సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు సమయానికి టీకాలు వేయడానికి ప్రాధాన్యతను ఇస్తారు. తమ గురించి మాత్రం పట్టించుకోరు. పిల్లలకు వయసుకు తగ్గట్టు వేయించాల్సిన కొన్ని ముఖ్యమైన టీకాలు ఉన్నట్టే, పెద్దలకు కూడా వ్యాక్సిన్లు ఉన్నాయి. కానీ వీటిని తీసుకునేందుకు పెద్దలు ఆసక్తి చూపించడం లేదు. ఆధునిక కాలంలో పెరుగుతున్న ఆరోగ్య సమస్యలు తట్టుకోవాలంటే కచ్చితంగా అన్ని రకాల టీకాలు తీసుకోవాల్సిందే. వీటిని ఉచితంగా వేసే అవకాశం తక్కువ. ఎంతో కొంత రుసుము చెల్లించే ఈ టీకాలను తీసుకోవాలి. పెద్దలు కచ్చితంగా తీసుకోవాల్సిన టీకాల జాబితా ఇదిగో.
గర్భాశయ క్యాన్సర్ టీకా
ఇది కేవలం మహిళలకు మాత్రమే వేసే టీకా. దీన్ని ప్రతి మహిళా కచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే 2019లో గర్భాశయ క్యాన్సర్ కారణంగానే 45 వేల మందికి పైగా మహిళలు మరణించారు. ప్రతి లక్ష మంది మహిళల్లో 19 మందికి గర్భాశయ క్యాన్సర్ వస్తున్నట్టు అంచనా. కాబట్టి ప్రతి మహిళా ఈ టీకాను తీసుకోవాలి. గర్భాశయ క్యాన్సర్ నివారణకు మన దేశం ఇటీవల మొట్టమొదటి స్వదేశి టీకాను పరిచయం చేసింది.
టెటనస్ షార్ట్
టెటనస్... దీన్ని తెలుగులో ధనుర్వాతం అంటారు. క్లోస్ట్రిడియం అనే బాక్టీరియా వల్ల ఈ వ్యాధి వస్తుంది. కండరాలు సంకోచించి చాలా బాధాకరంగా మారుతాయి. ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే టీకా అందుబాటులో ఉంది. 18 ఏళ్ల దాటిన వారు ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి తీసుకోవడం చాలా ముఖ్యం.
ఫ్లూ వ్యాక్సిన్
ఫ్లూ గురించి ఎవరు అంతగా పట్టించుకోరు. వచ్చినా తగ్గిపోతుందిలే అనుకుంటారు. కానీ కోవిడ్ లాంటి వైరస్‌లు దాడి చేశాక ఫ్లూ కూడా ప్రాణాంతకమైనదని అర్థమైంది. కాబట్టి పెద్దలందరూ ఫ్లూ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఈ ఫ్లూ షాట్ ప్రతి సంవత్సరం తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీని తీసుకోవడం వల్ల శ్వాసకోశ వ్యాధులు రావు.
నిమోనియా వ్యాక్సిన్
మధుమేహం, గుండె సంబంధ వ్యాధులు, ఊపిరితిత్తుల వ్యాధులు, కాలేయ వ్యాధులు, క్యాన్సర్ వంటి రోగాలతో పోరాడుతున్న పెద్దలు ఏ వయసులోనైనా నిమోనియా బారిన పడే ప్రమాదం ఎక్కువ. అలాగే 65 ఏళ్ల కంటే వయసు ఎక్కువ ఉన్నవారు కూడా నిమోనియాతో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి వీరంతా కూడా నిమోనియా వ్యాక్సిన్ తప్పకుండా తీసుకోవాలి. దీనికోసం రెండు రకాల టీకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు టీకాలు రకరకాల బ్యాక్టీరియాలనుంచి రక్షణ కల్పిస్తాయి.
మరికొన్ని...
భారతదేశంలో పైన చెప్పిన వ్యాక్సిన్లతో పాటు పెద్దలు మరికొన్ని టీకాలు వేయించుకోవాలని సిఫార్సు చేస్తున్నారు. హేమోఫ్లస్ ఇన్ఫ్లుఎంజా టైప్ B వ్యాక్సిన్, హెపటైటిస్ A టీకా, హెపటైటిస్ B టీకా, హ్యూమన్ పాపిల్లోమావైరస్ టీకా, మెనింగోకాకల్ టీకా, న్యుమోకాకల్ కంజుగేట్ వ్యాక్సిన్, వరిసెల్లా టీకా, టెటానస్, డిప్తీరియా వ్యాక్సిన్, రోబెల్లా వాక్సీన్ వేయించుకోవాలి.
Also read: థైరాయిడ్ సమస్య త్వరగా అదుపులోకి రావాలంటే వీటిని తీసుకోండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.