East Godavari Crime News: తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో విషాదం చోటు చేసుకుంది. తాడిపర్రులో విద్యుత్‌షాక్‌తో నలుగురు యువకులు మరణించారు. విగ్రహావిష్కరణ సందర్భంగా ఫ్లెక్సీలు కడుతున్నప్పుడు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసులు స్పాట్‌కు వచ్చి కేసు నమోదు చేశారు. 


పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఫ్లెక్సీ కడుతుండగా ప్రమాదం జరిగింది. స్థానిక యువకుడు ఫ్లెక్సీ కడుతుండగా... అది హైటెన్షన్ వైర్లను తాకింది. దీంతో విద్యుత్‌ పాస్‌ అయ్యి మణికంఠ, నాగేంద్ర, వీర్రాజు, కృష్ణ స్పాట్‌లోనే చనిపోయారు. మరికొందరు గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. 


తాడిపర్రులో జరిగిన దుర్ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకొని విచారణ చేపట్టారు. స్థానికలను విచారించి కేసు నమోదు చేశారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. 


విద్యుత్ షాక్‌ ఘటనపై మంత్రి కందుల దుర్గేష్‌ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి మృతుల కుటుంబాలను పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున 5 లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. ‌క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు మంత్రి దుర్గేష్ ఆదేశించారు‌.


తాడిపర్రు ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత దిగ్భ్రాంతి  వ్యక్తం చేశారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ ఏర్పాట్లలో ప్రమాదం జరగడం బాధకరమన్నారు. మరణించిన బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు. ఎంతో భవిష్యత్ ఉన్న యువకుల అకాల మరణాన్ని తట్టుకునే ధైర్యం కుటుంబ సభ్యులకు, తల్లిదండ్రులకు భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించారు. తణుకు ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న  క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలందించి కాపాడాలని వైద్యాధికారులను హోమంత్రి ఆదేశించారు.