ప్రత్యూష గరిమెళ్ల... భారతదేశం టాప్ 30 ఫ్యాషన్ డిజైనర్లలో ఆమె ఒకరు. ఆర్ధికంగా, సామాజికంగా, గుర్తింపు పరంగా ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి. ఎంతో టాలీవుడ్, బాలీవుడ్ సెలెబ్రిటీలు ఆమె స్నేహితులు. టాప్ హీరోయిన్లందరికీ ఆమె డిజైనర్ గా పనిచేశారు. అలాంటి వ్యక్తి కొన్ని నెలలుగా డిప్రెషన్ తో బాధపడుతున్నట్టు గుర్తించారు పోలీసులు. ఆమె సూసైడ్ లెటర్ కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. ‘నేను కోరుకున్న జీవితం ఇది కాదు’ అని ఆమె రాసింది. దీన్ని బట్టి తీవ్ర మానసిక ఒత్తిడికి గురైందని అర్థమవుతోంది. నిజానికి ప్రత్యూషకు ఏ లోటు లేదు. అలాంటి ఆమె కూడా డిప్రెషన్ బారిన పడడం ఆలోచించాల్సిన విషయం.


ధనిక,పేద తేడా లేదు...
డిప్రెషన్‌కు ధనిక, పేద అనే తేడా లేదు. ఎవరికైనా వచ్చే అవకాశం ఉంది. వారి వారి సమస్యలు, ఆలోచనా తీరు, మానసిక సంఘర్షణల కారణంగా ఇది రావచ్చు. ఇదొక మానసకి రుగ్మత. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ఎవరికైనా వచ్చే అవకాశం ఉంది. పరిస్థితులను బట్టి కోపం, నిరుత్సాహం, బాధ, ఏడుపు అందరికీ వస్తుంటాయి. కానీ డిప్రెషన్ బారిన పడిన వారిలో ఇవి అధికంగా కలుగుతాయి. దీర్ఘకాలం పాటూ కొనసాగుతాయి. 


డిప్రెషన్ రావడానికి కారణాలు
ఒంటరితనం కారణంగా అధిక శాతం మంది డిప్రెషన్ బారిన పడుతున్నారు. అలాగే జీవిత భాగస్వామిని కోల్పోయినప్పుడు,తమకు ఎంతో ఇష్టమైనవారిని కోల్పోయినప్పుడు, భయంకరమైన రోగాల బారిన పడినప్పుడు ఇలాంటి కుంగుబాటు కలిగే అవకాశం ఉంది. అలాగే వరుస వైఫల్యాల బారిన పడుతున్న వ్యక్తి కూడా మానసికంగా కుంగి డిప్రెషన్ లోకి వెళతాడు. అయితే డిప్రెషన్ అనేది హఠాత్తుగా కలిగే పరిణామం కాదు. కొన్ని నెలలు లేదా రోజుల పాటూ సాగే ప్రక్రియ. 


లక్షణాలు ఎలా ఉంటాయి?
1.ఎక్కువ సమయం మూడీగా ఉండడం
2. తరచూ ఏడుపు వస్తున్నట్టు అనిపించడం
3. సహనం కోల్పోయి చిన్న విషయాలకే అరవడం
4. మానసిక ఆందోళన ఎక్కువవడం
5. తినాలనిపించకపోవడం, నిద్రపట్టకపోవడం
6. నిత్యం నిరాశలోనే ఉండడం
7. ప్రతికూల ఆలోచనలు అధికమవ్వడం
8. ఆత్మన్యూనతకు గురవ్వడం
9. ఆత్మహత్య చేసుకునే ఆలోచనలు వస్తుండడం
10. కుటుంబానికి, స్నేహితులకు దూరంగా ఉండడం
11. ఏ పనీ చేయకుండా ఖాళీగా ఆలోచిస్తూ కూర్చోవడం
12. అకారణంగా బరువు తగ్గిపోవడం


పైన చెప్పినవన్నీ డిప్రెషన్ తో బాధపడుతున్నప్పుడు కలిగే లక్షణాలు. ఇవి మీలో కనిపించినా, మీ ఆత్మీయులు, స్నేహితుల్లో కనిపించినా వెంటనే జాగ్రత్త పడండి. డిప్రెషన్ నుంచి బయటపడే మార్గాలు ఉన్నాయి. దానికి చికిత్స కూడా ఉంది. తీవ్రంగా డిప్రెషన్ బారిన పడినవారికి కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీని అందిస్తారు. అలాగే యాంటీ డిప్రెసెంట్ మందులను సూచిస్తారు.వాటి ద్వారా డిప్రెషన్ నుంచి బయటపడొచ్చు. మీ ముందు ఇంకా ఎంతో అందమైన జీవితం ఉంది. ఒక్క వైఫల్యంతోనే జీవితం ఆగిపోదు, మరిన్ని విజయాలు అందుకునేందుకు ఆరోగ్యంగా ఉండండి,ముఖ్యంగా ప్రాణాలతో ఉండండి. 


Also read: హైబీపీ ఉన్న వారికి కచ్చితంగా డయాబెటిస్ వస్తుందా? వచ్చే ఛాన్స్ ఎంత?


Also read: ఏడాదికి ఒక్కసారి రక్తదానం చేయండి చాలు, ఎంతో మంది ప్రాణాలు కాపాడవచ్చు