Consequences of Insufficient Sleep : తగినంత నిద్ర లేకపోవడమనేది ఈ మధ్యకాలంలో చాలామంది ఎదుర్కొంటోన్న ప్రధాన సమస్య. ముఖ్యంగా రాత్రుళ్లు త్వరగా నిద్ర పట్టదు. ఫోన్స్ వాడకం నిద్రను మరింత దూరం చేస్తుంది. సరే రాత్రి నిద్రను ఉదయం కవర్ చేస్తారనుకుంటే.. వెళ్లాల్సిన పనులు చేయాల్సిన వర్క్స్ నిద్ర లేచేలా చేస్తున్నాయి. దీనివల్ల చాలామంది నిద్రకు దూరమవుతున్నారట. ఇలా రాత్రుళ్లు ఆలస్యంగా పడుకొని.. ఉదయాన్నే తొందరగా నిద్రలేస్తుంటే చాలా ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు నిపుణులు. 


సరైన నిద్ర లేకుంటే వచ్చే ఆరోగ్య సమస్యల్లో దీర్ఘకాలిక సమస్యలు కూడా ఉంటున్నాయి. అందుకే నిద్ర ప్రధాన్యతపై అవగాహన కల్పిస్తున్నారు నిపుణులు. అయినా సరే కొందరు పని ఉందనో.. లేదా సోషల్ మీడియా మాయలో సమయాన్ని వృథా చేస్తూ.. నిద్రకు దూరమవుతున్నారు. చాలామంది నిద్ర రావట్లేదు కాబట్టి ఫోన్​ చూస్తున్నామనుకుంటారు కానీ.. ఫోన్​ చూడడం వల్లే నిద్ర చక్రం డిస్టర్బ్ అవుతుందట. దీనివల్ల నిద్రచక్రం పూర్తి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందంటున్నారు. ఆ సైడ్ఎఫెక్ట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. 


దీర్ఘకాలిక సమస్యలు


సరైన నిద్ర లేకుంటే సిర్కాడియన్ రిథమ్ (Circadian Rhythm) దెబ్బతింటుంది. దీనివల్ల దీర్ఘకాలిక సమస్యలు వస్తాయి. ఇప్పటికే సమస్యలు ఉంటే అవి రెట్టింపు అవుతాయి. ముఖ్యంగా గుండె సమస్యలు ఎక్కువయ్యే ప్రమాదముంది. హార్మోనల్ సమస్యలు ఎక్కువై.. రక్తపోటు కూడా పెరుగుతుంది. మధుమేహం కూడా దాని వెంటే వస్తుంది. ఇవి ఒకసారి వస్తే.. జీవితాంతం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. 


ఒత్తిడి.. 


సరైన నిద్ర లేకుంటే శారీరకంగానే కాదు.. మానసికంగానూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటిలో ఒత్తిడి ఒకటి. ఎందుకంటే తక్కువ నిద్ర వల్ల అధిక కార్టిసాల్ విడుదలవుతుంది. ఇది ఒత్తిడిని రెట్టింపు చేసే ప్రధాన హార్మోన్​. ఈ హార్మోన్ ఎక్కువగా విడుదలైతే.. మీరు ఏ పనిపై ఫోకస్ చేయలేరు. ఎక్కువ టెన్షన్ పడిపోతుంటారు. రెస్ట్ తీసుకోలేరు. చివరికి గుండె సమస్యలు వస్తాయి. మధుమేహం, బీపీ రెట్టింపు అవుతాయి. 


జ్ఞాపకశక్తి.. 


మంచి నిద్ర ఉంటే.. శరీరంలో అన్ని రీసెట్ అవుతాయి. లేదంటే.. ఎక్కడి గొంగలి అక్కడే అన్నట్లు బ్రెయిన్ యాక్టివ్ అవ్వదు. దీనివల్ల జరిగే అతిపెద్ద నష్టం ఏంటంటే జ్ఞాపకశక్తి తగ్గిపోవడం. సరైన నిద్ర లేకుండా జ్ఞాపకశక్తి తగ్గుతుందని.. అల్జీమర్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందని పలు అధ్యయనాలు ఇప్పటికే నిరూపించాయి. దీనివల్ల కొత్త స్కిల్స్ నేర్చుకోలేరు. నేర్చుకున్నా అవి ఎక్కువకాలం గుర్తుండవు. పాత విషయాలు గుర్తు చేసుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. ఇది మీ పూర్తి ప్రొఫెషనల్ లైఫ్​ని దెబ్బతీస్తుంది. 


అధిక బరువు.. 


నిద్ర తక్కువగా ఉంటే.. శరీరంలో గ్రెలిన్ స్థాయిలు పెరుగుతాయి. ఇది మీకు ఆకలి ఎక్కువగా వేసేలా చేస్తుంది. మీరు ఎంత తిన్నా.. మళ్లీ ఆకలితో ఉంటారు. కడుపు నిండుగా ఉంది అనే ఫీల్​ని ఎక్కువసేపు ఉంచదు. ఆ ఫీల్​ని కలిగించే లెప్టిన్ అనే హార్మోన్ పనితీరును ఇది దెబ్బతీస్తుంది. దీనివల్ల మీకు ఎక్కువగా క్రేవింగ్స్ ఉంటాయి. అధిక కేలరీలు ఉండే ఫుడ్​ కోసం చూస్తారు. దీనివల్ల వేగంగా బరువు పెరుగుతారు. 



సెంటర్స్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నిద్రపై అధ్యయనం చేసి.. ముగ్గురిలో ఒకరికి తగినంత నిద్ర ఉండట్లేదని తేల్చింది. కేవలం పైన చెప్పిన సమస్యలే కాకుండా మరెన్నో సమస్యలు మనిషిని శారీరకంగా, మానసికంగా, లైంగికంగా కూడా దెబ్బతినేలా చేస్తుందని తెలిపింది. ఎక్కువగా చిరాకు పడడం, అసహనం వ్యక్తం చేయడం, కంగారుగా బిహేవ్ చేయడం వంటివి కూడా జరుగుతాయి. ఈ తరహా నిద్ర ఎక్కువ కాలం కొనసాగితే.. డిప్రెషన్​లోకి వెళ్లే అవకాశం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. అందుకే స్క్రీన్ సమయాన్ని తగ్గించి.. మంచి నిద్రను అందించే టిప్స్​ ఫాలో అవ్వాలంటున్నారు. 



Also Read : గుండె జబ్బులు రాకుండా, హార్ట్​ను హెల్తీగా ఉంచే సింపుల్ టిప్స్ ఇవే