Gannavaram Politics: కృష్ణా జిల్లా గన్నవరం రాజకీయం ర‌స‌వ‌త్త‌రంగా మారింది. స్థానిక టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Gannavaram MLA Vallabhaneni Vamsi) అధికార వైఎస్సార్‌సీపీ పంచ‌న చేర‌టంతో రాజ‌కీయంగా మ‌రింత జోరుఅందుకుంది. నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ నేత‌లు దుట్టా రామ‌చంద్ర‌రారావు, యార్లగడ్డ వెంక‌ట‌రావు, శివ భరత్ రెడ్డి మధ్య మాటలు యుద్ధం రోజు రోజుకి ఉత్కంఠంగా మారుతుంది. నేత‌లు ఒకరిపై ఒకరు పరస్పరం మాట‌ల‌తోనే దాడులు చేసుకోవడం అధికార వైసీపీలో రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మార్చేశారు. 


రోజురోజుకూ పెరుగుతున్న పొలిటికల్ హీట్ 
త‌నపై లేనిపోని ఆరోప‌ణ‌లు చేస్తున్నారంటూ వ‌ల్ల‌భ‌నేని వంశీ ఇటీవ‌ల సొంత పార్టీ నాయ‌కుల‌కే కౌంట‌ర్ ఇచ్చారు. ఆ త‌రువాత తామేమి త‌క్కువ కాదు అన్న‌ట్లుగా దుట్టా రామచంద్రరావు , యార్ల‌గ‌డ్డ వెంక‌ట‌రావు, శివభరత్ రెడ్డిలు ఎమ్మెల్యే వంశీకి కౌంటర్ ఇచ్చారు. దీంతో నేత‌ల మ‌ధ్య రోజుకో కామెంట్‌తో నియోజ‌క‌వ‌ర్గంలో అధికార పార్టిలోనే విభేదాలు బ‌య‌ట‌కు వస్తున్నాయి. దీంతో ఇక్కడ రోజురోజుకూ పొలిటికల్ హీట్ పెరుగుతోంది. టీడీపీ నుండి రెబ‌ల్ ఎమ్మెల్యేగా వ‌చ్చి పార్టీలో కొన‌సాగుతున్న వంశీని ఎదుర్కొనేందుకు నాయ‌కులంతా ఎకం అయ్యార‌ని చెబుతున్నారు. ఎవ‌రికి వారు త‌గ్గేదే లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. 


వైసీపీ నేత‌ల్లో టెన్షన్ టెన్షన్
ఎప్పుడు ఏం జరగుతుందో అని వైసీపీ నేత‌ల్లో హె టెన్ష‌న్ క్రియేట్ అవుతుంది. ఈ వ్య‌వ‌హ‌రం రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారితీసింది. అయితే సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి త‌న‌ను నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ని చేసుకోమ‌ని గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారని వంశీ నియోజ‌క‌వ‌ర్గంలోని వైసీపీ నేత‌ల‌కు చెబుతున్నట్లు తెలుస్తోంది. అయితే పార్టీని న‌మ్ముకుని మెద‌టి నుంచి ప‌నిచేస్తున్న త‌మ‌ను కాద‌ని, ఇప్పుడు మరో పార్టీ నుంచి గెలిచి వ‌చ్చిన వారికి నియోజ‌క‌వ‌ర్గం బాధ్యత‌ల‌ను అప్ప‌గించ‌టంపై వైసీపీ నేత‌లు భ‌గ్గుంటున్నారు. వంశీకి వ్య‌తిరేకంగా దుట్టా, యార్లగడ్డ , శివభరత్ రెడ్డి వ‌ర్గాలు బహాటంగానే ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు. నియోజకవర్గంలో మీరు ఎలాంటివారో అందరికీ తెలుసంటూ పార్టి సీనియ‌ర్ నేత దుట్టా రామ‌చంద్రరావు తీవ్ర స్దాయిలో అగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 40 ఏళ్లుగా ప్రజా సేవలో ఉన్నాన‌ని, ఎంపీ కావాలా, ఎమ్మెల్యే కావాలా అని స్వయంగా జగన్ అడిగారని చెప్పారు. కేవలం 800 ఓట్లతో గెలిచిన వంశీ త‌మపై ఆరోప‌ణ‌లు చేయ‌టం ఎంటని అంటున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరనేది అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పారు.


కాగా, దుట్టా అల్లుడు గోసుల శివభరత్ రెడ్డి కూడా టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వంశీపై ఘాటుగానే వ్యాఖ్య‌లు చేస్తున్నారు. సీఎం జగన్‌ను చూసి ఊరుకుంటున్నామ‌ని, రాయలసీమలో పాలేరుగా పని చేసిన వంశీ ఇప్పుడు త‌మ‌ను విమ‌ర్శించ‌టం ఎంట‌ని ధ్వజ‌మెత్తారు. తాము మ‌నుషుల‌కు వైద్యం చేసే వాళ్లం కాబ‌ట్టి మ‌నుషులుగా ప్ర‌వ‌ర్తిస్తున్నామ‌ని, వంశీ పశువులకు వైద్యం చేస్తాడు కనుక అలానే మాట్లాడుతున్నార‌ని ఫైర్ అయ్యారు. పిచ్చి పడితే ఆసుపత్రికి వెళ్లి వైద్యం చేయించుకోమ‌ని ఎద్దేవా చేశారు. అయితే ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా ఇదే స్దాయిలో రియాక్ట్ అయ్యారు. దుట్టా రామచంద్రరావు పెద్ద మనిషి అని గౌరవించాన‌ని, హద్దు మీరి పరిధి దాటి మాట్లాడుతున్నార‌ని ఫైర్ అయ్యారు. శివ భరత్ రెడ్డి డొక్క పగులకొడతానంటూ వార్నింగ్ ఇచ్చారు. వయస్సుకి మించి ఎక్కువ మాట్లాడుతున్నాడని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. శివభరత్ రెడ్డి భార్యకి జెడ్పీటీసీ బీ ఫాం ఇచ్చింది తానేన‌ని, ఏకగ్రీవం చేయించింది కూడా తానేన‌న్న విష‌యాన్ని గుర్తు పెట్టుకోవాల‌ని వంశీ వ్యాఖ్యానించారు.