MLC Car Dead Body : కాకినాడి జిల్లాలో వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ బాబు కారులో మృతదేహం కలకలం సృష్టిస్తోంది. ఆ మృతదేహం ఎమ్మెల్సీ దగ్గర పనిచేసే డ్రైవర్ సుబ్రమణ్యందని తెలుస్తోంది. డ్రైవర్ సుబ్రమణ్యాన్ని గురువారం ఉదయం ఎమ్మెల్సీ ఉదయ్ బాబు తనతో తీసుకెళ్లారు. ఆ తర్వాత ప్రమాదం జరిగిందని డ్రైవర్ చనిపోయాడని, డ్రైవర్ తమ్ముడికి సమాచారమిచ్చారు. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటలకు ఎమ్మెల్సీ తన కారులోనే డ్రైవర్ మృతదేహాన్ని తీసుకొచ్చి అతడి తల్లిదండ్రులకు అప్పగించారు. ఆ కారు అక్కడే వదిలేసి వేరే కారులో ఎమ్మెల్సీ వెళ్లిపోయారు. మృతదేహాన్ని కిందకు దించాలని సుబ్రమణ్యం తల్లిదండ్రులపై ఎమ్మెల్సీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం జరిగిందని ఆరాతీసిన తల్లిదండ్రులకు సమాధానం చెప్పకుండా ఎమ్మెల్సీ వేరే కారులో వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. తల్లిదండ్రులు పనిచేస్తున్న అపార్ట్మెంట్ ఎదుట ఎమ్మెల్సీ కారులో డ్రైవర్ మృతదేహం ఉంది. ఈ ఘటనపై బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. డ్రైవర్ సుబ్రమణ్యం ఐదేళ్లుగా ఎమ్మెల్సీ దగ్గరే పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. డ్రైవర్‌ను ఎమ్మెల్సీ హత్య చేశారంటూ ఆయన కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
(ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ బాబు)
మృతిపై అనేక అనుమానాలు
అయితే గురువారం అనంతబాబు పుట్టిన రోజు కావడంతో ఆయన అనుచరులంతా పార్టీ చేసుకున్నారు. ఆ పార్టీలో ఏమైనా జరిగిందా? మరేదైనా కారణముందా అనేది పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. డ్రైవర్ ను స్వయంగా ఎమ్మెల్సీనే వచ్చి తీసుకెళ్లడం, ఆ తర్వాత రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని చెప్పడం అనుమానాస్పదంగా ఉందని కుటుంబ సభ్యులు అంటున్నారు. పార్టీ జరుగుతుండగా టిఫిన్ కోసం సుబ్రమణ్యం బయటకు వెళ్లాడని, అప్పుడు బైక్ యాక్సిడెంట్ జరిగిందని ఎమ్మెల్సీ చెబుతున్నారు. పార్టీ జరుగుతున్నప్పుడు టిఫిన్ కోసం బయటకు వెళ్లాడని చెప్పడం కూడా అనుమానాలకు తావిస్తోంది.
ఎమ్మెల్సీపై ఆరోపణ
మృతదేహం మోకాళ్లకు ఎర్రటి మట్టి అంటుకుని, కాళ్లు, చేతులు విరిచేసి ఉన్నాయని బాధిత కుటుంబ సభ్యులు అంటున్నారు. కేవలం తమ బిడ్డను అనంతబాబు, అతని అనుచరులే చంపించారని మృతుడు సుబ్రమణ్యం కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గతంలో ఎమ్మెల్సీ కారు డ్రైవరుగా పనిచేసిన సుబ్రమణ్యం 30 వేల రూపాయలు అప్పు తీసుకున్నారని, అంతే తప్ప తమకు ఇంకేమీ తెలియదని చెబుతున్నారు. అయితే బర్త్ డే సెలబ్రేషన్ అంటూ స్వయంగా ఎమ్మెల్సీ అనంత బాబు దగ్గరుండి తీసుకెళ్లి తిరిగి శవాన్ని తీసుకొచ్చారని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. కారు డ్రైవరు అనుమానస్పద మృతి వెనుక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అని పోలీసులు ఆరాతీస్తున్నారు. అయితే మృతదేహాన్ని తీసుకొచ్చిన కారు ఏపీ 39 బీ 0456 దొంగ నెంబర్లో రిజిస్ట్రేషన్లో ఉందని తెలుస్తోంది. పార్టీకని తీసుకెళ్లిన వ్యక్తి టిఫిన్ చేసేందుకు ఎందుకు వెళతాడని, ఆ సమయంలో బైక్ పై వెళ్తే యాక్సిడెంట్ అయ్యిందని చెబుతున్నారని, అయితే యాక్సిడెంట్ అయిన బైక్ ఏమైందని ప్రశ్నిస్తే ఆ బైక్ యజమాని తీసుకెళ్లిపోయాడని ఇలా పొంతనలేని సమాధానం ఎమ్మెల్సీ చెప్పారని కుటుంబ సభ్యులు వాపోతున్నారు.
ఎమ్మెల్సీ అనంతబాబు వివరణ
అపార్ట్‌మెంట్ వద్ద తన కారులో డ్రైవర్ మృతదేహం ఉండటంపై ఎమ్మెల్సీ ఉదయ్ భాస్కర్ బాబు స్పందించారు. సుబ్రమణ్యం తన దగ్గర ఐదేళ్లుగా డ్రైవర్‌గా పనిచేస్తున్నాడన్నారు. అయితే రెండు నెలల నుంచి సరిగా రావడం లేదన్నారు. మద్యం అలవాటు ఉండటంతో టూవీలర్‌తో అనేకసార్లు ప్రమాదాలు చేశాడన్నారు. గత రాత్రి ఇలానే ప్రమాదం జరిగిందని, ఈ విషయాన్ని వాళ్ల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చానన్నారు. చికిత్స కోసం కాకినాడ అమృత ఆసుపత్రికి తీసుకెళ్లామని ఎమ్మెల్సీ తెలిపారు. అతని తల్లిదండ్రులు కూడా ఆసుపత్రికి వచ్చారన్నారు. సుబ్రమణ్యం మృతి చెందడంతో మృతదేహాన్ని వారి స్వగ్రామానికి తీసుకెళ్తామని చెప్పడంతో కారు ఇచ్చానన్నారు.