Supreme Court:  సెక్స్ వర్కర్లను ఎలాంటి వేధింపులకు గురిచేయవద్దని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పోలీసులకు సుప్రీం కోర్టు కీలక ఆదేశాలిచ్చింది. అలానే మీడియాకు కూడా ఈ అంశంపై ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడైనా దాడులు నిర్వహించినప్పుడు పట్టుబడిన సెక్స్‌ వర్కర్ల ఫొటోలను మీడియా ప్రచురించరాదని స్పష్టం చేసింది.




సెక్స్‌ వర్కర్లకు సంబంధించి కోర్టు నియమించిన కమిటీ కీలక సిఫార్సులు చేసింది. వీటిని సుప్రీంకోర్టు ఆమోదించింది. వీటిని రాష్ట్ర ప్రభుత్వాలు కఠినంగా అమలు చేయాలని ఆదేశించింది.


అమలు చేయాల్సిందే


ఈ ఆదేశాలు మీరి సెక్స్ వర్కర్ల ఫొటోలు.. మీడియా ప్రచురించినా, వారి గుర్తింపును వెల్లడించినా ప్రచురణకర్తలపై ఐపీసీ 354సీ ప్రకారం చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ విషయంలో ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా తగిన మార్గదర్శకాలు జారీ చేయాలని సుప్రీంకోర్టు నిర్దేశించింది. ఆర్టికల్‌ 142ని ఉపయోగించి సుప్రీంకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది.


కమిటీ సిఫార్సులు



  • వ్యభిచార గృహాలు నడపడం చట్ట విరుద్ధం తప్పితే స్వచ్ఛందంగా వ్యభిచారం చేయడం నేరం కాదు.

  • అందువల్ల ఇలాంటి గృహాలపై దాడులు చేసినప్పుడు స్వచ్ఛందంగా ఉంటున్న సెక్స్‌ వర్కర్లను అరెస్ట్‌ చేయడం గానీ, శిక్షించడం, వేధించడం గానీ చేయకూడదు.

  • ఏ సెక్స్‌ వర్కర్‌ అయినా లైంగికదాడికి గురైతే ఇతరుల మాదిరిగానే వారికీ సౌకర్యాలు కల్పించాలి. సీఆర్‌పీసీ సెక్షన్‌ 357సీ ప్రకారం తక్షణ వైద్య సేవలు అందించాలి.

  • సెక్స్‌ వర్కర్లకు మిగతా పౌరుల్లాగే రాజ్యాంగబద్ధమైన ప్రాథమిక హక్కులున్నట్లు గుర్తించాలి.

  • సెక్స్‌ వర్కర్ల ఫొటోలు, వారి వివరాలు వెల్లడించకుండా మీడియా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

  • కొత్తగా ప్రవేశపెట్టిన ఐపీసీ 354సీ సెక్షన్‌ కింద ఇతరుల లైంగిక కార్యకలాపాలను చూడటం నేరంగా పరిగణిస్తారు. అందువల్ల ఈ సెక్షన్‌ను ఎలక్ట్రానిక్‌ మీడియాపై కఠినంగా అమలు చేయాలి.

  • రెస్క్యూ ఆపరేషన్ల పేరుతో సెక్స్‌ వర్కర్లు, ఇతరుల ఫొటోలు, వివరాలు ప్రసారం చేయడం నిషేధం.

  • సెక్స్‌ వర్కర్లు తమ ఆరోగ్యం, భద్రత కోసం కండోమ్‌ లాంటివి దగ్గర ఉంచుకున్నప్పుడు వాటిని ఆధారంగా చేసుకొని నేరంగా పరిగణించడానికి వీల్లేదు.

  • యూఐడీఏఐ జారీచేసే ప్రొఫార్మా సర్టిఫికెట్‌ను అనుసరించి సెక్స్‌ వర్కర్లందరికీ ఆధార్‌కార్డు జారీ చేయాలి. వారి వివరాలు తీసుకొనేటప్పుడు ఎక్కడా సెక్స్‌వర్కర్‌గా పేర్కొనకూడదు.


Also Read: Covid 19: దేశంలో కొత్తగా 2,628 కరోనా కేసులు- 18 మంది మృతి



Also Read: World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?