జుట్టు అందాన్నే కాదు, ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది. జుట్టు రాలిపోతున్నా, బట్టతల వచ్చినా చాలామంది కుమిలిపోతుంటారు. రకరకాల విగ్గులు ట్రై చేస్తారు. వాటితో నానా తిప్పలు పడుతుంటారు. బట్టతల ఉన్న వ్యక్తులకు పెళ్లి కావడం కూడా గగనమే. బట్టతలపై మళ్లీ జుట్టు మొలిపించుకొనేందుకు కొందరు డబ్బును నీళ్లలా ఖర్చుపెడుతుంటారు. అయితే, ఇకపై ఆ సమస్యలు ఉండకపోవచ్చు. ఎందుకంటే.. బట్టతలపై జుట్టు మొలిపించే మందు సిద్ధమైపోయింది. ప్రస్తుతం ప్రయోగ దశలో ఉన్న ఈ మందు సత్ఫలితాలు ఇస్తోందని పరిశోధకులు వెల్లడించారు. ఇది అందుబాటులోకి వస్తే.. బట్టతల సమస్య చరిత్రగా మిగిలిపోతుందని అంటున్నారు. 


ఔషదం సిద్ధం: బట్టతల సమస్య ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. కొందరికి వంశపారంపర్యంగా బట్టతల వస్తుంది. మరికొందరికి పలు అనారోగ్యాలు, వాతావరణ పరిస్థితులు, జుట్టు సంరక్షణ లోపించడం తదితర కారణాల వల్ల బట్టతల ఏర్పడుతుంది. బట్టతల సమస్యను ‘అలోపేసియా అరేటా’ అని కూడా అంటారు. ఈ సమస్య ఏర్పడితే తలపై అక్కడక్కడా జుట్టు పూర్తిగా ఊడిపోయి ప్యాచ్‌లా కనిపిస్తుంది. అది క్రమేనా పెద్దదై జుట్టు మొత్తాన్ని మాయం చేస్తుంది. ఈ సమస్య నివారణ కోసం అమెరికా పరిశోధకులు ఓ ఔషదాన్ని కనుగొన్నారు.  


జుట్టు మొలిపిస్తుంది: అమెరికన్ ఫార్మాస్యూటికల్ కంపెనీ కాన్సర్ట్ ఫార్మాస్యూటికల్స్ బట్టతల వల్ల కోల్పోయిన జుట్టును మళ్లీ వచ్చేలా చేసే మాత్రను తయారు చేసింది. బట్టతల సమస్యను ఎదుర్కొంటున్న వ్యక్తులకు రోజుకు రెండుసార్లు ఈ మాత్రను ఇస్తోంది. ఈ ఔషదం జుట్టురాలే సమస్యను అడ్డుకోవడమే కాకుండా, దాన్ని రివర్స్ చేస్తుంది. అంటే, పోయిన జుట్టును మళ్లీ వచ్చేలా చేస్తుందన్నమాట. 


బాధితుల్లో 80 శాతం జుట్టు: ఇప్పటివరకు ఈ ప్రయోగంలో పాల్గొన్న 10 మందిలో నలుగురు ఏడాది వ్యవధిలో 80 శాతం కంటే ఎక్కువ జుట్టును తిరిగి పొందగలిగారు. ఈ కొత్త మాత్ర రోగనిరోధక ప్రతిస్పందనను తగ్గించడం ద్వారా పనిచేస్తుంది. ఈ ప్రయోగంలో భాగంగా పరిశోధకులు US, కెనడా, ఐరోపాలో 24 వారాలలో 18 నుంచి 65 సంవత్సరాల వయస్సు గల 706 మంది అలోపేసియా బాధితులను పరిశీలించింది. ప్రయోగం ప్రారంభంలో వీరికి కేవలం 16 శాతం జుట్టు మాత్రమే ఉంది. ఎవరికీ 50 శాతం మించిన జుట్టు లేదు. 


ఫలితాలు అద్భుతం: బాధితులను మూడు గ్రూపులుగా విభజించారు. ఒక గ్రూప్‌కు ఒకసారి ప్లేసిబో ఇచ్చారు. మరో గ్రూప్‌కు రోజుకు రెండు సార్లు 8 mg మోతాదు, మూడో గ్రూప్‌కు  రోజుకు రెండు సార్లు 12 mg చొప్పున మాత్రలు ఇచ్చారు. 12 mg మాత్రలను పొందినవారిలో 41.5 శాతం మందికి 80 శాతం కంటే ఎక్కువ జుట్టు పెరిగింది. చిత్రం ఏమిటంటే తక్కువ మోతాదులో ఆ మందును తీసుకున్న బాధితుల్లో 30 శాతం మందిలో కూడా 80 శాతం వరకు జుట్టు పెరిగింది. అయితే, ప్లేసిబో సాధారణ మోతాదు తీసుకున్న మొదటి గ్రూప్‌లో 0.8 శాతం మందికి మాత్రమే 80 శాతం కంటే ఎక్కువ జుట్టు పెరిగింది.  


ఇన్ఫెక్షన్ల ప్రమాదం: రోగనిరోధక ప్రతిస్పందన సమయంలో యాక్టీవ్ చేయబడే ఒక నిర్దిష్ట ఎంజైమ్‌ను నిరోధించేందుకు ఈ ఔషదం పనిచేస్తుంది. దీన్ని JAK1, JAK2 అని పిలుస్తారు. ఇది జానస్ కినాసెస్ అనే సమూహాన్ని తయారు చేస్తుంది. వాటిలో ఎక్కువ భాగం అలోపేసియాకు కారణమయ్యే ఉద్వేగపూరిత రోగనిరోధక ప్రతిస్పందనలను నివారిస్తాయి. అయితే, దీనివల్ల రోగనిరోధక శక్తి బలహీనం అవుతుంది.  ఫలితంగా మరిన్ని ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. 


Also Read: ఈ ఊరిలో పులులు, ప్రజలు కలిసే జీవిస్తారు, ఎక్కడో కాదు ఇండియాలోనే!
 
మరో 10 నెలలు వేచి చూడాల్సిందే: కొందరు ఈ ఔషదాన్ని తట్టుకోగలరని పరిశోధకులు తెలిపారు. అయితే, 5 శాతం కంటే తక్కువ మంది రోగులు తలనొప్పి, మొటిమలు, ఇన్ఫెక్షన్ల వంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదులు వచ్చినట్లు పరిశోధకులు తెలిపారు. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) ఆమోదం కోసం దరఖాస్తు చేయడానికి ముందు ఈ చికిత్స కోసం మరో రౌండ్ ఫేజ్ త్రీ క్లినికల్ ట్రయల్స్‌ చేపట్టనున్నట్లు కాన్సర్ట్ ఫార్మాస్యూటికల్స్ వెల్లడించింది. దీనికి మరో 10 నెలల సమయం పట్టవచ్చని పేర్కొంది. తాము రూపొందించే CTP-543 మందు.. భవిష్యత్తులో అలోపేసియా అరేటా బాధితులకు ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నామని వెల్లడించింది.  


Also Read: కంటి చూపు అకస్మాత్తుగా మసకబారుతోందా? ఇది ఆ ముప్పుకు సంకేతం!


గమనిక: అధ్యయనంలో పేర్కొన్న అంశాలను ఈ కథనంలో యథావిధిగా అందించాం. ఇది వైద్యానికి, నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదు.