కరోనా వైరస్ సోకి తగ్గిన వారి సంఖ్య మనదేశంలో అధికమే. వైరస్ సోకినప్పుడు కొందరిలో స్వల్ప లక్షణాలు చాలా తక్కువ కాలమే ఉండి త్వరగానే కోలుకుంటున్నారు. అయితే కరోనా వైరస్ తగ్గినా కూడా కొందరిలో కరోనా లక్షణాలు మాత్రం దీర్ఘకాలంగా కనిపిస్తున్నాయి. దీన్నే లాంగ్ కోవిడ్ అంటారు.  దాదాపు 30 శాతం మందిని ఇలా లాంగ్ కోవిడ్ లక్షణాలు వేధిస్తున్నట్టు అధ్యయనంలో తెలిసింది. వైరస్ సంబంధిత సూక్ష్మ వ్యాధి కణాల ప్రభావం వల్ల లక్షణాలు ఇంకా శరీరంలో ఉంటున్నాయని, అవి రోగులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయని తేలింది. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజెలస్ వారు నిర్వహించిన పరిశోధనలో చాలా మంది పోస్ట్ కోవిడ్ బాధితులు ఉన్నారని తేలింది. వారంతా కరోనా తాలూకు లక్షణాలతో నెలల పాటూ బాధపడుతున్నట్టు బయటపడింది. ముఖ్యంగా డయాబెటిస్, ఊబకాయం సమస్యలతో బాధపడుతూ కరోనా బారిన పడిన వారిలోనే లాంగ్ కోవిడ్ లక్షణాలు అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది. 


లక్షణాలు ఇవే
లాంగ్ కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్నవారిలో సాధారణంగా కనిపించే లక్షణాలు ఇలా ఉన్నాయి. కాసేపు నడిచినా తీవ్ర అలసటగా అనిపించడం, అప్పుడప్పుడు శ్వాస సరిగా అందకపోవడం, దగ్గు రావడం, కంటిచూపు మసకగా మారడం, వినికిడి సమస్యలు, తలనొప్పి తరచూ వస్తూ పోతుండడం, రుచి సరిగా తెలియకపోవడం, వాసన తెలియకపోవడం, కీళ్ల నొప్పులు వంటివి బాధిస్తాయి. అలాగే కొన్ని మానసిక సమస్యలు కూడా వేధిస్తాయి. మానసికంగా ఆందోళనగా అనిపించడం, డిప్రెషన్ గా అనిపించడం, ఆలోచనల్లో స్పష్టత లేకపోవడం వంటివి కలుగుతాయి. 


ఎన్నాళ్లు ఇలా?
లాంగ్ కోవిడ్ తో బాధపడే వారిలో లక్షణాలు ఎన్నాళ్లు కొనసాగుతాయో సరిగ్గా చెప్పలేమని అంటున్నారు వైద్యులు. కొందరిలో మూడు నెలలు, మరికొందరిలో ఏడు నెలలు ఇలా కొనసాగుతాయని తెలిపారు. అన్నింట్లో తీవ్రమైన అలసట రావడం దీర్ఘకాలిక కోవిడ్ లక్షణాల్లో ముఖ్యమైనదని చెబుతున్నారు. దీర్ఘకాలిక కోవిడ్ ఎందుకు వస్తుందో సరిగా చెప్పలేమని అంటున్నారు వైద్యులు. కరోనా తగ్గాక వైరస్ చాలా వరకు శరీరం నుంచి తొలగిపోవచ్చు. కానీ ఎక్కడైనా వైరస్ ఉండిపోవచ్చు. పేగుల్లో, నరాల్లో ఇలా ఎక్కవైనా సూక్ష్మరూపంలో వైరస్ ఉండిపోతే ఇలా లాంగ్ కోవిడ్ లక్షణాలు కనిపించవచ్చు అని వివరిస్తున్నారు వైద్యులు. పేగుల్లో ఉండిపోతే విరేచనాలు అయ్యే అవకాశం ఉంది, అదే నరాల్లో ఉండిపోతే రుచి, వాసన తెలియకపోవచ్చు. ప్రస్తుతానికి లాంగ్ కోవిడ్ కు ఎలాంటి చికిత్సలు అందుబాటులో లేవు. ఆరోగ్యకరమైన జీవనశైలి, బలవర్ధక మైన ఆహారాన్ని తీసుకుంటూ తట్టుకోవడమే. 


Also read: వేసవిలో ఐస్‌క్రీములు లాగిస్తున్నారా? మెదడుపై ఎంత ప్రభావం పడుతుందో తెలుసా?


Also read: ఎక్కిళ్లు వేధిస్తున్నాయా? వీటిని తింటే ఇట్టే తగ్గిపోతాయి