Weather Update: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఓ వైపు ఎండలు మండిపోతుంటే, మరోవైపు అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో తేలికపాటి వర్ష సూచన ఉందని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. బుధవారం వేకువజాము నుంచి తెలంగాణ, ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో పలు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. దక్షిణ అండమాన్ సముద్రంలో నేడు ఉపరితల ఆవర్తనం ఏర్పడనుంది. తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. దీని ప్రభావంతో మే 6వ తేదీన అల్ప పీడనం ఉర్పడే అవకాశం ఉండగా, అనంతరం 24 గంటల్లో మరింత బలపడనుందని వాతావరణ శాఖ పేర్కొంది. విపరీతమైన ఎండల నేపథ్యంలో ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.


కోస్తాంధ్రలో వర్షాలు..
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలలో పోల్చితే ఉత్తర కోస్తాంధ్ర జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు దాదాపు 5 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. అల్పపీడనం ప్రభావంతో మే 8 వరకు ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాలైన ఉమ్మడి విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం తూర్పు గోదావరి జిల్లాల్లో, యానాం ప్రాంతాల్లో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురవనున్నాయి. మరోవైపు అత్యధికంగా నందిగామలో, జంగమేశ్వరపురంలో గరిష్ట ఉష్ణోగ్రత 41.4 డిగ్రీలు నమోదైంది. గన్నవరంలో 41 డిగ్రీలు అమరావతిలో 40.9, తునిలో 39.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.  






దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో వాతావరణం నేడు మరింత పొడిగా మారుతుంది. ఉత్తర కోస్తాంధ్రతో పోల్చితే దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలలో ఎండలు భగభగ మండిపోతున్నాయి. ఈ ప్రాంతాల్లో వర్షాలు చాలా తక్కువగా కురుస్తాయని అధికారులు తెలిపారు. ఉమ్మడి అనంతపురం, చిత్తూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కొన్నిచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అత్యధికంగా కడపలో 41.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కర్నూలులో 41.4 డిగ్రీలు, తిరుపతిలో 40.2 డిగ్రీలు, నంద్యాలలో 41, అనంతపురంలో 40.3 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అమరావతి కేంద్రం తెలిపింది.


నిప్పుల కొలిమిలా తెలంగాణ..
దక్షిణ అండమాన్‌లో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో మే 7 వరకు వర్షాలు కురుస్తాయని  హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం వేకువజాము నుంచి హైదరాబాద్ సహా తెలంగాణలో పలు జిల్లాల్లో భారీగా వర్షం కురుస్తోంది. మరోవైపు రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలలో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నందున ఎల్లో అలర్ట్ సైతం జారీ చేసింది వాతావరణ కేంద్రం. ఒకట్రెండు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. అత్యధికంగా నల్గొండలో 43.5 డిగ్రీలు, ఆ తరువాత మెదక్‌లో 43.4 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 43.3 డిగ్రీలు, నిజామాబాద్‌లో 42.5 డిగ్రీలు, రామగుండంలో 42.2 డిగ్రీల మేర భారీ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరశాఖ పేర్కొంది.






Also Read: Gold Rate Today 4th May 2022: పసిడి జోరుకు బ్రేక్, నేడు నిలకడగా బంగారం ధరలు, భారీగా తగ్గిన వెండి ధర - లేటెస్ట్ రేట్లు ఇవీ


Also Read: Horoscope Today 4th May 2022: ఈ రాశులవారికి డబ్బు, గౌరవం, హోదా లభిస్తుంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి