అమరావతిలోని అమరేశ్వర ఆలయం వద్ద ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. పెదకూరపాడుకు చెందిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే నంబూరు శంకర్ రావు, అదే నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత కొమ్మాలపాటి శ్రీధర్ మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు తార స్థాయికి జరిగాయి. అక్రమ ఇసుక రవాణా, అవినీతిపై ఇరువర్గాలు చర్చించి నేడు (ఏప్రిల్ 9) అమరావతిలోని అమరేశ్వర ఆలయంలో ప్రమాణం చేద్దామని ఇద్దరూ సవాళ్లు విసురుకున్నారు. దీంతో పోటాపోటీగా వైఎస్ఆర్ సీపీ, టీడీపీ కార్యకర్తలు కూడా సన్నద్ధం అవుతుండడంతో ఉత్కంఠ నెలకొని ఉంది. ఉద్రిక్తకర పరిస్థితులు చోటు చేసుకోకుండా పోలీసులు అప్రమత్తమై భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పెదకూరపాడు నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక మాఫియా విషయంలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య ఈ సవాళ్లు చోటు చేసుకున్నాయి.


ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య సవాళ్ల నేపథ్యంలో సోషల్ మీడియాలో వైఎస్ఆర్ సీపీ, టీడీపీ కార్యకర్తలు కవ్వించుకోవడంతో పోలీసులు ముందుగానే అలర్ట్ అయ్యారు. అమరావతిలో 144 సెక్షన్‌ విధించారు. టీడీపీ, వైఎస్ఆర్ సీపీ నేతలకు ముందస్తుగా నోటీసులు ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ అజ్ఞాతంలో ఉండండంతో గుంటూరులోని ఆయన ఇంటికి నోటీసులు అంటించారు. కొమ్మాలపాటి శ్రీధర్‌తో పాటు ఐదు మండలాల టీడీపీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలకు పోలీసులు శనివారం నోటీసులు ఇచ్చారు.


ఈ అంశంపై శనివారం (ఏప్రిల్ 8) డీఎస్పీ ఆదినారాయణ అమరావతి పోలీస్‌ స్టేషన్‌లో మీడియాతో మాట్లాడారు. అమరావతిలో శనివారం రాత్రి 9 నుంచి ఆదివారం రాత్రి 9 వరకు 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని చెప్పారు. ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలు జరిగే అవకాశం ఉన్నందున శాంతిభద్రతల సమస్య తలెత్తితే పోలీసులు చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. ఇరు పార్టీల నాయకులు చర్చలకు లేదా ప్రమాణం కోసం అమరావతికి రావద్దని ఆయన కోరారు. ముందస్తు జాగ్రత్తగా తాము 200 మంది పోలీసులను రంగంలోకి దింపినట్లుగా చెప్పారు. అమరావతి చుట్టూ పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.


అమరావతిలోని లాడ్జీల్లో కొత్త వ్యక్తులకు గదులు ఇవ్వద్దని నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశామని అన్నారు. ఎవరూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని, చట్టాన్ని అతిక్రమిస్తే, కేసులు నమోదు చేస్తామని అన్నారు. 


టీడీపీ నేతల హౌస్ అరెస్టు
అమరావతికి వెళ్లకుండా టీడీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు ముందుగానే హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ముఖ్యమైనవారి ఇళ్ల వద్ద పోలీసు బందోబస్తు పెట్టారు.  మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌, ఐదు మండలాల తెదేపా అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలకు పోలీసులు శనివారం నోటీసులు అందజేశారు.