సోషల్ మీడియా వచ్చాక రకరకాల ఫుడ్ ఐటమ్స్ వైరల్‌గా మారుతున్నాయి. ఫుడ్ ఫ్యూషన్ పేరుతో కొత్త రకాల వంటకాలను సృష్టించి వాటిని వైరల్ చేస్తున్నారు. ఇలాంటి అత్యంత విచిత్రమైన ఆహారాలు తినడానికి ఎలా ఉన్నా, చూడడానికి మాత్రం కాసేపు ఎంటర్టైన్ గానే ఉంటాయి. మొన్నటి వరకు ‘బిర్యాని సమోసా’ బాగా వైరల్ అయింది. సమోసాలో బిర్యాని పెట్టి దీన్ని తయారు చేస్తారు. ఇంకా దాన్ని మర్చిపోక ముందే ఇప్పుడు ‘భిండి సమోసా’ వచ్చింది, అంటే సమోసా లోపల ఆలూ కుర్మాకు బదులు బెండకాయ ముక్కలను పెట్టి సమోసాలు చేశారు. ఈ సమోసాలు చూడటానికి చాలా వింతగా ఉన్నాయి. 


భారతీయ స్ట్రీట్ ఫుడ్స్‌లో సమోసా ప్రధాన వంటకం. ఇప్పుడు దాన్ని రకరకాలుగా మార్చి చిత్రవిచిత్రంగా తయారు చేస్తున్నారు. సాధారణ సమోసాలో బంగాళదుంప కూరను స్టఫింగ్ చేసి వండుతారు. అందుకే దానికి అంత రుచి, కానీ ఇప్పుడు అనేక రకాల స్టఫింగ్ తో సమాసాలను తయారు చేస్తున్నారు. శ్రీనగర్ లోని క్లౌడ్ కిచెన్ లో  బంగాళదుంప కి బదులు బిర్యానీ ఉంచి తయారు చేశారు. ఇప్పుడు ఢిల్లీలోని చాందిని చౌక్‌లో ఓ సమోసా వ్యాపారి బంగాళాదుంపలు బదులు బెండకాయని పెట్టి సమోసా చేసి అమ్ముతున్నాడు. ఇది ఇప్పుడు ఫేస్బుక్ లో ట్రెండింగ్ గా మారింది. ఈ భిండి సమోసా ఫోటోలను చూసి ‘వామ్మో వీటి రుచి ఎలా ఉంటాయో’ అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ‘ఇది అత్యంత భయంకరమైన ఆహార కాంబినేషన్’ అని అభిప్రాయపడుతున్నారు నెటిజన్లు.  వండితే జిగటగా అనిపించే బెండకాయని ఎలా తింటామంటూ కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. యజమాని మాత్రం తన సమోసాలో బెండకాయ అలా జిగట రాకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకొని వండినట్టు చెబుతున్నాడు. ఆ సమోసాలు తినేవాళ్లు కూడా అధికంగానే ఉన్నారు.


గతంలో కూడా విచిత్రమైన ఫుడ్ ఫ్యూజన్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందులో ఒకటి గులాబ్ జామూన్ బర్గర్. బర్గర్ల మధ్య గులాబ్ జామూన్లు పెట్టి ఇస్తారు. ఇదే దాని ప్రత్యేకత. మరోసారి ఒరియో ఆమ్లెట్ కూడా వైరల్ అయ్యింది. ఓరియో బిస్కెట్లను పిండిలా చేసి, గుడ్లు, చాక్లెట్ సిరప్ వేసి ఆమ్లెట్లా వేస్తారు. ఇది నెటిజన్లను చాలా ఆశ్చర్యపరిచింది.  టీతో ఐస్ క్రీమ్ కూడా నెటిజన్లకు చిరాకు తెప్పించిన ఆహారం. టీలో ఐస్ క్రీమ్ కలిపి అమ్ముతున్నారు. 



Also read: పిల్లలకే కాదు పెద్దలకు టీకాలు అవసరమే, కచ్చితంగా తీసుకోవాల్సిన కీలకమైన టీకాలు ఇవిగో



Also read: థైరాయిడ్ సమస్య త్వరగా అదుపులోకి రావాలంటే వీటిని తీసుకోండి















గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.