Parental Obesity : తల్లిదండ్రులు లావుగా ఉంటే.. నడి వయస్సు వచ్చేసరికి కొందరిలో ఓ సమస్య వస్తుందట. పేరెంట్స్​ నుంచి కేవలం ఆస్తులే కాదు.. ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని నిజం చేసింది ఓ అధ్యయనం. తల్లిదండ్రులు లావుగా ఉన్నవారిపై, వారి పిల్లలపై అధ్యయనం చేసింది. పేరెంట్స్ లావుగా ఉన్న వారు మధ్య వయస్సు వచ్చేసరికి ఊబకాయంతో బాధపడతారని ఈ స్టడీ తెలిపింది. సాధారణమైన వారితో పోలిస్తే.. ఊబకాయం వచ్చే అవకాశం ఆరు రెట్లు ఎక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. 


జీవితాంతం తప్పదు..


స్థూలకాయంతో పోరారడడం అనేది జీవితాంతం ముడిపడి ఉండే ఓ సమస్యగా నార్వే విశ్వవిద్యాలయ పరిశోధకులు తెలిపారు. అయితే ఊబకాయంతో బాధపడుతున్న తల్లిదండ్రులు ఉంటే.. పిల్లలు మధ్య వయస్సుకు వచ్చేసరికి వారిలో కూడా ఈ లక్షణాలు కనిపిస్తాయని.. ఊబకాయం వారిని వెంటాడుతుందని పరిశోధకులు గుర్తించారు. మునపటి పరిశోధనలు తల్లిదండ్రులు, వారి పిల్లల ఊబకాయం స్థితి మధ్య బలమైన అనుబంధాన్ని చూపించాయి. మరికొన్ని అధ్యయనాలు ఊబకాయం ఇంటర్​జెనరేషన్​ ట్రాన్స్ మిషన్ కౌమారదశలో, యుక్తవయస్సులో కొనసాగుతుందా అని పరిశోధించాయి. 


మధ్య వయస్సులోనే..


ఊబకాయం కలిగిన పేరెంట్స్ ఉంటే దాని ఎఫెక్ట్ మధ్య వయస్సులో పడుతుందని తాజా అధ్యయనం తెలిపింది. ఈ స్టడీలో 2068 మంది పెద్దలు పాల్గొన్నారు. వారు తమ తల్లిదండ్రుల డేటాను పరిశోధకులకు వివరించారు. అదే వయస్సులో కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని పోల్చేందుకు 2015 నుంచి 2016 వరకు 1994 నుంచి 1995 వరకు పేరెంట్స్ డేటాను సేకరించారు. ఎట్టకేలకు ఊబకాయం ప్రభావం మధ్య వయస్సులో ఉన్నప్పుడు ఆరు రెట్లు ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అంటున్నారు. 


రోజు రోజుకు పెరుగుతున్న ఊబకాయం


ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం.. స్థూలకాయం 30 కంటే ఎక్కువ బాడీ మాస్ ఇండెక్స్​గా(BMI) నిర్వహిస్తారు. ఇది సగటు వ్యక్తి శరీరంలో అసాధారణమైన లేదా అధిక కొవ్వు పేరుకుపోయేలా చేస్తుంది. అంతేకాకుండా ఆరోగ్యానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఊబకాయం పరిస్థితి రోజు రోజుకు పెరుగుతోందని గుర్తించారు. 1990 నుంచి 2022 వరకు 18 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సున్న వారిలో 7 నుంచి 16 శాతం రెట్టింపు వేగంతో ఊబకాయం బారిన పడుతున్నట్లు WHO నివేదించింది. 


సింగిల్ పేరెంట్ అయితే..


తల్లిదండ్రులకు ఊబకాయం ఉన్నవారిలో BMIలో ఆరురెట్లు ఊబకాయం వచ్చే ప్రమాదం ఉందని తాజా స్టడీ తెలిపింది. తల్లి BMIలో ప్రతి నాలుగు యూనిటల్ల పెరుగుదల.. తండ్రి BMIలో 3 యూనిట్ల పెరుగుదలకు కారణం అవుతుందని పరిశోధన కనుగొంది. తల్లిదండ్రులు ఇద్దరూ మధ్యవయస్సులో ఊబకాయంతో ఇబ్బంది పడినప్పపుడు.. పిల్లలు మధ్యవయస్సు నాటికి ఈ పరిస్థితిని అభివృద్ధి చేస్తుందని తెలిపారు. ఊబకాయంతో జీవించే తల్లి మాత్రమే ఉన్నవారికి ఊబకాయంతో జీవించే అవకాశాలు మూడు రెట్లు ఎక్కువగా ఉంటాయట. అయితే కేవలం తండ్రి మాత్రమే ఉన్నవారిలో ఈ ప్రమాదం కాస్త ఎక్కువాగ నాలుగు రెట్లు ఉంటుందని తెలిపారు. 


