నియోజకవర్గాల పునర్విభజన అనంతరం ఖమ్మం జిల్లాలో కొత్తగా ఏర్పడిన వైరా నియోజకవర్గం నుంచి 2009లో బానోత్‌ చంద్రావతి విజయం సాదించారు. వైద్యురాలిగా ఉన్న చంద్రావతి అసెంబ్లీలో అతి పిన్న వయస్కురాలిగా అప్పట్లో సంచలనం సృష్టించారు. సీపీఐ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాదించిన చంద్రావతి ఆ తర్వాత 2014 ఎన్నికల ముందు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరి ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ నుంచి పోటీ చేసిన బానోత్‌ మదన్‌లాల్‌ విజయం సాదించారు. అయితే ఆ తర్వాత ఆయన కూడా టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోవడంతో చంద్రావతిని టీఎస్‌పీఎస్‌సీ సభ్యురాలిగా ప్రభుత్వం నియమించింది. అయితే 2018 ఎన్నికల్లో టిక్కెట్‌ రానప్పటికీ టీఆర్‌ఎస్‌ పార్టీలోనే ఉంది. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ టిక్కెట్‌పై పోటీ చేసిన బానోత్‌ మదన్‌లాల్‌పై అనూహ్యంగా ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన రాములునాయక్‌ విజయం సాదించారు.


టిక్కెట్‌ వేటలో ఆ ముగ్గురు..
రాములు నాయక్‌ విజయం సాదించిన తర్వాత వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ తరుచూ వార్తలో ఉండటం, ఆయనపై వ్యతిరేకత పెరిగిందనే భావన నెలకొనడంతో మాజీ ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. మరోవైపు సొంత పార్టీ నేతలపై కేసులు పెట్టేంత వరకు ఎమ్మెల్యే వ్యవహార శైలి ఉండటంతో అటు మదన్‌లాల్, చంద్రావతి ఇద్దరు టిక్కెట్‌ బరిలో తామున్నామంటూ తమ క్యాడర్‌ను సన్నద్దం చేసుకుంటున్నారు. మరోవైపు ఎమ్మెల్యే సైతం తరుచూ పర్యటనలు చేస్తున్నప్పటికీ వరుసగా ఈ ఇద్దరు నేతలు నియోజకవర్గంలో పర్యటిస్తుండటం, కార్యకర్తలతో మమేకం అయ్యేందుకు చూస్తుండటంతో వైరాలో టీఆర్‌ఎస్‌ టిక్కెట్‌ ఎవరికి వస్తుందనే విషయం ఇప్పుడు నియోజకవర్గ వ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారింది. 
వరుస పర్యటనలో బిజీగా చంద్రావతి..
2014 తర్వాత కొంత స్పీడ్‌ తగ్గించిన బానోత్‌ చంద్రావతి ఇప్పుడు నియోజకవర్గంలో వరుస పర్యటనలతో బిజీగా మారారు. పరామర్శలు, శుభకార్యాలకు హాజరవుతూ పాత క్యాడర్‌ను కలుసుకునే పనిలో పడ్డారు. 2018 ఎన్నికల్లో టిక్కెట్‌ రానప్పటికీ పార్టీకి విధేయురాలిగా ఉన్న తనకే ఈ దఫా టిక్కెట్‌ వరిస్తుందని ఆశతో ఉన్నారు. మరోవైపు ఇద్దరి నేతల మద్య వైరం బాగా పెరగడంతో అది కాస్తా తనకు కలిసొస్తుందనే ఆశతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో నియోజకవర్గంలో తన క్యాడర్‌ను కలవడంతోపాటు వరుస పర్యటనలతో బిజీగా ఉండటం గమనార్హం.


దీనికి తోడు జిల్లాలో టీఆర్‌ఎస్‌ పార్టీలో వర్గపోరు నెలకొన్న నేపథ్యంలో వర్గాలకు అతీతంగా ఉండటం తనకు కలిసొస్తుందనే భావనలో ఉన్నారు. దీంతోపాటు కేసీఆర్, కేటీఆర్‌ ఆశీస్సులు చంద్రావతికే ఉన్నాయని, ఆమెకే టిక్కెట్‌ వస్తుందని క్యాడర్‌ కూడా చెప్పడం నియోజకవర్గంలో చర్చగా మారింది. ఇదిలా ఉండగా ఇటీవల కాలంలో ఎమ్మెల్యే సైతం నియోజకవర్గంలో బాగా పర్యటించడం, వరుస కార్యక్రమాలతో బిజీగా మారిన నేపథ్యంలో మరి ఈ ఇద్దరిలో ఎవరికి టిక్కెట్‌ వస్తుంది? లేక బానోత్‌ మదన్‌లాల్‌కే టీఆర్‌ఎస్‌ పెద్దలు మొగ్గు చూపుతారా..? అనే విషయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. ఏది ఏమైనప్పటికీ అధికార పార్టీలో మూడు ముక్కలాటగా మారిన వైరా నియోజకవర్గంలో టిక్కెట్‌ ఎవరిని వరిస్తుందనేది వేచి చూడాల్సిందే.