Fatty liver warning: ఊబకాయం, మధుమేహం, చెడు అలవాట్లు మీ కాలేయాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తాయి. కాలేయంలో అధికంగా కొవ్వు పేరుకుపోయేందుకు దారితీసే ఫ్యాటీ లివర్ డిసీజ్‌కు కారణం అవుతుంది. ఈ వ్యాధి కారణంగా మనిషి జీవన విధానం అస్తవ్యస్తంగా మారుతుంది. దీన్ని సరైన సమయంలో గుర్తించినట్లయితే వ్యాధి తీవ్రత పెరిగి, లివర్ సిర్రోసిస్‌గా రూపాంతరం చెందుతుంది. ఇది కాలేయ వైఫల్యానికి కారణమయ్యే ప్రాణాంతక సమస్యగా కూడా మారవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఫ్యాటీ లివర్ వ్యాధి ముదిరితే శరీరంలోని అన్ని భాగాలు వాచిపోతాయని తెలిపారు. వీటి ద్వారా కాలేయ సమస్య ఉన్నట్లు తెలుసుకోవచ్చని చెప్పారు. శరీరంలోని ఏయే భాగాల్లో వాపును గుర్తించవచ్చో తెలుసుకుందాం.
కాళ్లు, చీలమండలవాపు:
ఫ్యాటీ లివర్ డిసీజ్ తో కాలేయ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇది పోర్టల్ హైపర్ టెన్షన్‌కు దారి తీస్తుంది. దాని నుంచి వచ్చే ఒత్తిడి కారణంగా కాళ్లు, చీలమండల్లో వాపు ఏర్పడుతుంది. ఒత్తిడి నిరంతరం పెరిగినట్లయితే శరీరం కణజాలంలో ద్రవం చేరి దాని ఫలితంగా వాపు ఏర్పడుతుంది.
పొత్తికడుపు వాపు :
ఫ్యాటీ లివర్ వ్యాధి ముదిరితే పొత్తికడుపులో వాపు వస్తుంది. ఉదర కుహరంలో ద్రవం పేరుకుపోవడాన్ని అసిటిస్ అంటారు. దీంతో కాలేయంలో వాపు వస్తుంది. ఫలితంగా కాలేయంలోని రక్త నాళాలు అధిక ఒత్తిడికి గురవుతాయి. దీన్ని పోర్టల్ హైపర్ టెన్షన్ అంటారు. ఈ సమస్య ఉన్నవారిలో ఒత్తిడి మరింత పెరిగి, కాలేయ రక్తనాళాల నుంచి ఉదర కుహరంలోకి ద్రవం చేరుతుంది. ఫలితంగా పొత్తికడుపు వాపు, అసౌకర్యానికి దారి తీస్తుంది. ఈ ద్రవం క్షయ, క్యాన్సర్ వంటి తీవ్ర వ్యాధుల ముప్పును మరింత పెంచుతుంది. అందుకే ఈ ద్రవాన్ని టెస్ట్ చేయించుకోవడం అవసరం.
పాదాల వాపు:
ఫ్యాటీ లివర్ వ్యాధి ముదిరినట్లయితే కాళ్లు, చీలమండలమే కాకుండా పాదాలు కూడా వాపునకు గురవుతాయి. ముఖం ఉబ్బడం, చేతులు కూడా వాచిపోతాయి.
పురుషుల్లో గైనెకోమాస్టియా రిస్క్:
మగవారిలో తీవ్రమైన ఫ్యాటీ లివర్ వ్యాధి గైనెకోమాస్టియాకు దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. అంటే రొమ్ము కణజాలం విస్తరించడం కారణంగా హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. దీంతో కాలేయం పనిచేయకపోవడం, లైంగిక కోరికలు తగ్గడం, వంధ్యత్వానికి దారి తీసే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.
జీవన శైలిలో మార్పులు:
ఈ శరీర భాగాల్లో నిరంతరం వాపు ఉన్నవారు రక్తపరీక్షలు సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్ వంటి టెస్టులు చేయించుకోవడం ముఖ్యం. వీటి ద్వారా శరీరంలో వాపునకు కచ్చితమైన కారణాన్ని తెలుసుకోవచ్చు. వ్యాధి నిర్ధారణ అయితే సరైన చికిత్స అందించేందుకు అవకాశం ఉంటుంది. అలాగే లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. హెల్తీ డైట్ ఫాలో అవ్వడం, రెగ్యులర్ గా వర్కౌట్స్ చేయడం, ఆల్కహాల్ కు దూరంగా ఉండటం వంటి మంచి పద్దతులను పాటించినట్లయితే ఫ్యాటీ లివర్ డిసీజ్ ప్రమాదం తగ్గుతుంది.
Also Read: New Trend on Dry Promotion : జీతాలు పెంచరట కానీ బాధ్యతలు పెంచుతారట.. ఇదే కొత్త ట్రెండ్
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఈ ఆహారాలు, పానీయాలు మీకు అలర్జీ లేదా ఇతరాత్ర అనారోగ్యాలకు దారితీయొచ్చు. కాబట్టి, ఆహారం, ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.