ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రాజకీయ పార్టీలు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయ్. ప్రధాన ప్రతిపక్షాలు ప్రజల్లోకి వెళ్తున్నాయ్. ఇటు అధికార పార్టీ సైతం ఏదో ఒక కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు నాయకులు.
ప్రజల వద్దకు చేరువయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు రాజకీయ నాయకులు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో స్పీకర్, మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బిజీగా మారారు. ప్రభుత్వ పథకాలు అమలయ్యే విధంగా చూడడంతోపాటు ప్రజలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు ప్రజాప్రతినిధులు.
కాంగ్రెస్ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. జిల్లాలోని నియోజకవర్గ ఇన్‌చార్జీలతోపాటు సీనియర్ నేతలంతా పాల్గొంటున్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల్లోకి వెళ్తున్నారు. రచ్చబండ కార్యక్రమాల్లో మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి సలహాలు ఇస్తూ సజావుగా జరిగేవిధంగా చూస్తున్నారు. పలు నియోజకవర్గాల పరిధిలో ఆయన పాల్గొంటున్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్‌గౌడ్ ఆర్మూర్‌పై నజర్‌పెట్టి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాల పరిధిలోని ఆర్మూర్, నందిపేట, మాక్లూర్ మండలాల పరిధిలో కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి సంధాన కర్తగావ్యవహరిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో చర్యలు చేపడుతున్నారు. నియోజకవర్గా ఇన్‌చార్జీలు డాక్టర్ భూపతిరెడ్డి, తాహెర్‌బిన్ హుందాన్, మాజీ విప్ ఈరవత్రి అనిల్, కాసుల బాల్‌రాజ్‌తోపాటు ఇతర నేతలు పాల్గొంటున్నారు. సీనియర్ నేతలు నగేష్‌రెడ్డి, గడుగు గంగాధర్ రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ కూడా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడంతోపాటు నేతలకు అందుబాటులో ఉండే ప్రయత్నాలు చేస్తున్నారు. రచ్చబండ ద్వారా కాంగ్రెస్ క్యాడర్‌కు ఊపిరిపోసే ప్రయత్నం చేయడంతోపాటు జిల్లాలో కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల వద్దకు వెళ్లే ప్రయత్నాలు చేయడంతోపాటు వారి మద్దతు కూడగడుతున్నారు.
ప్రజల్లోకి బీజేపీ...
జిల్లాలో బీజేపీ తన పట్టుకోసం ప్రయత్నం చేస్తోంది. కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లేందుకు బీజేపీ నేతలు సమావేశాలతోపాటు ప్రజల మధ్యకు వెళ్తున్నారు. కేంద్రమంత్రి మహేంద్రనాథ్ రెండు రోజులపాటు జిల్లాలో పర్యటించారు. కేంద్ర పథకాల లబ్ధిదారుతోపాటు ప్రముఖులతో చర్చలు జరిపారు. అటు బాన్సువాడ నియోజకవర్గంలో ఈటెల రాజేందర్ పర్యటిస్తున్నారు. ఇలా బీజేపీ జిల్లాలో పలు కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తోంది. అన్ని నియోజకవర్గాల్లో ఏదో ఒక కార్యక్రమం నిర్వహిస్తూ... ప్రజల్లో ఉండేందుకు ప్రయత్నాలు చేస్తోంది కమలం పార్టీ. కార్యకర్తల్లో జోష్ నింపేందుకు జాతీయ స్థాయి నాయకులను జిల్లాకు రప్పించే యత్నం చేస్తున్నారు. ఉత్తర తెలంగాణలో బీజేపీ పుంజుకుంటోంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు వచ్చే వరకు పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా బీజేపీ అధిష్టానం వ్యూహాలు చేస్తోంది. పార్టీ నేతలు ఇతర పార్టీలకు పోటీగా కార్యక్రమాలు చేపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను మరింత ప్రజల వద్దకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లా ఎంపీ ధర్మపురి అర్వింద్, జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మినర్సయ్య, రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డితో పాటు నియోజకవర్గ ఇన్‌చార్జీలు మల్లికార్జున్‌రెడ్డి, వినయ్‌రెడ్డి, మేడపాటి ప్రకాష్, దినేష్, ధన్‌పాల్ సూర్యనారాయణతోపాటు ఇతర నేతలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సీనియర్ నేతలు అల్జాపూర్ శ్రీనివాస్, భూపతిరెడ్డితోపాటు ఇతర నేతలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
నియోజకవర్గాల్లో అధికార పార్టీ పర్యటనలు..
జిల్లాలోని అన్ని నియోజకవర్గాలపై అధికార పార్టీ నేతలు మరింత దృష్టిపెట్టారు. కొన్ని నెలలుగా గ్రామాలను పర్యటిస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారు. కొత్త పథకాలను మంజూరు చేయించుకుంటూ ముందుకుపోతున్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్‌రెడ్డి, బిగాల గణేష్‌గుప్త, షకీల్ అమీర్‌లు జిల్లాల్లో ఉండి పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఎనిమిదేళ్లలో ప్రభుత్వం ఎలాంటి పథకాలను అమలు చేసిందో వివరిస్తున్నారు. గ్రామాల అభివృద్ధితోపాటు ఉద్యోగాల నోటిఫికేషన్, రైతుబంధు, దళితబంధుతోపాటు ఇతర పథకాలను వివరిస్తున్నారు. పీకే నివేదిక బట్టి టికెట్లను కేటాయించే అవకాశం ఉండడంతో ప్రజల్లోనే ఉండి వారి అవకాశాలను మరింత మెరుగుపరుచుకునేవిధంగా ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలకు ఎక్కువ సమయం అందుబాటులో ఉండేవిధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర మంత్రులు కూడా జిల్లాలో పర్యటించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్దె గ్రామంలో పర్యటించారు. ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.
జిల్లాలో మూడు పార్టీల నేతలు తమ ప్రయత్నాల్లో ఉండగా.... బీఎస్పీ, ఆమ్‌ఆద్మీ పార్టీలతోపాటు వైఎస్‌ఆర్‌టీపీ నేతలు కూడా కార్యక్రమాలు నిర్వహించే ప్రయత్నాలు చేస్తున్నారు. బీఎస్పీ ఆధ్వర్యంలో జిల్లాలో పాదయాత్ర నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఈ మూడు పార్టీల నేతలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీలు ఒకేసారి కార్యక్రమాలు చేపట్టడం వల్ల జిల్లాలో రాజకీయ సందడి కనిపిస్తోంది. ఎన్నికలు ఎప్పుడనేది తెలియకున్నా... అధికార పార్టీ మాత్రం ముందస్తు ఎన్నికలకు వెళ్లే యోచన ఉందన్న విషయం తెలిసి మిగతా పార్టీలు సైతం ప్రజల్లో ఉండేందుకు కార్యక్రమాలు చేసుకుంటున్నాయ్.