డయాబటెటిస్ ఒకసారి వచ్చిందా? మళ్లీ పోవడమంటూ ఉండదు. రక్తంలో చక్కెర శాతాన్ని పెరగకుండా చూసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మధుమేహాన్ని రివర్స్ చేయడానికి కొన్ని రకాల చిట్కాలు పాటించమని చెబుతోంది ICMR అధ్యయనం. ICMR అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. ఇది ‘ఇండియా డయాబెటిస్’ పేరుతో అధ్యయనాన్ని నిర్వహించింది. ఈ అధ్యయనంలో డయాబెటిస్ ఉన్న వారికి, ప్రీడయాబెటిక్ రోగులకు కొన్ని ఆహార సిఫార్సులను చేసింది.
ఇలా తినాలి
మధుమేహం నిర్ధారణ అయిన తరవాత ఆహారంలో చాలా మార్పులు చేసుకోవాలని సూచిస్తోంది అధ్యయనం. కార్బోహైడ్రేట్ల వినియోగాన్ని 55 శాతం తగ్గించేయాలి. ప్రొటీన్, మంచి కొవ్వు ఉన్న ఆహారాలను తినడం 20 నుంచి 25 శాతం పెంచాలి. సాధారణంగా మనదేశంలో ఎక్కువ మంది తినేది తెల్లన్నం, చపాతీలే. వీటి వల్ల మనం రోజూ 70 శాతం కన్నా అధికంగా కార్బోహైడ్రేట్లను తింటాము. కాబట్టి పిండి పదార్థాలుండే ఆహారాన్ని తగ్గించి పొట్రీన్ ఉండే ఆహారాన్ని పెంచుకోవాలని సూచిస్తోంది అధ్యయనం.
ప్రీడయాబెటిక్ వారు...
ఇక ప్రీడయాబెటిస్ వారికి కూడా కొన్ని సూచనలు చేసింది అధ్యయనం. ప్రీడయాబెటిస్ అంటే డయాబెటిక్‌కు ముందు దశ. ఈ దశలో జాగ్రత్తలు తీసుకుంటే మధుమేహాన్ని కంట్రోల్ లోనే ఉంచ వచ్చు. ముఖ్యంగా మందులు వాడాల్సిన అవసరం లేదు. కేవలం ఆహారం ద్వారానే కంట్రోల్‌లో ఉంవవచ్చు. ప్రీడయాబెటిస్ వారు రోజులో తాము తినే ఆహారంలో 56 శాతం దాకా కార్బోహైడ్రేట్లు తినవచ్చు. ఇక ప్రొటీన్ 20 శాతం ఉండేలా, మంచి కొవ్వులు 27 శాతం ఉండేలా చూసుకోవాలి. ఈ అధ్యయనంలో భాగంగా 18,090 మంది డయాబెటిస్, ప్రీ డయాబెటిస్ రోగులను పరిశీలించారు.
చపాతీలు హానికరమే..
చాలా మంది డయాబెటిస్ రోగులు చేసేపని అన్నం మానేసి చపాతీలు తింటారు. కానీ ICMR అధ్యయనకర్తలు చెబుతున్న ప్రకారం చపాతీలు కూడా రోజూ తినడం వల్ల మధుమేహులకు హాని చేస్తాయి. గోధుమల్లో గ్లూటెన్ ఉంటుంది. ఇది డయాబెటిస్ లక్షణాలను పెంచేస్తుంది. కాబట్టి నాలుగు రోటీలు తినే బదులు, రెండు రోటీలు తిని మిగతావి మంచి ప్రొటీన్ నిండిన కూరలతో భర్తీ చేసుకుంటే మంచిది అని చెబుతున్నారు పరిశోధకులు.
ఏం తినాలి?
మొక్కల ఆధారిత ఆహారాన్ని తినడం చాలా మంచిది. మటన్ అధికంగా తినకూడదు, చేపలు, చికెన్ మధుమేహులకు మేలు చేస్తాయి. సోయా మీల్ మేకర్, బీన్స్, చిక్కుళ్లు, గుడ్డు, రాజ్మా, పీనట్ బటర్, పప్పులు కూడా మంచిది. ప్రొటీన్ అధికంగా ఉంటుంది.
భారతదేశంల ప్రస్తుతం ఏడు కోట్ల 40 లక్షల మంది మధుమేహంతో జీవిస్తున్నారు. మరో ఎనిమిది కోట్ల మంది ప్రీ-డయాబెటిక్ దశలో ఉన్నారు. భారతదేశంలో మధుమేహం బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. 2045 నాటికి భారతదేశంలో 135 మిలియన్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉంటారని అంచనా.
Also read: ఈ పండ్లు ఎక్కడైనా కనిపిస్తే కచ్చితంగా తినండి, క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటాయి
Also read: పీరియడ్స్ వచ్చే ముందు రొమ్ముల్లో నొప్పి రావడం సహజమేనా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.