‘‘నేరం ఎవరు చేసినా నేరమే. చట్టానికి ఎవరూ చుట్టాలు కాదు’’ వంటి డైలాగులు మీరు ఎన్నోసార్లు సినిమాల్లో చూసి ఉంటారు. ఎన్నో నేరాలు చేసి రాజకీయవేత్తలుగా ఎదిగిన కొంతమంది పొలిటీషియన్స్ కూడా ఇలాంటి కామెంట్స్ చేస్తుంటారు. అయితే, మనుషుల కోసం మనుషులు సృష్టించిన ఈ చట్టాలు జంతువులకు కూడా వర్తిస్తాయా? అదెలా సాధ్యం? పాపం వాటికి మన చట్టాల గురించి ఎలా తెలుస్తుంది? అనేగా మీరు అంటున్నది. అది కూడా నిజమే. పాపం ఆ మూగ జీవులకు ఏం తెలుస్తుంది మన చట్టాల కోసం? కానీ, అక్కడ మాత్రం అవేవీ పట్టించుకోరు. నేరం ఎవరు చేసినా నేరమే. చివరికి జంతువులైనా సరే శిక్ష పడాల్సిందే. ఇంతకీ ఎక్కడా? ఏమిటా కథ?


దక్షిణ సూడాన్‌లో ఓ గొర్రె.. ఆదియు చాంపిక్ అనే 45 ఏళ్ల మహిళపై దాడి చేసింది. పరుగు పరుగున వెళ్లి ఆమె పక్కటెముకలను బలంగా గుద్దింది. దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. దీంతో అక్కడి ప్రజలు వెంటనే ఆ గొర్రెను అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. రుంబెక్ ఈస్ట్‌లోని అకుయెల్ యోల్‌లో ఈ ఘటన చోటుచేసుకుందని, పోలీసులు ఆ గొర్రెను పట్టుకుని పోలీస్ స్టేషన్‌లో పెట్టారని స్థానిక ‘ఐ రేడియో’ వెల్లడించింది. 


Also Read: కంటి చూపు అకస్మాత్తుగా మసకబారుతోందా? ఇది ఆ ముప్పుకు సంకేతం!


ఆమె మరణానికి కారణమైన గొర్రె యజమానిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గొర్రెను, అతడిని కోర్టుకు తీసుకెళ్లారు. ఈ కేసును విచారించిన కోర్టు.. ఈ నేరంలో ఆ గొర్రె యజమాని పాత్రలేదని తెలిపారు. ఆమెను చంపింది గొర్రె కాబ్టటి, దానికి శిక్ష విధించాలని న్యాయమూర్తి తెలిపారు. ఈ నేపథ్యంలో గొర్రెకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ఈ శిక్ష ప్రకారం ఆ గొర్రెను సూడాన్‌లో గల లేక్స్ స్టేట్‌లోని అడ్యూల్ కౌంటీ ప్రధాన కార్యాలయంలోని సైనిక శిబిరంలో మూడేళ్ల పాటు ఉంచుతారు. అయితే, ఆ గొర్రె తాను చేసిన నేరానికి పశ్చాతాపం వ్యక్తం చేస్తే.. శిక్ష తగ్గిస్తారా లేదా అనేది మాత్రం తెలియరాలేదు. అయితే, ఆ గొర్రె చేసిన పనికి యజమాని భారీ మూల్యమే చెల్లించుకోవలసి వచ్చింది. గొర్రె దాడిలో చనిపోయిన మహిళ కుటుంబానికి ఐదు ఆవులను పరిహారంగా ఇవ్వాలని కోర్టు తీర్పు ఇచ్చింది. అంతేగాక, మూడేళ్ల తర్వాత విడుదలయ్యే గొర్రెను కూడా బాధితురాలి కుటుంబానికే ఇవ్వాలని పేర్కొంది. అయితే, చనిపోయిన మహిళ.. మరెవ్వరో కాదు, ఆ గొర్రె యజమానికి బంధువే.


Also Read: ఈ ఊరిలో పులులు, ప్రజలు కలిసే జీవిస్తారు, ఎక్కడో కాదు ఇండియాలోనే!