ముగిసిన కరీంనగర్ ఇరిగేషన్ బిల్డింగ్ అధ్యాయం
నూతన నిర్మాణాల కారణంగా పాత బిల్డింగ్ కూల్చివేత
బ్రిటీష్ హయాం నుండి ఎన్నో ప్రాజెక్టులకు ఇక్కడే బీజం


ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అన్ని కార్యాలయాలలాగే అదొక ప్రభుత్వ కార్యాలయం. అయితే దానికో స్పెషాలిటీ ఉంది. దాదాపు 109 ఏళ్ల పాటు అనేక ప్రభుత్వాలకు తన సేవలు అందించిన కరీంనగర్ నడిబొడ్డున ఉన్న ఈ ఆఫీస్ జిల్లాలోని అనేక ప్రాజెక్టులకు పురుడు పోసింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ జిల్లా ఒక్కటే కాదు చుట్టుపక్కల ఉన్న అనేక జిల్లాలలో గత శతాబ్దంలో నిర్మించిన కొన్ని వందల ప్రాజెక్టులకు ఇక్కడి నుంచే ప్లాన్ గీసి, అమలుచేశారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా! ఈ బిల్డింగ్ త్వరలో చరిత్రలో మిగిలిపోనుంది. కొత్త కార్యాలయం నిర్మించాలని భావించిన తెలంగాణ ప్రభుత్వం దీన్ని ఇప్పుడు నేలమట్టం చేసింది.


మానేరు నుంచి కాళేశ్వరం వరకూ.. 
ఈ చిత్రంలో మీరు చూస్తున్న ఈ పురాతన బిల్డింగ్ కరీంనగర్ నడిబొడ్డున కలెక్టర్ నివాసానికి ఎదురుగా ఉండే ఇరిగేషన్ శాఖకు సంబంధించిన పురాతన భవనం. 1913లో ఈ బిల్డింగ్ ని నిర్మించారు. అంతే కాదు ఇక్కడ సర్వే ఆఫ్ ఇండియా తన అధికార కొలతలకు ప్రామాణికంగా నిలిచే రాయిని కూడా ఇక్కడే ఎస్టాబ్లిష్ చేశారు. విశాలమైన గదులతో సహజ సిద్ధంగా ఉండే గాలి వెలుతురు వచ్చే విధంగా నిర్మించిన ఈ బిల్డింగ్ అనేక మంది గొప్ప గొప్ప ఇంజినీర్లు ఊహించిన ప్రముఖ ఇంజనీరింగ్ భారీ ప్రాజెక్టులను సిద్ధం చేసింది. ప్రస్తుతం తెలంగాణలో మాట్లాడుకుంటున్న మానేరు ప్రాజెక్టులతో పాటు ఈ మధ్య వచ్చినటువంటి కాళేశ్వరం వరకూ అనేక ప్రాజెక్టులు ఇక్కడినుండే  అమలు చేశారు.


చివరి ఈఈ శ్రీనివాసరావు గుప్తా మాటల్లో.. 
ఇక అధికారికంగా 1955 నుండి ఇప్పటివరకు 51 మంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇక్కడి నుండి సేవలు అందించారు. మొట్టమొదటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా N N అయ్యంగార్ పని చేయగా ప్రస్తుతం శ్రీనివాసరావు గుప్తా ఈ బిల్డింగ్ నుంచి పనిచేసిన చివరి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్. ఈ బిల్డింగ్ కి సంబంధించిన చారిత్రక విషయాలు చెబుతూ.. అప్పట్లో ఈ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది కోసం ప్రత్యేకంగా క్వార్టర్లు కూడా నిర్మించారు. అంతేకాకుండా ఒక బావి కూడా కట్టారు. అప్పట్లో నీటి అవసరాలను తీర్చడానికి ఇది ఉపయోగపడేది. అప్పుడు పట్టణానికి దూరంగా ఉండేలా కనిపించిన ఈ భవనం ఇప్పుడు సిటీ సెంటర్ లో ఉంది. అయితే  ప్రభుత్వ కార్యాలయాలకు మరింత మెరుగైన సౌకర్యాల దృష్ట్యా దీన్ని కూల్చివేయాలని అధికారులు సూచించడంతో దీనికి సమయం దగ్గర పడింది. ఆనవాళ్ళు ఏమీ లేకుండా దీన్ని పూర్తిగా కూల్చివేశారు. ఎన్నో ప్రాజెక్టుల కలలను నెరవేర్చిన ఈ బిల్డింగ్ ఇక తెరమరుగైందన్నారు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీనివాసరావు గుప్తా.


Also Read: KTR Davos Tour: తెలంగాణకు మరో సక్సెస్, సుమారు 500 కోట్లతో కార్యకలాపాలను విస్తరిస్తున్న ఫెర్రింగ్ ఫార్మా 


Also Read: Fish Prasadam: ఆస్తమా పేషెంట్లకు చేదువార్త, ఈ ఏడాది సైతం చేప ప్రసాదం పంపిణీ లేదు - హైదరాబాద్‌కు రావొద్దని సూచన