ఆవ పెట్టిన పనసపొట్టు కూర తలచుకుంటేనే చాలా మందికి నోరూరిపోతుంది. మసాలా పెట్టి వండే మాంసాహారం కూడా దీని ముందు దిగదుడుపే. అప్పట్లో రాజ వంశస్థులు దీన్ని ప్రత్యేకంగా వండించుకుని తినేవారని చెప్పుకుంటారు. పనస పండ్లు మార్కెట్లో విరివిగా దొరుకుతున్నాయి. ఓ కాయ కొని తెచ్చి మీరు పనసపొట్టు కూర, బిర్యానీ లాంటివి వండుకోవచ్చు. మొత్తం కాయం ఎక్కువైపోతుందనుకుంటే... నలుగురైదుగురు స్నేహితులు కలిసి ఆ కాయను పంచుకోవచ్చు. సీజనల్ పండైన పనసను పండుగా తిన్నా, కాయను కూరగా వండుకుని తిన్నా ఆరోగ్యానికి మంచిదే. 


కావాల్సిన పదార్థాలు
పనసపొట్టు - రెండు కప్పులు (సన్నగా తురిమినది)
శెనగపప్పు - ఒక టీస్పూను
మినపప్పు - ఒక టీస్పూను
ఆవాలు - రెండు స్పూనులు
పసుపు - అర టీస్పూను
ఉప్పు - తగినంత
జీలకర్ర - ఒక టీస్పూను
పచ్చిమిర్చి - అయిదు
ఎండు మిర్చి - పది
చింతపండు - చిన్న ఉండ
ఇంగువ - చిటికెడు
కరివేపాకు - గుప్పెడు
జీడిపప్పులు - ఎనిమిది
నూనె - మూడు స్పూనులు


తయారీ ఇలా...
1. పనపపొట్టును సన్నగా తురుముకోవాలి. ఒక గిన్నెలో నీళ్లు, ఉప్పు, పసుపు వేసి అందులో తరిగిన పనసపొట్టు వేసి ఉడకించాలి. 
2. అలా పసనపొట్టు 70 శాతం ఉడికిపోయే దాకా ఉంచాలి. 
3. ఇప్పుడు నీటిని వడకట్టి తీసేసి, పనపపొట్టుని ఓ ప్లేటులో పరచాలి. ముద్దలా పడేయడం వల్ల కూర పొడిపొడిగా రాదు. 
4. మరో పక్క ఆవాలు, ఎండు మిర్చిని కళాయిలో వేయించి మిక్సీలో మెత్తని పొడిలా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇదే ఆవ.  
5. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శెనగపప్పు వేసి వేయించాలి. 
6. అవి వేగాక నిలువుగా కోసిన పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి వేయించాలి. 
7. చింతపండును ముందే చిన్న కప్పులో నీళ్లు పోసి నానబెట్టాలి. 
8. చింతపండు నీళ్లను కూడా కళాయిలో వేసి రెండు ఉడికించాలి. చిటికెడు ఇంగువ పొడి కూడా వేయాలి.
9. ఇప్పుడు ముందుగా ఉడకబెట్టిన పనసపొట్టు, ఉప్పు వేసి కలపాలి. 
10. కూరను బాగా ఉడికించాక స్టవ్ కట్టేయడానికి సరిగ్గా అయిదు నిమిషాల ముందు, మిక్సీ చేసుకున్న ఆవపిండిని వేసి కలపాలి. అంతే ఆవ పెట్టిన పనసపొట్టు కూర రెడీ. 
11. చింతపండు నీళ్లు అధికంగా వేయకూడదు. ఎక్కువగా వేయడం వల్ల కూర పొడిపొడిగా రాదు. దాదాపు పులిహోరలాగే కలుపుకోవాలన్నమాట. 
12. ఈ కూరను వండుకుంటే రెండు రోజుల పాటూ పాడవ్వకుండా ఉంటుంది. రుచి కూడా మారదు. 


Also read: హఠాత్తుగా బరువు తగ్గడం వెనుక డేంజర్ బెల్స్ ఇవే


Also read: అన్నీ ఉన్నా ఆత్మహత్యలెందుకు? డిప్రెషన్ లక్షణాలు ఎలా ఉంటాయి? దీనికి చికిత్స ఉందా?