జీడిపప్పు ఎక్కడి నుంచి వస్తుంది? జీడి పండుకు చివర తొడిగే మొగ్గనే జీడిపప్పు. జీడిపప్పును ఎన్నో పోషకాల ఆహార జాబితాలో కలిపేశారు. కానీ జీడిపండును మాత్రం ఎవరూ పట్టించుకోరు. నిజం చెప్పాలంటే జీడిపప్పు కన్నా జీడి పండులోనే పోషకాలు అధికం. దీన్ని ఆంగ్లంలో ‘క్యాషూ ఆపిల్’ అంటారు. పసుపు, ఎరుపు, నారింజరంగుల్లో మెరిసిపోతుంది ఈ పండు. వీటితో ఆల్కహాల్ కూడా తయారుచేస్తారు. ఈ పండ్లలో రాగి, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఇనుము, జింక్ వంటి ప్రొటీన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి.
1. ఈ రుచికరమైన పండులో అత్యవసరమైన ఎన్నో విటమిన్లు ఉన్నాయి. ఇవి శరీరంలోకి ప్రవేశించే ఇన్ఫెక్షన్ లేదా హానికరమైన బ్యాక్టిరియాలు,వైరస్‌లతో పోరాడతాయి. ఇందులో జింక్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను బలంగా మారుస్తాయి. తరచూ ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండాలంటే జీడిపండ్లను అప్పుడప్పుడు తినాలి.
2. క్యాన్సర్‌ను రాకుండా అడ్డుకోవడంలో జీడి పండులోని సమ్మేళనాలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. వీటిలో ప్రోయాంథోసైనిన్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి. కాబట్టి ఈ పండ్లు అందుబాటులో దొరికితే కచ్చితంగా తినండి. వీటిలో రాగి కూడా అధికంగా ఉంటుంది. పెద్ద పేగు క్యాన్సర్‌ను రాకుండా సమర్థవంతంగా అడ్డుకుంటాయి.
3. ఆధునిక కాలంలో గుండె సంబంధిత వ్యాధులు అధికంగా దాడి చేస్తున్నాయి. జీడిపండులో ఉండే కొవ్వు పదార్థాలు గుండెకు చాలా మేలు చేస్తాయి. ఈ కొవ్వు మంచిది, చెడు కొవ్వు కాదు. అందుకే ఆ కొవ్వులు గుండెకు మేలు చేస్తాయి. అంతేకాదు మెదడు పనితీరును మెరుగుపరచడానికి సహాయపడతాయి. రక్తపోటును కూడా నియంత్రణలో ఉంచుతుంది.
4. అధిక బరువును తగ్గించడంలో ఇవి సాయపడతాయి. దీనిలో డైటరీ ఫైబర్ ఎక్కువ. దీని వల్ల బరువు తగ్గడం సులభతరం అవుతుంది. ఊబకాయులు ఈ పండ్లను తరచూ తినడం వల్ల మేలు జరుగుతుంది.
5. కండరాలు, కణజాల రక్షణకు జీడిపండ్లు మేలు చేస్తుంది. వాటిని బలోపేతం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.
6. ఈ పండులో కాల్షియంతో పాటూ ఇతర పోషకాలు ఉన్నాయి. ఇవి ఎముకలను బలంగా మారుస్తాయి.
7. రక్త హీనతతో బాధపడేవారు జీడిపండును తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఇనుము శరీరంలో తగినంత ఉంటే శరీరమంతా ఆక్సిజన్ బదిలీ జరుగుతుంది. తద్వారా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
8. కంటి ఆరోగ్యానికి ఇది ఎంతో మంచిది. దీనిలో అధికస్థాయిలో లూటిన్, జియాక్సంతిన్ ఉంటాయి. సూర్య కిరణాల నుంచి వచ్చే హానికరమైన రేడియేషన్ నుంచి కళ్లను కాపాడతాయి. కంటి శుక్లం ఏర్పడకుండా కాపాడుతుంది.
Also read: పీరియడ్స్ వచ్చే ముందు రొమ్ముల్లో నొప్పి రావడం సహజమేనా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.