కంటి చూపు సక్రమంగానే ఉన్నా.. ఒక్కోసారి కళ్లు బైర్లు కమ్మినట్లు ఉంటాయి. అకస్మాత్తుగా మాసకబారినట్లు కనిపిస్తుంది. కొందరికైతే రెండేసి దృశ్యాలు కనిపిస్తాయి. మరికొందరికి కళ్లల్లో ఏవో చుక్కలు ఉన్నట్లు కనిపిస్తాయి. అయితే, అవి దృష్టి లోపం వల్ల ఏర్పడినవని భావిస్తే పొరపాటే. అవి ఒక రకంగా మన శరీరంలోని అనారోగ్య సమస్యలకు సంకేతాలు. నమ్మలేకపోతున్నారా? దీనిపై వైద్యులు, నిపుణులు ఏం చెబుతున్నారో చూడండి. 


మెదడులో 80 శాతం ఇంద్రియ సమాచారం మీ కళ్ళ ద్వారానే వెళ్తుందని, కాబట్టి మీ కళ్ళు, రెటీనా ఆరోగ్యం అంతర్గతంగా నరాల పనితీరుపై ఆధారపడి ఉంటాయయని ఆప్టోమెట్రిస్ట్,  అమెరికన్ ఆప్టోమెట్రిక్ అసోసియేషన్ (AOA) ప్రెసిడెంట్ రాబర్ట్ లేమాన్ తెలిపారు. అనేక నాడీ సంబంధిత వ్యాధులను గురించి ముందుగా సంకేతాలను ఇచ్చేవి కళ్లేనని, ఇకపై మీ కళ్లలో ఏ సమస్య ఉన్నా డాక్టర్‌ను సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు.


అస్పష్టమైన దృష్టి అనేక కారణాలు: విభిన్న సమస్యల వలన అస్పష్టమైన దృష్టి కలుగుతుంది. వాటిని చాలా సులభంగా పరిష్కరించవచ్చు. కొత్త కళ్లద్దాల ప్రిస్క్రిప్షన్ అవసరం కావచ్చు. ఒక వేళ మీరు పనిచేసే ప్రాంతంలో ఏసీ అతిగా ఉన్న మీ కళ్లు ఆరిపోయి దృష్టి సమస్యలు ఏర్పడవచ్చు. అయితే, సరిదిద్దలేని వక్రీభవన లోపాలు, మెదడులో ఏర్పడే కణితుల వల్ల ఏర్పడే దృష్టి లోపాలు మరింత ప్రమాదకరమైనవి. కాబట్టి, మీ దృష్టి లోపం దేనివల్ల ఏర్పడిందనేది స్పష్టంగా తెలుసుకోవలసి ఉంటుంది. 


మల్టిపుల్ స్క్లెరోసిస్: అస్పష్టమైన దృష్టికి మరొక తీవ్రమైన కారణం ‘మల్టిపుల్ స్క్లెరోసిస్ (MS)’. దీనివల్ల మీ కళ్లను.. మెదడుకు కలిపే ఆప్టికల్ నరాల్లో వాపు ఏర్పడుతుంది. ఈ పరిస్థితి ‘ఆప్టిక్ న్యూరిటిస్’ అనే సమస్యకు కారణమవుతుంది. దీనివల్ల దృష్టి అస్పష్టంగా మారుతుంది. రంగులను చూడలేరు. కళ్లను కదిలిస్తున్నప్పుడు నొప్పి కలుగుతుంది. ఇది ఎక్కువగా ఒక కన్నులో మాత్రమే ఏర్పడుతుంది. దీనికి తోడు అలసట, తల తిరగడం, బలహీనంగా అనిపించినా వైద్యుడిని సంప్రదించాలి. 


చుక్కలు కనిపిస్తే?: తలకు గాయమైనప్పుడు చుక్కలు లేదా నక్షత్రాలు కనిపిస్తుంటాయి. వాస్తవానికి ఇది కూడా మెదడు గాయన్ని తెలిపే సంకేతం. మెదడులో గాయాలు ఉన్న రోగులలో 90 శాతం మంది ఈ దృశ్య లక్షణాలతో బాధపడతారు. డబుల్ విజన్(వస్తువులు రెండుగా కనిపించడం), దృష్టిని ఒక పాయింట్ నుంచి మరొకదానికి త్వరగా మార్చడంలో ఇబ్బంది, అస్పష్ట దృష్టి, కాంతిని చూడలేకపోవడం వంటి సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి, మీ తలకు చిన్న గాయమైనా సరే వైద్యుడిని సంప్రదించాలి. లేకపోతే క్రమేనా చూపును కోల్పోయే ప్రమాదం ఉంది.  


బ్రెయిన్ ట్యూమర్‌తో అంధత్వం?: మోఫిట్ క్యాన్సర్ సెంటర్ తెలిపిన వివరాల ప్రకారం..  దృష్టి లోపం మెదడు కణితి యొక్క లక్షణం కూడా కావచ్చు. బ్రెయిన్ ట్యూమర్ ఆప్టిక్ నరాల మీద తగినంత ఒత్తిడిని కలిగిస్తే, అంధత్వం ఏర్పడుతుందని నిపుణులు అంటున్నారు. చాలా మంది రోగులకు, అస్పష్టమైన దృష్టి, డబుల్ విజన్ లేదా బ్లైండ్ స్పాట్‌తో దృష్టిని కోల్పోయే ప్రమాదం ఉంది. కణితి పెరిగేకొద్దీ, అది ఆప్టిక్ నాడిని కుదిస్తుంది. ఫలితంగా దృష్టి లోపం ఏర్పడుతుంది. 


Also Read: కుక్క జీవితం, పూర్తిగా శునకంలా మారిపోయిన మనిషి - జపాన్‌లో డాగ్ మ్యాన్!


అల్జీమర్స్‌కు సంకేతం?: అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్న చాలా మందిలో తీవ్రమైన దృష్టి లోపం ఏర్పడే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.  మెదడు దృశ్య సమాచారాన్ని పూర్తిగా ప్రాసెస్ చేయకపోవడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. అల్జీమర్స్‌తో బాధపడుతున్న వారి మెదడు చూసేదాన్ని అర్థం చేసుకోదని నిపుణులు తెలిపారు. అలాగే కొందరికి చిన్న గొట్టం నుంచి చూస్తున్నట్లుగా కనిపిస్తుందని, పైన కింద దృశ్యాలను చూడలేరని పేర్కొన్నారు. చూశారుగా.. ఈ లక్షణాలు మీలో కనిపిస్తే తప్పకుండా వైద్యుడిని సంప్రదించండి. 


Also Read: ఈ ఊరిలో పులులు, ప్రజలు కలిసే జీవిస్తారు, ఎక్కడో కాదు ఇండియాలోనే!


గమనిక: ఈ వివరాలను మీ అవగాహన కోసమే అందించాం. ఇది వైద్యానికి ప్రత్యామ్నాయం కాదు. మీకు ఎటువంటి సందేహాలున్నా వైద్యుడిని సంప్రదించాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.