Delhi's Thyagraj Stadium: దిల్లీలో త్యాగ్‌రాజ్ స్టేడియంలో అథ్లెట్లు, ఫుట్‌బాల్ క్రీడాకారులను ప్రతిరోజూ శిక్షణను త్వరగా ముగించి వెళ్లాలని ఒత్తిడి తెస్తున్నారు. ఇంతకీ అధికారులు ఒత్తిడి తెస్తున్నది ఎందుకో తెలుసా? ఓ ఐఏఎస్ అధికారి తన కుక్కతో కలిసి సాయంత్రం ఆ స్టేడియంలో వాకింగ్ చేస్తారు. ఇందుకోసం ఏకంగా కామన్వెల్త్ గేమ్స్ సందర్భంగా నిర్మించిన ఓ స్టేడియాన్ని ఉపయోగిస్తున్నారు. దీంతో అథ్లెట్లు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినట్లు ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఓ కథనం ప్రచురించింది.
ఎవరంటే?
ఈ ఐఏఎస్ అధికారి సంజీవ్ ఖిర్వార్ ప్రస్తుతం దిల్లీ రెవెన్యూ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆయన తన శునకంతో పాటు స్టేడియంలో వాకింగ్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో అక్కడ శిక్షణ పొందుతున్న వారితో పాటు నిత్యం ప్రాక్టిస్ చేయడానికి వస్తున్న క్రీడాకారులు, అథ్లెట్లు, కోచ్ లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సదరు ఐఏఎస్ అధికారిపై నెటిజన్లు సీరియస్ అవుతున్నారు.
కొన్ని రోజులుగా త్యాగరాజ్ స్టేడియంలోని అథ్లెట్లు, కోచ్‌లు సాధారణ సమయం కన్నా ముందుగానే అంటే సాయంత్రం 7 గంటలలోపు వారి శిక్షణ ముగించేలా ఒత్తిడి తెస్తున్నారు. దీని కారణంగా అథ్లెట్లు , ఇతర క్రీడాకారులు శిక్షణపై ప్రభావం పడుతుందని కోచ్‌లు, క్రీడాకారులు చెబుతున్నారు. ప్రతిరోజు సాయంత్రం 7 గంటల తర్వాత సంజీవ్ ఖిర్వార్ తన కుక్కతో అక్కడికి వాకింగ్ వస్తారు.
త్యాగరాజ్ స్టేడియం 2010 కామన్వెల్త్ గేమ్స్ కోసం నిర్మించారు. ఈ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడాకారులతో పాటు ఫుట్‌బాల్ క్రీడాకారులకు శిక్షణ ఇస్తారు.
ఖండించిన ఖిర్వార్
ఈ ఆరోపణలపై స్పందించిన ఐఏఎస్ అధికారి ఖిర్వార్.. తాను ఒక క్రీడాకారుడ్ని కూడా స్టేడియం వదిలి వెళ్ళమని ఎప్పుడూ చెప్పలేదన్నారు.
కేజ్రీవాల్ స్పందన
ఈ విషయం ప్రభుత్వ దృష్టికి రావడంతో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చర్యలు చేపట్టారు. త్యాగరాజ్ స్టేడియం మూసివేతకు సంబంధించిన విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. త్యాగరాజ్ స్టేడియంతో పాటు దిల్లీలోని అన్ని ప్రభుత్వ స్టేడియంలను రాత్రి 10 గంటల వరకు క్రీడాకారులకు, అథ్లెట్లకు అందుబాటులో ఉంచాలని సీఎం కేజ్రీవాల్ ఆదేశించారు.
Also Read: Supreme Court: స్వచ్ఛంద వ్యభిచారం నేరం కాదు- సెక్స్ వర్కర్లను వేధించొద్దు: సుప్రీం కోర్టు
Also Read: Covid 19: దేశంలో కొత్తగా 2,628 కరోనా కేసులు- 18 మంది మృతి