హైదరాబాద్‌ పర్యటనలో ప్రధానమంత్రి మోదీ కేసీఆర్‌పై పరోక్షంగా సీరియస్ కామెంట్స్ చేశారు. తాము తెలంగాణ అభివృద్ధి కోసం ప్రయత్నాలు చేస్తుంటే తెలంగాణ సమాజాన్ని కుటుంబ పాలనలో బంధించాలని చూస్తున్నారని విమర్శించారు. తెలంగాణ పోరాటం సాగింది ఆ కుటుంబం కోసం కాదని అభిప్రాయపడ్డారు. తెలంగాణను విచ్చిన్నం చేసేవాళ్లు... నాడు నేడూ ఉన్నారని అన్నారు. యువతతో కలిసి తెలంగాణను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తామన్నారు మోదీ. 


వాళ్లతో అవినీతి పెరిగిపోతుంది


ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు హైదరాబాద్ కు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ బేగంపేట ఎయిర్ పోర్టులో బీజేపీ నేతల్ని కలిశారు. అక్కడే పార్టీ ఏర్పాటు చేసిన సభలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన పాలనపై నేరుగా విమర్శలు చేశారు.  ఓ కుటుంబం అధికారంతో రాష్ట్రాన్ని దోచుకోవాలని చూస్తోందని ఆరోపించారు. కుటుంబ పార్టీలు అధికారంలో ఉంటే అవినీతి మరింత పెరిగిపోతుందని అన్నారు. కుటుంబ పార్టీలు దేశానికి చేటని విమర్శించారు.  


తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే


తెలంగాణను విచ్ఛిన్నం చేసే వాళ్లు అప్పుడూ ఇప్పుడు కూడా ఉన్నారన్నారు మోదీ. మేం తెలంగాణ బాగుకోసమే పోరాడుతున్నామన్నారు. మేం చేస్తున్న పోరాటం ఫలితాన్ని ఇస్తోందని అభిప్రాయపడ్డారు. ఆయన వాటివల్ల అవినీతి పెరిగిపోతుంది. తెలంగాణలో మార్పు రావడం తథ్యమన్న మోదీ... వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీనే అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. ఇప్పటికే ప్రజలు నిర్ణయం తీసుకున్నారని వివరించారు. 


కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పోరాడాలి


అవినీతి కారణంగా తెలంగాణ యువత ఆకాంక్ష నెరవేరలేదన్నారు ప్రధానమంత్రి. దీనికి తెలంగాణలో నిజాయతీ పాలన అవసరం ఉందన్న  మోదీ... అది బీజేపీ వల్లే సాధ్యమన్నారు ప్రధానమంత్రి మోదీ. కుటుంబ పార్టీల నుంచి విముక్తి లభించాలన్నారు. ప్రజల మనసుల నుంచి తమ పేర్లను ఎవరూ తుడిచిపెట్టలేరని కామెంట్ చేశారు. పేదల సమస్యలు కుటుంబ పార్టీలకు పట్టవన్న ఆయన... కుటుంబ పాలనకు వ్యతిరేకంగా యువత పోరాటం చేయాలన్నారు. 


కేంద్రం చేపట్టే పథకాలను తెలుగు ప్రజలకు అందివ్వడం లేదన్న ప్రధానమంత్రి మోదీ.. పథకాల్లో రాజకీయం చేస్తే ప్రజలు నష్టపోతారన్నారు. పథకాలతో రాజకీయాలు చేయొద్దని సూచించారు. తెలంగాణలో బీజేపీ కార్యకర్తలపై దాడులు పెరిగాయన్నారు. ముగ్గురు కార్యకర్తలు ప్రాణ త్యాగం చేశారన్నారు. 21 శతాబ్ధంలో కూడా కొందరు మూడనమ్మకాలను పాటిస్తున్నారని... దీని వల్ల రాష్ట్రం వెనుకబడి పోతుందని విమర్శించారు మోదీ. ఇలాంటి వాళ్లు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లలేరని అభిప్రాయపడ్డారు.