ఆహారం, నిద్ర ఈ రెండు ఆరోగ్యానికి చాలా అవసరం. మన జీవన విధానం సక్రమంగా సాగాలంటే ఇవి కచ్చితంగా సమయ పాలన చాలా అవసరం. లేదంటే అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అతిగా నిద్రపోతే ఎన్ని సమస్యలు వస్తాయో తక్కువగా నిద్రపోయినా కూడా అన్నే సమస్యలు వస్తాయి. తగినంత నిద్ర పోకపోవడం వల్ల ఊబకాయం, అధికంగా బరువు పెరగడం వంటి సమస్యలకి దారి తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రస్తుత కాలంలో యుక్తవయసు వాళ్ళు తగినంత నిద్ర లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నిపుణులు చెబుతున్నారు. స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత నిద్ర పోయే సమయం తగ్గిపోతుంది. గంటల తరబడి ఫోన్లో ఏదో ఒకటి చూస్తూ సమయాన్ని వృధా చేసుకుంటూ నిద్రకి ఆటంకం కలిగిస్తున్నారు. దీనిపై స్పెయిన్ కి చెందిన నిపుణుల బృందం ఓ అధ్యయనం నిర్వహించింది. కౌమారదశలో ఉన్న సుమారు 1229 మందిని అధ్యయనం చేశారు, వారి నిద్ర వ్యవస్థ, ఆరోగ్య పనితీరు ఎలా ఉందనే విషయాన్ని పరిశీలించారు. ఇందులో సగం మంది అమ్మాయిలు, సగం మంది అబ్బాయిలను తీసుకున్నారు.
12, 14, 16 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళని ఎంచుకుని ఏడు రోజుల పాటు వారి నిద్ర వ్యవస్థని పరిశీలించారు. అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ నివేదిక ప్రకారం 6-12 సంవత్సరాల పిల్లలకి 9-12 గంటల నిద్ర అవసరం. అలాగే 13-18 సంవత్సరాల వయసు వారికి 8-10 గంటల నిద్ర ఆరోగ్యానికి అవసరమని వైద్యులు సలహా ఇస్తున్నారు.
అధ్యయనంలో పాల్గొన్నవారిని తక్కువ స్లీపర్‌లు (7 గంటల కంటే తక్కువ), షార్ట్ స్లీపర్స్ (7 నుంచి 8 గంటలు), ఆప్టిమల్ (8 గంటలు లేదా అంతకంటే ఎక్కువ) అనే మూడు విభాగాలు చేశారు. వారి నడుము చుట్టుకొలత, రక్తపోటు, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పరిశీలించారు. బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారం తక్కువ నిద్రపోయిన వారిలో ఊబకాయం, అధికంగా బరువు పెరగడం వంటి లక్షణాలని గుర్తించారు.
అధిక బరువు, ఊబకాయం లక్షణాలు 12, 14, 16 సంవత్సరాల వయస్సులో 27 శాతం, 24 శాతం, 21 శాతం కనిపించాయి. అబ్బాయిలు తక్కువగా నిద్రపోయినట్టు వాళ్ళు తెలిపారు. శారీరక శ్రమ, ధూమపాన అలవాట్లు, నివసించే స్థలాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నారు. బాగా నిద్రించే వారితో పొల్చితే తక్కువ నిద్రించే వారిలో ఊబకాయం సమస్య 72 శాతం కనిపించింది. శరీరానికి సరిపడా నిద్రలేనివారిలో అనేక సమస్యలు కనిపించాయి. శారీరక శ్రమ, సమతుల్య ఆహారం వల్ల జీవక్రియ మెరుగుపడటంతో పాటు నిద్రకి కూడ ఎటువంటి ఇబ్బంది తలెత్తవని నిపుణులు చెప్తున్నారు.
నిద్ర వేళలు తగ్గించకూడదు, అలాగని అతిగా నిద్రపోకూడదు కూడా. ఎనిమిది గంటల పాటూ నిద్రపోతే చాలు. పదిగంటలు దాటి పడుకున్నా, ఏడుగంటల కన్నా తక్కువ నిద్రపోయినా కూడా శరీరంలో కనపించని సమస్యలు మొదలవుతాయి. ముఖ్యంగా మధుమేహం, నిద్ర మధ్య విడదీయలేని బంధం ఉంది. ఒక్క రోజు సరిగా నిద్రపోకపోయినా రక్తంలో గ్లూకోజు స్థాయిలపై తీవ్ర ప్రభావం పడిపోతాయి.
నిద్ర పట్టకపోవడం వల్ల ఒత్తిడికి కారణమయ్యే కార్టిసోల్ హార్మోన్ ఉత్పత్తి కూడా పెరిగిపోతుంది. దీని వల్ల మానసిక సమస్యలు, తలనొప్పి మొదలవుతుంది. నిద్రలేమి వల్ల ఆకలి కూడా తగ్గిపోతుంది. దానికి కారణం లెఫ్టిన్ అనే హార్మోన్లు. నిద్ర సరిగా పట్టకపోతే వీటి స్థాయిలు పెరిగిపోతాయి. దీంతో సరిగా తినక పోషకాహారలోపం తలెత్తవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే నిద్రలేమి వల్ల ఎన్నో నష్టాలు ఉన్నాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: పిల్లలకి జలుబు చేసిందని నెబులైజర్ పెడుతున్నారా? అయితే జర జాగ్రత్త