రక్తం... మన శరీరంలో ఉన్న కణకణాన్ని పోషించడమే కాదు, అవసరమైతే బయటి వారి ప్రాణాలను కూడా కాపాడగలదు. దానికి మీరు చేయాల్సిందల్లా రక్తదానం చేయడం. రక్తదానం ప్రాణదానంతో సమానం. యాక్సిడెంట్ అయిన వ్యక్తి, భారీగా రక్తం పోయి ప్రాణాపాయ స్థితిలో ఉంటే మీరిచ్చే రక్తం వల్ల అతను బతికి బట్టకట్టవచ్చు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారి మీరిచ్చే రక్తంతో ఆయుష్షు పోసుకోవచ్చు. ఆలోచించకండి...రక్తదానం చేయండి. మీ శరీరం నుంచి రక్తం అధికంగా లాగేస్తారేమో అని భయపడకండి. రక్తాన్ని సేకరించే వారికి తెలుసు మీకు ఎలాంటి సమస్యా రాకుండా ఎంత రక్తం సేకరించాలో. ఎందుకంటే మీ ప్రాణం కూడా అమూల్యమైనదే. రక్తదానం చేశాక 21 రోజుల్లో మీరు దానం చేసిన రక్తం మళ్లీ మీ శరీరంలోకి చేరిపోతుంది.
ఏంటి దినోత్సవం?
రక్తదానం చేయండి, ప్రాణాలు కాపాడండి... అని ప్రజల్లో అవగాహన పెంచేందుకే ప్రత్యేకం ‘ప్రపంచ రక్త దాతల దినోత్సవం’ ప్రారంభమైంది. రక్త దానం చేయడం ఎంత అవసరమో చెప్పడమే దీని ప్రధాన ఉద్దేశం. ప్రపంచఆరోగ్య సంస్థ 2004లో ఈ దినోత్సవాన్ని పెట్టాలని ప్రతిపాదించింది. 2005 నుంచి నిర్వహించడం మొదలుపెట్టింది.
ఈ రోజే ఎందుకు?
ఇదే రోజు నోబెల్ ప్రైజ్ అందుకున్న కార్ల్ లాండ్‌స్టీనర్ జన్మించాడు. 1868, జూన్ 14న పుట్టిన ఆయన శాస్త్రవేత్తగా ఎదిగి ABO బ్లడ్ గ్రూప్ వ్యవస్థను కనిపెట్టాడు. అంటే ఇప్పుడు మనం ఏ పాజిటివ్, ఏ నెగిటివ్,ఓ పాజిటివ్... ఇలా వర్గీకరించి మాట్లాడుతున్నామే, ఆ వ్యవస్థను కనిపెట్టింది శాస్త్రవేత్త ఈయన. అందుకే ఆయన పుట్టినరోజున గౌరవార్ధం ఈ ‘రక్తదాతల దినోత్సవం’ నిర్వహిస్తున్నారు.
ఎన్ని నెలలకోసారి రక్తదానం చేయచ్చు?
మహిళలతో పోలిస్తే పురుషులే ఎక్కువ సార్లు రక్త దానం చేయచ్చు. ఎందుకంటే ఎక్కువ మంది మహిళలు రక్త హీనతతో బాధపడుతుంటారు. అలాగే వారికి పీరయడ్స్ రూపంలో ప్రతి నెలా రక్తం బయటికి పోతుంది. మహిళలు ఆరు నెలలకోసారి రక్త దానం చేయచ్చు. అదే పురుషులైతే ప్రతి మూడు నెలలకోసారి చేయచ్చు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు.
తలసీమియాతో బాధపడే చిన్నారులకు జీవితం ఒక నరకం. వారికి ఏడాదిలో కనీసం 12 నుంచి 24 సార్లు కొత్త రక్తాన్ని ఎక్కించాల్సి వస్తుంది. ఈ వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల సంఖ్య అధికంగానే ఉంది. అందుకే వీలైనంతవరకు ఆరోగ్యవంతులైన వ్యక్తులందరూ రక్తదానం చేస్తేనే ఇలాంటి చిన్నారులు బతకగలరు.
అరుదైన గ్రూప్‌లు ఇవే
రక్త గ్రూపుల్లో కొన్ని సులువుగా దొరకడం లేదు. ముఖ్యంగా ఏబీ నెగిటివ్, ఓ నెగిటివ్, ఏ నెగిటివ్, బీ నెగిటివ్ రక్త గ్రూపుల కొరత చాలా తీవ్రంగా ఉంది. ఆ రక్త గ్రూపులు ఉన్న వ్యక్తులు రక్త దానం చేస్తే చాలా మేలు చేసిన వారు అవుతారు. మరొకరి ప్రాణం కాపాడిన దేవుళ్లుగా మారుతారు.
ప్రతి మూడు నెలలకోసారో, ఆరునెలలకోసారో కాదు, కనీసం ఏడాదికి ఒక్కసారి ఆరోగ్యవంతమైన వ్యక్తులందరూ రక్తదానం చేసినా చాలు దేశంలో రక్తం కొరత తీరిపోతుంది. ఎంతో మంది ప్రాణాలు నిలబడతాయి. వైద్యుడు కాకుండానే మీరు మరొకరి ప్రాణాలు నిలబెట్టగలరు.
ఎవరి రక్తం తీసుకోరు?
కొన్ని రకాల వ్యాధులు ఉన్న వారి రక్తాన్ని వైద్యులు సేకరించరు. అధిక రక్తపోటు, హెచ్ ఐవీ, హెపటైటిస్ బీ, సీ, హిమోగ్లోబిన్ తక్కువగా ఉండేవారి నుంచి రక్తాన్ని తీసుకోరు. అలాగే డ్రగ్స్ తీసుకున్న వారు రక్తదానం చేయకూడదు. దాతలకు ఉండే జబ్బులను బట్టి రక్తాన్ని తీసుకోవాలో వద్దో నిర్ణయిస్తారు.