జన్యువుల ప్రభావంతో పాటు..


బరువు పెరగడానికి జన్యువులు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని తాజా అధ్యయనం తెలిపింది. అంతేకాకుండా అనారోగ్యకరమైన ఆహారం కూడా సులువుగా బరువు పెరిగేలా చేస్తుంది. జీవనశైలి కూడా దీనిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కొన్ని అధ్యయనాలు పిల్లలు పెద్దలతో కలిసి ఒకే విధమైన ఆహారం, వ్యాయామ అలవాట్లు అలవడుతాయని తెలిపారు. దానివల్ల కూడా ఊబకాయం వచ్చే పరిస్థితులు పెరుగుతాయంటున్నారు. అలాంటి సమయంలో ఇది జన్యువులు పరంగా జరిగిందా? పర్యావరణం వల్ల జరిగిందా అని నిర్థారించడం కష్టం. 


మరణాలకు ప్రధాన కారణం


ఊబకాయం ప్రపంచవ్యాప్తంగా చాలామంది మరణాలకు ప్రధాన కారణమవుతుంది. హృదయ సంబంధ వ్యాధులతో సహా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఊబకాయం వల్ల కలుగుతాయి. ఇవి ఆరోగ్యాన్ని బాగా ఇబ్బందులకు గురిచేస్తాయి. నిద్ర సమస్యలు, ఒత్తిడి వంటి మానసిక ఇబ్బందులను ఊబకాయం కలిగిస్తుంది. తాజాగా WHO నిర్వహించిన అధ్యయనంలో ఊబకాయం వల్ల దాదాపు 18 రకాల క్యాన్సర్లని అభివృద్ధి చేస్తుందని తెలిపింది. అంతేకాకుండా ఇది మరణ ప్రమాదాన్ని పెంచుతుందని వెల్లడించింది.


ఊబకాయాన్ని ఎదుర్కోనే మార్గాలు..


జన్యుపరంగానో.. వివిధ కారణాల వల్లనో ఊబకాయం వస్తే దాని గురించి కచ్చితంగా శ్రద్ధ తీసుకోవాలి. లేదంటే ఈ సమస్య మరింత పెరిగి ప్రాణాంతకమవుతుంది. కాబట్టి జీవనశైలిలో కొన్ని మార్పులు చేయాలి. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకునేందుకు బరువును అదుపులో ఉంచుకోవాలి. అందుకే రోజూ వ్యాయామం చేయాలి. కనీసం అరగంట నుంచి గంటవరకు వ్యాయామాలు, ఏరోబిక్స్ చేయాలి అంటున్నారు. 


ఒత్తిడిని తగ్గించుకోవాలి. దీనిని చాలామంది నిర్లక్ష్యం చేస్తారు కానీ.. ఒత్తిడి అనేది శారీరకంగా, మానసికంగా తీవ్రమమై ఇబ్బందులకు గురిచేస్తుంది. అంతేకాకుండా బరువు పెరగడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. పైగా స్ట్రెస్​ వల్ల ఎక్కువ ఫుడ్ క్రేవింగ్స్ వస్తాయి. అధిక కేలరీలు కలిగిన ఫుడ్​ తినాలనే కోరికను కలిగిస్తుంది. తద్వారా అది ఊబకాయానికి దారితీస్తుంది. 


ఫుడ్ విషయానికొస్తే..


ఊబకాయంతో ఇబ్బంది పడేవారు ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్లేట్​లో కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, చిక్కుళ్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ప్రోటీన్​ కూడా మంచిది. అలాగే గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ కలిగిన ఆహారం తీసుకోవడం చాలా మంచిది. ఇవన్నీ మీ బరువును అదుపులో ఉంచేందుకు హెల్ప్ చేస్తాయి. 


Also Read : సమ్మర్​లో చెరకు రసం తాగుతున్నారా? ఇది ఆరోగ్యానికి మంచి చేస్తుందా? లేదంటే..




గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.