ప్రపంచంలో ఎక్కువ మంది జనాభా ఇబ్బంది పడుతున్న ఆరోగ్య సమస్యలు హైబీపీ, డయాబెటిస్. ఈ రెండూ ఉన్న వ్యక్తి చాలా జాగ్రత్తలు పాటించాలి. అయితే కొందరికి హైబీపీ మాత్రమే ఉంటే, మరికొందరికి డయాబెటిస్ ఒక్కటే ఉంటుంది. హైబీపీ ఉన్న వారికి డయాబెటిస్ వచ్చే ఛాన్సు, మధుమేహం ఉన్నవారికి హైబీపీ వచ్చే అవకాశం ఉన్నాయా? అన్నది ఎక్కువ మందిని వేధిస్తున్న ప్రశ్నలు. 


హైబీపీ ఉన్నవారికి మధుమేహం వస్తుందా?
హైపర్ టెన్షన్ లేదా అధిక రక్తపోటు ఉన్న వారిలో రక్తపోటు రీడింగులు 140/90 లేదా అంతకన్నా ఎక్కువ ఉంటాయి. హైబీపీ ఉన్న వారిలో మధుమేహం వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే అధిక రక్తపోటు ఉన్న వ్యక్తులు సాధారణంగానే ఇన్సులిన్ నిరోధకతను కలిగి ఉంటారు. సాధారణ రక్తపోటు ఉన్న వారితో పోలిస్తే, వీరిలో మధుమేహం వచ్చే ముప్పు ఎక్కువ. డయాబెటిస్, హైబీపీ ఉన్నవారి రక్తపోటు ఎప్పుడైనా 140/80 కన్నా తక్కువ ఉండేలా చూసుకోవాలి. డయాబెటిస్ కారణంగా వచ్చిన కిడ్నీ సమస్యలు, చూపు సమస్యలు ఉన్నవారు కచ్చితంగా 130/80 కన్నా పెరగకుండా చూసుకోవాలి. మందులు వాడడం ద్వారా రక్తపోటును అదుపులో పెట్టుకోవచ్చు. 


డయాబెటిస్ ఉన్న వారికి హైబీపీ?
మధుమేహం ఉన్న వారు కూడా ఆ రోగాన్ని అదుపులో ఉంచుకోకపోతే ఎప్పుడైనా అధిక రక్తపోటు దాడి చేసే అవకాశం ఉంది. ఎందుకంటే డయాబెటిస్ వల్ల ధమనులు దెబ్బతింటాయి. ఆ రక్త నాళాలను గట్టిపడేలా చేస్తాయి. దీనివల్ల రక్తపోటు పెరుగుతుంది. దీనికి చికిత్స చేయించకపోతే రక్తనాళాలు దెబ్బతినడం, గుండెపోటు రావడం, మూత్ర పిండాల వైఫల్యం వంటి సమస్యలు అధికమవుతాయి. అంటుకే డయాబెటిస్ రోగులు రోజూ వైద్యులు సూచించిన మందులు తప్పకుండా వేసుకోవాలి. లేకుంటే అధిక రక్తపోటుతో పాటూ ఇతర ప్రమాదకరమైన ఆరోగ్యపరిస్థితుల బారిన పడే అవకాశం ఉంది.  


రోజూ మాత్రలు మింగాల్సిందేనా?
హైబీపీ, మధుమేహం ఈ రెండూ ఒక్కసారి ఒంట్లో చేరాయా,బయటికి పోవడం కష్టం. ఇవి ఎప్పటికీ పూర్తిగా నయం కావు. వైద్యులు జీవితాంతం మందులు వాడాలనే చెబుతారు. రోజుకో ట్యాబ్లెట్ ను సూచిస్తారు. ఆ మాత్రను రోజూ ఉదయాన వేసుకోవాల్సిందే. ఇలా వేసుకోవడం వల్ల ,ఆ రెండింటి రీడింగులు పెరగకుండా నియంత్రణలో ఉంటాయి. ఇతర ఆరోగ్య సమస్యలేవీ కూడా రావు. 


Also read: ఏడాదికి ఒక్కసారి రక్తదానం చేయండి చాలు, ఎంతో మంది ప్రాణాలు కాపాడవచ్చు


Also read: ఆడవాళ్లలో రుతుక్రమానికి సంబంధించి ఇవన్నీ అపోహలే, నిజాలేంటో తెలుసుకోండి