక మాత్రల వల్ల మాత్రం ఎలాంటి లైంగిక వ్యాధులు రావు. ఎక్కువ మంది భాగస్వాములను కలిగిఉండడం వల్లే లైంగిక వ్యాధులు వస్తాయి.
అపోహ: గర్భనిరోధక మాత్రలు అబార్షన్లకు కారణమవుతాయి
నిజం: వీటిని వాడడం వల్ల భవిష్యత్తులో గర్భం దాల్చాక అబార్షన్లు అవుతాయని చాలా మంది అభిప్రాయం. కానీ ఇది పూర్తిగా అబద్ధం.
అపోహ: గర్భనిరోధక మాత్రలు స్త్రీలలో స్ట్రోక్‌లకు కారణమవుతాయి
నిజం: ఈ విషయాన్ని ఏ అధ్యయనాలు నిరూపించలేదు. ఇందులో ఎంత నిజమన్నది కూడా తెలియదు. వీటి వల్ల రక్తం గడ్డకట్టడవం, స్ట్రోక్స్ రావడం వంటివి జరుగుతాయని కచ్చితంగా చెప్పలేము.
Also read: హిమాలయాల్లో దొరికే నల్లటి ఖనిజం శిలాజిత్తు, దీన్ని తింటే మగవారి సమస్యలు దూరం
Also read: పండంటి బిడ్డ కోసం ప్రెగ్నెన్సీకి ముందు కచ్చితంగా చేయించుకోవాల్సిన టెస్టులు ఇవే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.