తల్లి కావాలని ప్రతి స్త్రీ కోరుకుంటుంది. గర్భం ధరించాక వారు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ గర్భం ధరించాలని, పిల్లల్ని కనాలని ప్రయత్నిస్తున్నప్పట్నించే జాగ్రత్తలు తీసుకోవడం మొదలుపెట్టాలి. ముఖ్యంగా కొన్ని రకాల టెస్టులు చేయించుకోవాలి. దీని వల్ల తల్లిలో ఉన్న సమస్యలు ముందే తెలుస్తాయి. ముందుగా వాటికి చికిత్స తీసుకుంటే గర్భం ధరించాక ఎలాంటి సమస్యలు రావు. పండంటి బిడ్డ పుట్టే అవకాశం అధికంగా ఉంటాయి. కాబట్టి పిల్లల ప్లానింగ్‌లో ఉన్నప్పుడే వైద్యులను కలిసి టెస్టులు చేయించుకోవాలి.
ప్రీ కన్షెప్షన్ చెకప్ (Preconception Checkup)
ఈ చెకప్‌లో భాగంగా వైద్యులు మీ శరీరం మొత్తం ఆరోగ్యాన్ని చెక్ చేస్తారు. ఫోలిక్ యాసిడ్ ఎంతుందో చూస్తారు. ఇది శరీరంలోని ప్రతి కణం ఆరోగ్యంగా ఎదిగేందుకు చాలా అవసరం. శిశువుకు హాని కలిగించే ముందస్తు ఆరోగ్యసమస్యలను తల్లిలో గుర్తించడం కుదురుతుంది. ఎలాంటి సమస్యలేకపోతే హ్యాపీగా పిల్లల్ని కనవచ్చు. ఏదైనా సమస్య అనిపిస్తే ముందుగా దానికి చికిత్స తీసుకుని తరువాత ముందుకు వెళ్లాలి.
ఫిజికల్ టెస్టు
ఇందులో మీ రక్తపోటు, ఎత్తు, బరువు చూస్తారు. ఎత్తుకు తగ్గ బరువు లేకపోయినా ముందుగా బీఎమ్ఐ సరిగా ఉంచుకోమని సూచిస్తారు. గుండె సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు, పొట్ట సమస్యలు కూడా చెక్ చేస్తారు.
గైనకాలజికల్ టెస్టులు
ఈ టెస్టుల్లో మహిళ జననాంగాల సమస్యలను చెక్ చేస్తారు. యూరినరీ ఇన్ఫెక్షన్లు, లైంగిక వ్యాధులు ఏమైనా ఉన్నాయేమో చూస్తారు. యూరిన్ శాంపిల్ లేదా అక్కడి స్వాబ్ టెస్టు ద్వారా వీటిని నిర్ధారిస్తారు. గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ ఉందేమో కూడా చూస్తారు.
యూరిన్ టెస్టు
యూరిన్ టెస్టు రొటీన్ గా అందరూ చేస్తారు. గర్భం ధరించకముందు కూడా ఈ టెస్టు చేయించుకోవాలి. ఇందులో కూడా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, గ్లూకోజ్ టోలెరెన్స్ వంటి సమస్యలు ఉన్నాయేమో చెక్ చేస్తారు. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నదేమో చూస్తారు.
బ్లడ్ టెస్టు
బ్లడ్ టెస్టులో రక్తహీనత, తలసేమియా, చికెన్ పాక్స్, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, థైరాయిడ్ డిస్ఫంక్షన్, హెర్ఫ్స్ వంటి వ్యాధులు ఉన్నాయేమో స్క్రీనింగ్ చేస్తారు.
పొట్టకి అల్ట్రాసౌండ్
గర్భధారణకు గర్భసంచి ఆరోగ్యంగా ఉండాలి. అండాశయాల్లో సిస్టులు, ఫైబ్రాయిడ్స్ వంటివి ఉండకూడదు. అవి ఉన్నాయేయో కూడా ఓసారి అల్ట్రాసౌండ్ చేసి చెక్ చేస్తారు.
వంశపారంపర్య సమస్యలు
కొన్ని ఆరోగ్య సమస్యలు వంశపారంపర్యంగా వస్తాయి. వాటిని కొన్ని రకాల రక్త పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు. అవి మీ నుంచి మీ బిడ్డకు కూడా సోకే అవకాశం ఉంది. ముఖ్యంగా మేనరిక సంబంధాలు చేసుకున్నవాళ్లు కచ్చితంగా వైద్యులును కలిసి ఈ టెస్టులు చేయిపించుకోవాలి.
Also read: వీగన్ల కోసం శాకాహార గుడ్లు, వీటిని ఎలా తయారుచేస్తారంటే
Also read: మధుమేహులకు తెల్లన్నం ఎంత హాని చేస్తుందో చపాతీలు అంతే హాని చేస్తాయి, ICMR అధ్యయనం
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.