తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ బెంగళూరు వెళ్లనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బెంగళూరు బయల్దేరి వెళ్తారు. నేరుగా దేవెగడ నివాసానికి చేరుకొని లంచ్‌ మీటింగ్‌లో పాల్గొంటారు. రాష్ట్రాలను బలహీన పరిచేలా బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్న విధానాలు, దేశంలో ఉన్న సమస్యలు, జాతీయ రాజకీయాల్లో రావాల్సిన మార్పులపై ఇద్దరి మధ్య డిస్కషన జరగనుంది. భవిష్యత్‌లో కీలక పాత్ర పోషించాలంటే అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా మాట్లాడుకోనున్నారు. ఈ భేటీలో దేవెగౌడతోపాటు కుమారస్వామి కూడా పాల్గోనున్నారు.  


వీళ్లిద్దరి మధ్య రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల అంశం కూడా చర్చకు రానున్నట్టు తెలుస్తోంది. దీన్నే అవకాశంగా తీసుకొన ప్రాంతీయ పార్టీల సత్తాను కేంద్రానికి తెలియజేసేలా వ్యూహాన్ని రెడీ చేయాలని సీఎం కేసీఆర్ ఎప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా కొన్ని నెలల నుంచి వివిధ రాజకీయా పార్టీలు, వర్గాలతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నారు. మొన్నటికి మొన్న దిల్లీ కూడా వెళ్లి వచ్చారు. అవకాశం చిక్కినప్పుడల్లా కేంద్ర విధానాలను తీవ్ర స్థాయిలో తప్పుపడుతున్నారు. 


కేసీఆర్‌ బెంగళూరు టూర్ సందర్భంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ఆయన అభిమానులు. బెంగళూరులో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దేశ్‌కి నేత వస్తున్నాడని... సాదరస్వాగతం పలుగుతోంది.  


ప్రధానమంత్రి మోదీ హైదరాబాద్ వస్తున్న టైంలో సీఎం కేసీఆర్ బెంగళూరు టూర్ పెట్టుకోవడం చాలా చర్చనీయాంశంగా మారింది. ఇండియన్ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో జరిగే సమావేశానికి ప్రధానమంత్రి ఇవాళ రానున్నారు. గత మూడు పర్యాయాలుగా ప్రధాని పర్యటనకు సీఎం కేసీఆర్‌ గైర్హాజరవుతున్నారు. 2020 నవంబరు 28న హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్‌ను ప్రధాని సందర్శించినప్పుడు మొదటి సారి సీఎం కేసీఆర్‌ వెళ్లలేదు. ఈ అంశం కూడా అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. ప్రధాని కార్యాలయమే సీఎం కేసీఆర్‌ను వద్దని చెప్పి సమాచారం ఇచ్చిందని... అందుకే వెళ్లలేదని రాష్ట్ర ప్రభుత్వం వివరణ కూడా ఇచ్చింది. 


ముచ్చింతల్‌లో సమతామూర్తి రామానుజాచార్య విగ్రహాష్కరణకు ఫిబ్రవరి 5న ప్రధాని వచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ దూరంగా ఉన్నారు. అప్పుడు ఆయన వచ్చి రెండు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఏ కార్యక్రమంలో కూడా కేసీఆర్ కనిపించలేదు. అనారోగ్యం కారణంగానే ఈ టూర్‌కు దూరంగా ఉన్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పుడు కూడా ప్రధాని టూర్‌ వారం రోజుల క్రితమే ఖరారైంది. అయినా సీఎం కేసీఆర్‌ ఈ టూర్‌లో పాల్గొనడం లేదు. దీనిపై మరోసారి బీజేపీ, టీఆర్‌ఎస్‌ మధ్య మాటల యుద్ధం నడిచే ఛాన్స్ ఉంది.