యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ పుట్టినరోజు ఆయనకు స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే.. ఇప్పటివరకు ఎన్టీఆర్ టాలెంట్ గురించి తెలుగు ప్రేక్షకులు మాత్రమే మాట్లాడుకునేవారు. కానీ ఇప్పుడు నేషనల్ లెవెల్ లో ఆయన పేరు ట్రెండ్ అవుతోంది. 'ఆర్ఆర్ఆర్' సినిమాతో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు తారక్. నెక్స్ట్ ఆయన నుంచి రాబోయేవన్నీ పాన్ ఇండియా సినిమాలనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
1983లో మే 20న హరికృష్ణ, షాలిని దంపతులకు జన్మించిన తారక్.. చిన్నతనంలోనే కూచిపూడి నేర్చుకొని పలు స్టేజ్ షోలలో ప్రదర్శనలు ఇచ్చారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసిన ఆయన.. 'నిన్ను చూడాలని' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత 'స్టూడెంట్ నెం.1'తో యూత్ లో క్రేజ్ తెచ్చుకున్నారు. 'ఆది', 'సింహాద్రి' వంటి సినిమాలు ఎన్టీఆర్ లో మాస్ హీరోని ఆడియన్స్ కి పరిచయం చేశాయి. మధ్యలో ఫ్లాప్ లు వచ్చినా.. తిరిగి తన టాలెంట్ ను నిరూపించుకున్నారు. 'టెంపర్', 'నాన్నకు ప్రేమతో', 'జై లవకుశ', 'జనతా గ్యారేజ్' ఇలా ఆయన చేసే ప్రతీ సినిమాలో వేరియేషన్ చూపించి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు.
నందమూరి లాంటి బిగ్ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చినా.. ఆ గర్వం అనేది అతడిలో ఎప్పుడూ కనిపించదు. తనలో ఉన్న టాలెంట్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. బహుశా ఇండస్ట్రీలో రిహార్సల్స్ చేయకుండా.. ఆన్ ది స్పాట్ డాన్స్ చేసేది ఎన్టీఆర్ ఒక్కరేనేమో. ఇందులో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. ఆయన డాన్స్ కి ఎందరో అభిమానులు ఉన్నారు. సెలబ్రిటీలు సైతం ఎన్టీఆర్ డాన్స్ గురించి గొప్పగా మాట్లాడుతుంటారు. ఈ తరం హీరోల్లో ఎన్టీఆర్ కి ఉన్న ఫ్యాన్ బేస్ వేరే లెవెల్. సినిమాల్లో ఆయన మాస్ డైలాగ్స్ చెప్పినా.. స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకొని స్పీచ్ ఇచ్చినా.. ఫ్యాన్స్ కి పూనకాలే. ఎన్టీఆర్ వాయిస్, ఆయన డిక్షన్ ను మరెవరితో పోల్చలేం.
ఎన్టీఆర్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలు..
ఇండియాలో మాత్రమే కాకుండా జపాన్ లో కూడా ఎన్టీఆర్ కి ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన నటించిన 'బాద్ షా' సినిమాను జపనీస్ భాషలో డబ్ చేసి రిలీజ్ చేశారు. జపాన్ లో రజినీకాంత్ తరువాత ఆ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్న సౌత్ హీరో ఎన్టీఆర్ అనే చెప్పాలి.
ఎన్టీఆర్ లక్కీ నెంబర్ 9.. అందుకే తన ట్విట్టర్ హ్యాండిల్ (@Tarak999), కార్ల నెంబర్ ప్లేట్ ఇలా అన్నింటికీ 9 అనే నెంబర్ ఉండేలా చూసుకుంటారు. ఈ నెంబర్ రిజిస్ట్రేషన్స్ కోసం లక్షలు ఖర్చు పెడుతుంటారు.
ఇండస్ట్రీలో ఎన్టీఆర్ కి చాలా మంది స్నేహితులు ఉన్నారు. కానీ ఆయన రామ్ చరణ్ తో చాలా సన్నిహితంగా ఉంటారు. సొంత అన్నదమ్ముల్లా ఇద్దరూ మెలుగుతుంటారు. 'ఆర్ఆర్ఆర్' సినిమా వీరి స్నేహాన్ని మరింత బలంగా మార్చింది.
సినిమాలు తప్ప ఎన్టీఆర్ కి మరో వ్యాపకం ఉండదు. ఎక్కువ సమయం తన ఫ్యామిలీతో గడపాలని చూస్తుంటారు. తన భార్య, ఇద్దరు కొడుకులతో ఎంతో ప్రేమగా ఉంటారు ఎన్టీఆర్. తన కొడుకులతో తీసుకునే ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ ఫొటోలు బాగా వైరల్ అవుతుంటాయి.