Covid-19 కొత్త వేరియెంట్ Omicron తన ఉనికిని చాటుతోంది. ఇప్పటికే ఇండియాలోకి ప్రవేశించిన ఒమిక్రాన్.. ఇప్పుడు ముంబయిలోని మురికివాడలకు సైతం పాకింది. అత్యధిక జనాభా కలిగిన ఆయా ప్రాంతాల్లో వైరస్ చాలా వేగంగా విస్తరిస్తుందనే ఆందోళన అధికారులను భయాందోళనలకు గురిచేస్తోంది. ఇందుకు యూకే పరిశోధకులు, వైద్య నిపుణుల అధ్యయనాలు కూడా కలవరపెడుతున్నాయి. గత వైరస్‌ల కంటే ఒమిక్రాన్ చాలా వేగవంతమైనదని.. వీలైనంత త్వరగా కోవిడ్-19 బూస్టర్ డోస్‌లను తీసుకోవడం ద్వారా ఈ వైరస్ నుంచి ప్రాణాలను రక్షించుకోవచ్చని చెబుతున్నారు.


యూకేలో ఒమిక్రాన్ కేసులు రాత్రికి రాత్రి 44 శాతం పెరిగాయని అధికారులు నివేదించారు. UK హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ (UKHSA) తెలిపిన వివరాల ప్రకారం.. ఆ దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 817 కి చేరుకుంది. అయితే, ఇది కేవలం అధికారిక లెక్కల ప్రకారమేనని.. దాదాపు 10 వేల మందికి పైగా ఈ వైరస్ ఇన్ఫెక్షన్‌కు గురై ఉంటారని యూనివర్శిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా ప్రొఫెసర్ అలాస్టైర్ గ్రాంట్ అంచనా వేశారు. ఇంకా వ్యాక్సిన్ తీసుకోని వ్యక్తుల వల్ల కూడా ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తోందని అన్నారు. రోజుకు కనీసం 4 వేల మందికి ఈ వైరస్ సొకే అవకాశాలున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో అత్యధిక జనాభా కలిగిన ఇండియాలో కూడా పరిస్థితి దయనీయంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే డెల్టా వేరియెంట్ వల్ల నరయాతన అనుభవించిన ప్రజలు.. ఈ కొత్త వేరియెంట్‌తో ఎలాంటి సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందనే ఆందోళనతో ఉన్నారు. ప్రభుత్వం కూడా ఇప్పటికిప్పుడు లాక్‌డౌన్ ప్రకటించి.. వైరస్‌ను కంట్రోల్ చేయలేని పరిస్థితి మన ఇండియాలో ఉంది. ఆఫీసులు, స్కూళ్లు కూడా తెరుచుకోవడంతో వైరస్‌ మరింత వేగంగా వ్యాప్తి చెందే అవకాశాలున్నాయి. అన్ని జాగ్రత్తలు పాటించే యూకే వంటి దేశాల్లోనే వైరస్ ఆ స్థాయిలో ఉందంటే.. మన దేశంలో ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. 
 
మార్పు ఏదీ?: ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి చెందుతుందనే భయం ప్రజల్లో ఉన్నా.. కనీస జాగ్రత్తలు పాటించడంలో మాత్రం నిర్లక్ష్యం కనబరుస్తున్నారు. పైగా.. ఇప్పుడు వైరస్‌లకు అనుకూలమైన సీజన్ నడుస్తోంది. అలాగే అతి భయంకరమైన డెల్టా వేరియెంట్ కూడా దేశాన్ని వీడలేదు. ప్రజలు వేయించుకున్న.. కోవిడ్ టీకాల కాలం కూడా చెల్లుతోంది. నెల, రెండు నెలల్లో టీకా ప్రభావం పూర్తిగా తగ్గిపోతుంది. ఇది వైరస్‌కు కలిసి వస్తుంది. ప్రస్తుతమైన మన దేశం ఒమిక్రాన్‌ను అంత సీరియస్‌గా తీసుకోవడం లేదు. డెల్టా వైరస్‌తో పోల్చితే ఒమిక్రాన్ పెద్దగా ప్రమాదకరం కాదనే భావన ప్రతి ఒక్కరిలో నెలకొంది. పైగా ఒమిక్రాన్‌తో ఆస్పత్రిపాలైనవారి సంఖ్య కూడా తక్కువే. ఇప్పటివరకు ఒమిక్రాన్ మరణాలేవీ నమోదు కాలేదు. కానీ, ఒమిక్రాన్.. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ప్రభావం చూపుతోందని పరిశోధకులు అంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా ఒమిక్రాన్‌ను తేలిగ్గా తీసుకోవద్దని ప్రపంచ దేశాలకు హెచ్చరించింది. మరి మన ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయో చూడాలి.


Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..



Also Read: ప్రియుడు మాట్లాడటం లేదని పోలీసులకు ప్రియురాలు ఫిర్యాదు.. పెళ్లి చేసి తిక్క


Also Read: ‘కిమ్’ కర్తవ్యం?.. ఉత్తర కొరియా నియంత భార్యకు ఇన్ని రూల్సా? పిల్లలను కనే విషయంలోనూ..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి