తెలంగాణ అభివృద్ధిలో భాగం పంచుకుని పుట్టినగడ్డ రుణం తీర్చుకోవాలని తెలంగాణ ఎన్నారైలకు మంత్రి కే.తారకరామారావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి తెలంగాణ అభివృద్ధిని కొనసాగించాలని కోరారు. తెలంగాణకు పెట్టుబడులను ఆహ్వానించడానికి లండన్ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్, ఇక్కడ ప్రవాస తెలంగాణ సంఘాలు ఏర్పాటు చేసిన మీట్ ఆండ్ గ్రీట్ లో పాల్గొని ప్రసంగించారు. ముందుగా మహాత్మాగాంధీ, డా. బాబాసాహెబ్ అంబేద్కర్, ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటాలకు నమస్కరించి, తెలంగాణ అమరవీరులకు రెండు నిముషాలు మౌనం పాటించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వరాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ సాధించిన విజయాలను ఈ సందర్భంగా కేటీఆర్ ప్రస్తావించారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు చూపిన ఉద్యమస్పూర్తినే నేటికి కొనసాగిస్తూ... ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా తెలంగానాన్నే వినిపిస్తున్నారని ఎన్నారైలను కేటీఆర్ ప్రశంసించారు. ఈ పర్యటనలో పలువురు విదేశీ కంపెనీ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో తాను జరిపిన సమావేశాలు సంతృప్తికరంగా సాగాయని తెలిపారు. త్వరలోనే వాటి ఫలితాలు కనిపిస్తాయన్నారు.
పెట్టుబడులను ఆకర్షించి, తెలంగాణ యువతకు ఉద్యోగ,ఉపాధి అవకాశాలు లభించేలా చూడడమే తన ప్రథమ కర్తవ్యం అని కేటీఆర్ చెప్పారు. రాబోయే కాలంలో యునైటెడ్ కింగ్ డమ్ తో తెలంగాణ సంబంధాలు మరింత బలోపేతం అవుతాయన్న నమ్మకం తనకు ఉందన్నారు. స్వరాష్ట్రంలో కంపెనీలు స్థాపించి సంపద సృష్టించాలని ఎన్నారైలను కేటీఆర్ కోరారు. తెలంగాణ యువతకు ఉద్యోగాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పెట్టుబడులు పెట్టడానికి హైదరాబాద్ తో పాటు మిగతా పట్టణాలు, నగరాలను కూడా పరిగణలోకి తీసుకోవాలన్నారు. తమ ప్రభుత్వం వచ్చిన తరువాత అభివృద్ధిని వికేంద్రికరించామని తెలిపారు. అందులో భాగంగానే ఖమ్మం, కరీంనగర్ ఐటీ టవర్స్ ను ప్రారంభించామని, త్వరలోనే మహబూబ్ నగర్ లోనూ ఐటీ పరిశ్రమలు తమ కార్యకలాపాలు మొదలుపెడతాయన్నారు. ఇప్పటికే వరంగల్ లో ఐటీ తో పాటు ఇతర పారిశ్రామిక సంస్థలు విజయవంతంగా కొనసాగుతున్నాయన్నారు.
దశాబ్దానికి పైగా టిఆర్ఎస్ పార్టీ కోసం లండన్ కేంద్రంగా పని చేస్తున్న టిఆర్ఎస్ ఎన్ఆర్ఐ లండన్ శాఖ అధ్యక్షులు అనిల్ కూర్మాచలం ను కేటీఆర్ అభినందించారు. యూకే పర్యటనలో భాగంగా గత మూడు రోజులుగా వివిధ వ్యాపార వాణిజ్య వర్గాలతో సమావేశమవుతూ బిజీ బిజీగా ఉన్న మంత్రి కేటీఆర్, ఈరోజు అనిల్ కూర్మాచలం ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా అనిల్ కూర్మాచలం కుటుంబ సభ్యులు కేటీఆర్ గారిని సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా దశాబ్దానికి పైగా లండన్ కేంద్రంగా తెలంగాణ ఉద్యమం మరియు టిఆర్ఎస్ పార్టీ కోసం చేపట్టిన అనేక కార్యక్రమాల వివరాలను కేటీఆర్ గారికి అనిల్ కూర్మాచలం వివరించారు. తెలంగాణ బతుకమ్మ గురించి క్వీన్ ఎలిజబెత్ కు వివరాలు అందిస్తూ అనిల్ కూర్మాచలం కూతురు నిత్య రాసిన లేఖకు, క్వీన్ నుంచి వచ్చిన ప్రశంసను తెలుసుకున్న మంత్రి కేటీఆర్ నిత్యను అభినందించారు. రాంతం ఏదైనా, దేశమేదైనా పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కుటుంబ సభ్యులే అని కేటీఆర్ అన్నారు.