ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు (మే 26) హైదరాబాద్ కు రానున్న వేళ ఆయన పర్యటన విషయంలో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఆయన హైదరాబాద్‌కు మధ్యాహ్నం 1.25కు చేరుకోవాల్సి ఉండగా, కాస్త ముందుగా 12.50 నిమిషాలకు రానున్నారు. ఓ అరగంట ముందుగానే హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయానికి వస్తున్నారు. ముందుగానే హైదరాబాద్ వచ్చి తర్వాత పావుగంట పాటు తెలంగాణ బీజేపీ నేతలతో భేటీ అవ్వనున్నారు. ఆ తర్వాత బేగంపేట్ నుంచి హెలికాఫ్టర్‌లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చేరుకోనున్నారు. అయితే, నిన్ననే బండి సంజయ్ మతపరమైన వ్యాఖ్యలు వివాదాస్పదంగా చేసిన వేళ ఇప్పుడు బీజేపీ నేతలతో మోదీ సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదీ (తొలుత ప్రకటించిన ప్రకారం..):
* మే 26న మధ్యాహ్నం 1 .30 గంటల కి బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు ప్రధాని మోదీ
* 1.45 వరకు బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ పార్కింగ్ లో బీజేపీ నేతలతో మీటింగ్
* 1.50 కి హెలికాప్టర్‌లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెలిప్యాడ్‌కు మోదీ. హెలిప్యాడ్‌లో దిగి రోడ్డు మార్గాన 2 కి.మీ. ప్రయాణించి ఐఎస్‌బీకి
* మధ్యాహ్నం 2 గంటల నుంచి 3.15 గంటల మధ్య ఐఎస్‌బీ వార్షికోత్సవంలో పాల్గొననున్న ప్రధాని మోదీ
* తిరిగి సాయంత్రం 4 గంటలకు తిరిగి బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు మోదీ
* 4 .15 గంటలకు బేగంపేట్ నుంచి చెన్నై కి బయలుదేరనున్న ప్రధాని
ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..
మరోవైపు, మోదీ పర్యటన వల్ల హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు గురువారం అమల్లో ఉండనున్నాయి. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.
* లింగంపల్లి నుంచి గచ్చిబౌలికి వచ్చే వాహనదారులు హెచ్‌సీయూ డిపో వద్ద లెఫ్ట్ తీసుకొని, మసీద్ బండ కమాన్ వద్ద లెఫ్ట్ టర్న్ తీసుకొని, కొండాపూర్ ఏరియా ఆస్పత్రి, బొటానికల్ గార్డెన్ వద్ద రైట్ టర్న్ తీసుకొని గచ్చిబౌలికి రావాల్సి ఉంటుంది.
* విప్రో జంక్షన్ నుంచి లింగంపల్లికి వెళ్లేవారు విప్రో జంక్షన్ వద్ద లెఫ్ట్ తీసుకొని క్యూ సిటీ, గౌలిదొడ్డి, గోపన్ పల్లి ఎక్స్ రోడ్డులో రైట్ టర్న్ తీసుకొని, HCU బ్యాక్ గేట్ నుంచి నల్లగండ్ల మీదుగా లింగంపల్లి చేరుకోవాలి.
* విప్రో జంక్షన్ నుంచి గచ్చిబౌలికి వెళ్లాల్సిన వాహనదారులు.. విప్రో జంక్షన్ వద్ద రైట్ టర్న్ తీసుకొని ఫెయిర్ ఫీల్డ్ హోటల్, నానక్ రామ్ గూడ రోటరీ వద్ద లెఫ్ట్ టర్న్ తీసుకొని, ఓఆర్ఆర్ రోడ్డు, ఎల్ అండ్ టీ టవర్స్ ద్వారా గచ్చిబౌలి జంక్షను చేరుకోవచ్చు.
* కేబుల్ బ్రిడ్జి మీదుగా గచ్చిబౌలికి వెళ్లాల్సిన వాహనదారులు.. కేబుల్ బ్రిడ్జి అప్లమ్ రోడ్డు నంబర్-45, మాదాపూర్ రత్నదీప్, మాదాపూర్ పోలీస్ స్టేషన్, సైబర్ టవర్స్, హైటెక్స్, కొత్తగూడ, బొటానికల్ గార్డెన్ ద్వారా గచ్చిబౌలి జంక్షన్‌కు చేరుకోవచ్చు.
* గచ్చిబౌలి జంక్షన్ నుంచి లింగంపల్లి వెళ్లే వాహనదారులు గచ్చిబౌలి జంక్షన్ వద్ద రైట్ టర్న్ తీసుకొని, బొటానికల్ గార్డెన్ వద్ద లెఫ్ట్ తీసుకొని కొండాపూర్ ఏరియా ఆస్పత్రి, మసీద్ బండ, మసీద్ బండ కమాన్, HCU డిపో రోడ్డు గుండా లింగంపల్లికి వెళ్లాల్సి ఉంటుంది.