Monkey Fever Symptoms : కోవిడ్ మహమ్మారి గురించి జనాలు మరవక ముందే కొత్త కొత్త రోగాలు, వైరస్‌లు పలుకరిస్తూనే ఉన్నాయి. తాజాగా మరో కొత్త వ్యాధి ప్రజలను భయపెడుతోంది. అదే మంకీ ఫీవర్. అసలు మంకీ ఫీవర్ అంటే ఏమిటి? దాని లక్షణాలు ఎలా ఉంటాయి? మంకీ ఫీవర్ సోకిందని ఎలా నిర్దారిస్తారు? ఎలాంటి చికిత్స తీసుకోవాలి? పూర్తి వివరాలు తెలుసుకుందాం. 


మంకీ ఫీవర్ దేశ ప్రజలను భయాందోళనకు గురిచేస్తుంది. మంకీ ఫీవర్‌ను క్యాసనూర్ ఫారెస్ట్ డీజీజ్ ( KFD) అని కూడా అంటారు. ఈ వైరస్ కర్నాటకలో ఇద్దరిని బలితీసుకుంది. ఈ వైరస్ సాధారణంగా కోతుల ద్వారా సంక్రమిస్తుంది. కోతులను కరిచిన టిక్ బర్న్ హెమరేజిక్ అనే కీటకం మనుషులను కరవడం వల్ల ఈ వ్యాధి సోకుతుంది. ఈ కీటకం ఫ్లావివిరిడే కుటుంబానికి చెందిన ఆర్బోబిరస్.


కర్నాటకలో దాదాపు 49 మందికి ఈ వైరస్ సోకినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. 18 ఏళ్ల అమ్మాయికి, 79 ఏళ్ల వ్యక్తి ఈ వ్యాధికి గురై ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్ సోకినప్పుడు ఆకస్మిక జ్వరం, తలనొప్పి, శరీరనొప్పి, వాంతులు, కడుపునొప్పి,అతిసారం వంటి లక్షణాలు ప్రారంభంలో కనిపిస్తాయి. మన తెలుగు రాష్ట్రాల్లోనూ కోతుల బెడద ఎక్కువే. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. 


మంకీ ఫీవర్ అంటే ఏమిటి?


మంకీ ఫీవర్ అనేది క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్ అనే వైరల్ హెమరేజిక్ వ్యాధి. ఈ వైరస్ ను మనదేశంలో పశ్చిమ కనుమలలో క్యాసనూర్ అటవీ ప్రాంతంలో 1957లో మొదటిసారిగా గుర్తించారు. ఇది ఫ్లావివిరిడే కుటుంబానికి చెందిన ఆర్బోబిరస్. మొదట్లో కర్నాటకలోని పశ్చిమ కనుమలకు మాత్రమే పరిమితమై ఈ మహమ్మారి.. తర్వాత దాని ఉనికిని విస్తరించింది. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడుతోపాటు పశ్చిమ కనుమల వెంటనే పొరుగు రాష్ట్రాల్లో కేసులు నమోదు అయ్యాయి. ఈమధ్యే కర్నాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో 31 కేసులు నమోదు అయ్యాయి. ఈప్రాంతాల్లో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. బాధితులను ఆసుపత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో నివారణ చర్యలను చేపడుతోంది. 


మంకీ ఫీవర్ ఎలా వ్యాపిస్తుంది?


ఈ మంకీ ఫీవర్ అనేది సాధారణంగా కోతుల ద్వారా సంభవిస్తుంది. కోతులను కరిచిన కీటకాలు మనుషులను కూడా కరిస్తే.. ఇది వ్యాపిస్తుంది. ఇది సోకగానే ముందుగా ముక్కులో నుంచి రక్తం కారడం, నాడీ సంబంధిత జ్వరం లక్షణాలు ఉంటాయి. ఈ వైరస్ బారిన దాదాపు 80 శాతం మంది రోగులు ఈ వైరల్ లక్షణాలు లేకుండానే కోలుకుంటున్నారు. దాదాపు 20 శాతం మంది తీవ్రమైన రక్తస్రావ లేదా నరాల సంబంధిత సమస్యలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. అయితే ఈ ఇన్ఫెక్షన్ బారిన పడి ఏడాదికి 3 నుంచి 5 శాతం మంది మరణించే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు.  


ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త


☀ వైరస్ సోకిన తర్వాత మూడు నుంచి ఒకవారం వరకు ఎలాంటి లక్షణాలు కనిపించవు. 


☀ వారం తర్వాత జ్వరం, చలి, తలనొప్పి, తీవ్రమైన అలసట, ఆకస్మాత్తుగా ప్రారంభమవుతాయి.


☀ వ్యాధి ముదురుతున్న కొద్దీ వికారం, వాంతులు, కడుపునొప్పి, విరేచనాలు, మెనింజైటిస్, గందరగోం, ముక్కునుంచి రక్తస్రావం, చిగుళ్ల నుంచి రక్తస్రావం వంటి లక్షణాలు ఉంటాయి. 


☀ సరైన సమయంలో గుర్తించి చికిత్స తీసుకోనట్లయితే ఈ వైరస్ శరీరంలోని ఇతర అవయావాలకు సోకి ప్రాణాంతకంగా మారవచ్చు. 


☀ లక్షణాలను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స తీసుకున్నరోగులు 10 నుంచి 14 రోజుల్లో కోలుకుంటున్నారు. 


☀ ఈ వైరస్ సోకిన రోగుల్లో మరణరేటు కేవలం 2 నుంచి 10 శాతం మాత్రమే ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. 


☀ తక్కువ ఇమ్యూనిటీ ఉన్నవారికి ఈ వ్యాధి త్వరగా సోకే ప్రమాదం ఉంటుంది. 


నివారణ చిట్కాలు: 


☀ ఈ వ్యాధిని ELISA యాంటీబాడీ పరీక్షలు, RT-PCR పరీక్షల ద్వారా గుర్తిస్తారు. 


☀ ఈ వ్యాధికి ఎలాంటి మందులు లేవు. 


☀ ఈ వైరస్ ప్రబలుతున్న ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండటం, రక్షిత దుస్తులు ధరించడం ముఖ్యం. 


☀ ఇలాంటి ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు వ్యాధి గురించి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి. 


☀ తీవ్రమైన కేసులు ఉంటే  ఇంటెన్సివ్ కేర్ కోసం ఆసుపత్రిలో చేర్పిచండం అత్యవసరం. 


☀ నొప్పితోపాటు  జ్వరాన్ని తగ్గించడానికి అనాల్జెసిక్స్,  యాంటిపైరెటిక్స్ వంటి యాంటీబయెటిక్స్ ను వైద్యులు సూచిస్తారు. 


Also Read : బరువు తగ్గాలంటే ఈ ఫ్రూట్స్ తినాలంటున్న నిపుణులు ☀ ఎందుకంటే?























గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.