వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ ఉదయ భాస్కర్ వద్ద డ్రైవర్‌గా పనిచేసే కాకినాడకు చెందిన వీధి సుబ్రహ్మణ్యం అనుమానాస్పద మృతి నేపథ్యంలో కాకినాడ జీజీహెచ్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సుబ్రహ్మణ్యం మృతదేహానికి కాకినాడ జీజీహెచ్‌లో పోస్టుమార్టం నిర్వహిస్తున్నారని.. టీడీపీ నిజనిర్ధారణ బృందం శనివారం ఆసుపత్రికి వెళ్లింది. టీడీపీ నేతలను ఆసుపత్రిలోకి రానివ్వకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే సుబ్రహ్మణ్యం మృతిపై నిజనిజాలు తేలే వరకు పోరాటం కొనసాగుతుందని చెబుతోన్న టీడీపీ నేతలు బారీకేడ్లను తోసుకుంటూ కాకినాడ జీజీహెచ్‌లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు. టీడీపీ నేతలు మార్చురీ గదికి వెళ్లడానికి ప్రయత్నించడం, పోలీసులు వారిని అడ్డుకునే క్రమంలో జీజీహెచ్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.
దళిత సంఘాలు, కుటుంబం నిరసన
ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ మాజీ డ్రైవర్ సుబ్రహ్మణం అనుమానస్పద స్థితిలో మృతిచెందడంతో ఆ వైఎస్సార్‌సీపీ నేతలను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని బాధితుడి కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. వీరితో పాటు దళిత ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీ నేతల ఆధ్వర్యంలో కాకినాడ జీజీహెచ్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రంలో ఇలాంటి హత్యలు వైఎస్ జగన్ ప్రభుత్వంలో పెరిగిపోయాయని, సామాన్యులకు రాష్ట్రంలో జీవించే హక్కు లేదా అని టీడీపీ నేతలు ప్రశ్నించారు. ఆసుపత్రికి వెళ్లిన టీడీపీ నిజ నిర్దరణ బృందం మార్చురీ గదికి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.
ఎమ్మెల్సీ కారులో డెడ్‌బాడీ కేసులో సర్పవరం పోలీస్ స్టేషన్‌లో సీఆర్పీసీ 174 కింద కేసు నమోదైంది. అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేశారు పోలీసులు.సుబ్రహ్మణ్యం శరీరంపై గాయాలున్నట్లు గుర్తించారు. అయితే నిందితులుగా ఎఫ్ఐఆర్ లో ఎవరి పేర్లు చేర్చలేదు. మరోవైపు ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్సీ ఉదయం వచ్చి తన వెంట తీసుకెళ్లిన సుబ్రహ్మణ్యం ప్రమాదంలో చనిపోతే తెల్లవారే వరకు అతడి కుటుంబసభ్యులకు చెప్పకపోవడం పలు అనుమానాలకు దారితీసింది. ప్రమాదంలో గాయపడితే ఆసుపత్రికి తీసుకెళ్లారా, రాత్రి మొత్తం ఏం చేశారు, ఎక్కడ ప్రమాదం జరిగింది అనే వివరాలు ఎమ్మెల్సీ వెల్లడించలేదు. పోలీసులు అనంత ఉదయ భాస్కర్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
ఎమ్మెల్సీపై ఆరోపణలు
మృతదేహం మోకాళ్లకు ఎర్రటి మట్టి అంటుకుని, కాళ్లు, చేతులు విరిచేసి ఉన్నాయని బాధిత కుటుంబ సభ్యులు అంటున్నారు. కేవలం తమ బిడ్డను అనంతబాబు, అతని అనుచరులే చంపించారని మృతుడు సుబ్రమణ్యం కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గతంలో ఎమ్మెల్సీ కారు డ్రైవరుగా పనిచేసిన సుబ్రమణ్యం 30 వేల రూపాయలు అప్పు తీసుకున్నారని, అంతే తప్ప తమకు ఇంకేమీ తెలియదని చెబుతున్నారు. అయితే బర్త్ డే సెలబ్రేషన్ అంటూ స్వయంగా ఎమ్మెల్సీ అనంత బాబు దగ్గరుండి తీసుకెళ్లి తిరిగి శవాన్ని తీసుకొచ్చారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.
Also Read: MLC Car Dead Body : వైసీపీ ఎమ్మెల్సీ కారులో డ్రైవర్ డెడ్ బాడీ, కొట్టిచంపారని కుటుంబసభ్యుల ఆరోపణ