వేసవి వచ్చిందంటే గిరాకీ పెరిగిపోయే వాటిలో ఐస్ క్రీములు కూడా ఒకటి. వేసవి తాపాన్ని తట్టుకునేందుకు ఎంతో మంది  చల్లచల్లని ఐస్ క్రీములను రోజూ తినేస్తారు. కొంతమంది రోజుకు రెండు నుంచి నాలుగు వరకు లాగిస్తారు. మితంగా తింటే ఎంత లాభమో, ఇలా అతిగా తినడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. అందుకే రోజుకు ఒక ఐస్ క్రీముకు మించి తినకూడదని హెచ్చరిస్తున్నారు వైద్యులు. 


బరువు పెరుగుతుంది
ఒక అధ్యయనం ప్రకారం ఐస్ క్రీములో చక్కెర, కేలరీలు, కొవ్వు అధికంగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి పూర్తిగా హానికరం అని చెప్పలేం కానీ అతి శరీరంలో చేరితే మాత్రం చెడే చేస్తాయి. వీటిని అధికంగా తినడం వల్ల ఊబకాయం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఒక రోజులో రెండు కన్నా ఎక్కువ ఐస్ క్రీములు తింటే 1000 కంటే ఎక్కువ కేలరీలు శరీరానికి చేరుతాయి. దీనివల్ల క్రమేణా బరువు పెరుగుతారు. 


పొట్ట కొవ్వు
ఐస్ క్రీములో పిండి పదార్థాలు చాలా అధికంగా ఉంటాయి. దీన్ని తినడం ద్వారా అధికంగా శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు శరీరంలో చేరుతాయి. దీనివల్ల పొట్ట దగ్గరి కొవ్వు పేరుకుపోతుంది. 


గుండె జబ్బులు
ఐస్‌క్రీముల్లో సంతృప్త కొవ్వులు అధికంగా ఉంటాయి. వీటిని అధికంగా తినడం వల్ల ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ శరీరంలో పెరుగుతాయి. అధిక రక్తపోటు, అధిక బరువు ఉన్నవారు ఐస్ క్రీములను అధికంగా తింటే గుండెజబ్బులు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. ఒక కప్పు ఐస్ క్రీములో 10 గ్రాముల వరకు రక్తనాళాల్లో అడ్డుపడే సంతృప్త కొవ్వు ఉంటుంది. 28 గ్రాముల చక్కెర ఉంటుంది. 


మెదడుకు హాని
ఒక పరిశోధన ప్రకారం సంతృప్త కొవ్వులు, చక్కెరతో నిండిన ఈ ఆహారం తినడం వల్ల అభిజ్ఞా నైపుణ్యాలు, జ్ఞాపకశక్తి తగ్గుతుంది. ఒక కప్పు ఐస్ క్రీముతో సమస్య లేకపోయినా రెండుకు మించి ఒకే రోజు తినడం వల్ల ఇలా జరుగుతుంది. 


అతి నీరసం
ఐస్ క్రీము తినడం శక్తి రాదు, పైగా నీరసంగా అనిపిస్తుంది. కారణం దీనిలో కొవ్వు అధికంగా ఉంటుంది. ఇది జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. శక్తి అందదు. త్వరగా జీర్ణం కాకపోవడం వల్ల రాత్రి పూట నిద్ర కూడా సరిగా పట్టదు. 



Also read: ఎక్కిళ్లు వేధిస్తున్నాయా? వీటిని తింటే ఇట్టే తగ్గిపోతాయి


Also read: ఆల్కహాల్ అతిగా తాగుతున్నారా? ఈ లక్షణాలు కనిపిస్తే లివర్ డామేజ్ అయినట్టే