AP News : ఆంధ్రప్రదేశ్ అప్పులపై ఢిల్లీలో హైలెవల్ మీటింగ్ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, సీఎస్‌ సమీర్‌శర్మ,  మరో 10 శాఖలకు చెందిన ముఖ్య కార్యదర్శులు ఆర్థికశాఖ అధికారులతో సమావేశం అయ్యారు. రెండు రోజుల ముందుగానే వీరు ఢిల్లీకి చేరుకున్నారు.  కేంద్ర ప్రభుత్వానికి ఏమీ చెప్పాలా అని చర్చించుకున్నారు. విజయసాయిరెడ్డి వీరికి సాయం చేశారు. ఏపీ భవన్‌లో వీరు రెండు రోజులుగా చర్చలు జరిపారు. ఇలా అత్యవసర మీటింగ్‌కు రావడానికి కారమం కేంద్రం రాసిన లేఖనే.  


మద్యం బాండ్ల  ద్వారా రుణ సేకరణపై కేంద్రం ఆరా 


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడి తప్పుడు దారిలో రుణాలు పొందిందని నిర్ధారిస్తూ.. కేంద్ర ఆర్థిక శాఖ నుంచి ఏపీ ప్రభుత్వానికి లేఖ అందింది.  ఏపీ ప్రభుత్వం చేస్తున్న అప్పులకు వివరాలు లేకపోవడంతో పాటు ఇతర ఉల్లంఘనలు పెద్ద ఎత్తున ఉన్నాయని వాటికి సంబంధించి  పూర్తి వివరాలతో  ఢిల్లీకి రావాలని కేంద్రం ఆదేశించింది. కేంద్రం పంపిన లేఖ కారణంగానే అధికారులు ఢిల్లీ వెళ్లారు. ఈ లేఖలో కేంద్రం కీలకమైన అంశాలను ప్రస్తావించింది. ప్రధానంగా  ఏపీ‌ స్టేట్‌ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ (ఏపీఎస్‌బీసీ) ద్వారా ఈ ఏడాది జూన్‌లో 9.62% వడ్డీతో రూ.8,305 కోట్ల విలువైన బాండ్లు విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన బేషరతు గ్యారెంటీ ద్వారా వీటిని జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మద్యంపై  ఆదాయాన్ని ప్రత్యేక మార్జిన్‌గా మార్చి దానికి కార్పొరేషన్‌ ఆదాయంగా పేరుపెట్టింది. సంక్షేమ పథకాల అమలుకోసం ఆ మార్జిన్‌ను తాకట్టుపెట్టి ఏపీఎస్‌బీసీఎల్‌ ద్వారా రుణాలు తీసుకుంది. ఇలా చేయడం ఎఫ్‌ఆర్‌ఎంబీ చట్టాన్ని, రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 293(3) కింద కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన నికర రుణ పరిమితిని బైపాస్‌ చేయడమే అవుతుందని కేంద్రం స్పష్టం చేసింది. 


కేంద్ర పథకాలు, రైల్వే ప్రాజెక్టుల నిధులేవి ? 


అలాగే రైల్వే ప్రాజెక్టులకు నిధులు కేటాయించకపోవడంపైనా కేంద్రం ప్రశ్నిస్తోంది.  రాష్ట్రం రూ.3,558 కోట్లను పెండింగ్‌లో పెట్టడంతో ఇప్పుడవన్నీ ఆగిపోయాయి. దీని వల్ల రైల్వేలకు ఇబ్బందికరం అవుతోంది. ప్రాజెక్టులన్నీ వేగంగా పూర్తి చేయాలంటే 2,348 హెక్టార్ల భూమిని సత్వరమే అందించాలని కేంద్రం స్పష్టం చేసింది. 100% రైల్వే నిధులతో వివిధ ఆర్‌ఓబీలు, ఆర్‌యూబీలు మంజూరు చేసినప్పటికీ.. అవసరమైన భూసేకరణ, అక్కడున్న పౌర సౌకర్యాల తరలింపును ఏపీ ప్రభుత్వం చేపట్టలేదు అలాగే  రాష్ట్రం సంతకం చేసిన ఒప్పందం ప్రకారం వివిధ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు, ఇతర సంస్థలు, విద్యుత్తు విక్రయదారులకు నెలవారీగా డిస్కంలు చెల్లించాల్సిన అప్పులకు సంబంధించిన నివేదికలు తేవాలని కేంద్రం స్పష్టం చేసింది. 


డిస్కంలు, విద్యుత్ సంస్థలకు చెల్లించాల్సిన బిల్లులేవి ? 


డిస్కంలకు రాష్ట్రం నుంచి రూ.9,116 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. అలాగే సబ్సిడీల రూపంలో ఇచ్చిన రూ.3,178 కోట్ల బకాయిలనూ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. అవి ఎందుకు చెల్లించడం లేదని కేంద్రం ప్రశ్నించింది.   2020-21 నుంచి 2022-23 వరకు వివిధ కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు రూ.3,824 కోట్లను విడుదల చేశాం. అయితే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటివరకు ఆ మొత్తాన్ని ఆయా పథకాలను అమలుచేసే సంస్థలకు విడుదల చేయలేదని కేంద్రం స్పష్టం చేసింది.  ఆ డబ్బులేం చేశారని ప్రశ్నించింది. వీటన్నింటికీ కేంద్రానికి ఏపీ అధికారులు సమాధానాలు చెబుతున్నారు.