పులులతో సావాసం.. ప్రాణాలతో చెలగాటం అనే సంగతి తెలిసిందే. అయితే, ఆ ఊరి ప్రజలు మాత్రం పులలతో కలిసిమెలసి జీవిస్తున్నారు. మన ఊర్లో వీధి సింహాలు(శునకాలు), పిల్లులు తిరుగుతున్నట్లే.. ఆ ఊరిలో పులులు ప్రజల మధ్యే స్వేచ్ఛగా తిరుగుతాయి. ఇంతకీ ఆ ఊరు ఎక్కడుందో తెలుసా? మన ఇండియాలోనే.
రాజస్థాన్‌లోని బేరా అనే చిన్న పట్టణంలోని ప్రజలు చిరుతపులులతో కలిసి జీవిస్తున్నారు. ఆ ఊరి చరిత్రలో ఇప్పటివరకు ప్రజలు పులులను చంపడం గానీ, ప్రజలను పులులు చంపే ఘటనలు గానీ చోటుచేసుకోలేదు. ఎందుకంటే ఇక్కడి పులులు.. మనుషుల కంటే ఎక్కువ సామర్యసంతో జీవిస్తున్నాయి. అందుకే, అక్కడి ప్రజలు కూడా ఎలాంటి భయం లేకుండా సాధారణ జీవితం గడుపుతున్నారు. పైగా, ఈ భూమిపై అత్యధిక చిరుత పులులు జీవించే ప్రదేశం కూడా ఇదే. అందుకే, ఈ ప్రాంతాన్ని ‘చిరుతపులి దేశం’గా పిలుస్తారు.
బెరా చుట్టుపక్కల దాదాపు 100 చిరుతలు నివసిస్తున్నట్లు గణంకాలు చెబుతున్నాయి. అయితే, గత వందేళ్లలో ఇక్కడ మానవులపై ఎటువంటి దాడులు జరగలేదు. చాలా ఏళ్ల కిందట ఒక పసికందును పెద్ద పులి నోట కరుచుకుని వెళ్లిందని, అదే చిరుత పులులు దాన్ని తరమడంతో ఆ పులి పిల్లాడిని వదిలి వెళ్లిపోయినట్లు స్థానికులు చెప్పారు. ఈ ఊరి ప్రజలకు ఇప్పుడు పులులే కడుపు నింపుతున్నాయంటే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే, ఇక్కడి ప్రజలు పులలు సఫారీని నిర్వహిస్తూ ఉపాధి పొందుతున్నారు. ఇక్కడికి నిత్యం ఎంత మంది పర్యాటకులు వచ్చినా ఒక్కసారి కూడా దాడి జరగకపోవడం విశేషం.
బేరా పట్టణానికి ఒక ప్రత్యేకత ఉంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇక్కడి ప్రజల్లో ఎక్కువ మంది రబారి అనే గొర్రెల కాపరి తెగకు చెందినవారు. వారు వెయ్యి సంవత్సరాల క్రితం ఇరాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ మీదుగా రాజస్థాన్‌కు వలస వచ్చారు. ఇక్కడ ప్రజలు పులలను దైవంగా భావిస్తారు. రబరీ తెగ ప్రజలు శివుడిని ఆరాధిస్తారు. పులులు ఇతరాత్ర, జంతువులను వారిని సంరక్షించే దేవదూతలుగా భావిస్తారు. అయితే, వారు పెంచే పశువులను మాత్రం పులులు విడిచి పెట్టేవి కావు. ఆకలి వేసినప్పుడు ఆ పశువులను చంపుకుని తినేవి. అయినప్పటికీ అక్కడి ప్రజలుకు ఆ పులులపై ఆగ్రహాన్ని చూపించరు. ఒక పశువు చనిపోతే.. దానికి రెట్టింపు పశువులను శివడు ప్రసాదిస్తారనేది వారి నమ్మకం. ఇక్కడి పులులు నిత్యం ఊరి వీధుల్లో తిరుగుతూ కనిపిస్తుంటాయి. అందుకే, పర్యాటకులు కూడా ఈ గ్రామానికి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు.