India vs Pakistan T20 World Cup 2022 అసలే టీ20 ప్రపంచకప్! అందులో భారత్, పాకిస్థాన్ మ్యాచ్! మరి టికెట్లు నిమిషాల్లో అమ్ముడవ్వకపోతే మజా ఏముంటుంది చెప్పండి! ఐసీసీ టీ20 ప్రపంచకప్ ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరుగుతున్న సంగతి తెలిసిందే.
మెగా టోర్నీలో అక్టోబర్ 23న మెల్‌బోర్న్ క్రికెట్ మైదానంలో దాదాది దేశాలు తలపడుతున్నాయి. ఇప్పటికే కోట్ల మంది అభిమానులు టికెట్ల కోసం ఎదురు చూస్తున్నారు. అందుకే విక్రయం ఆరంభించిన ఐదు నిమిషాల్లోనే అన్నీ అమ్ముడయ్యాయి. దాంతో స్టాడింగ్ రూమ్ ఓన్లీ టికెట్లు విక్రయించి మరికొందరు అభిమానులను సంతోషపెట్టాలని నిర్ణయించారు.
ఐసీసీ టోర్నీల్లో భారత్, పాక్ మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎదురు చూస్తుంటారు. లక్షల రూపాయలు వెచ్చించి మరీ టికెట్లను కొనుగోలు చేస్తుంటారు. సుదీర్ఘ కాలంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీసులు లేవు. అందుకే మెగా టోర్నీల్లోనే వీరి ఆటను చూడాల్సి వస్తోంది. రెండు మూడేళ్లకు ఒకసారి మాత్రమే దాయాదుల క్రికెట్ సమరాలను ఆస్వాదించాల్సి వస్తోంది.
భారత్, పాక్ మ్యాచ్ జరిగే ఎంసీజీ ప్రపంచంలోని అతిపెద్ద స్టేడియాల్లో ఒకటి. దాదాపుగా 90వేల మంది ప్రత్యక్షంగా కూర్చొని మ్యాచును వీక్షించొచ్చు. ఆస్ట్రేలియా నిబంధనల ప్రకారం మరో పదివేల మంది నిలబడి ఆటను ఆనందించొచ్చు. ఐదు నిమిషాల్లోనే టికెట్లన్నీ అయిపోవడంతో 4000 వరకు స్టాండింగ్ రూమ్ ఓన్లీ టికెట్లు విక్రయించాలని ఐసీసీ, క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయించింది.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ అక్టోబర్ 16న మొదలవుతుంది. నవంబర్ 13న ఫైనల్ జరుగుతుంది. వాస్తవంగా ఈ టోర్నీ 2020లోనే జరగాల్సింది. కరోనా కారణంగా వాయిదా వేశారు. 2021లో భారత్. 2022లో ఆసీస్ నిర్వహించేలా ఐసీసీలో ఒప్పందం జరిగింది.
ఆసియాకప్‌కు రెడీ
టీమ్‌ఇండియా ప్రస్తుతం ఆసియాకప్‌నకు సన్నద్ధం అవుతోంది. శ్రీలంకలో జరగాల్సిన ఈ టోర్నీ వేదిక యూఏఈకి మారింది. ఇప్పటికే భారత్, పాక్ జట్లు దుబాయ్‌కి చేరుకున్నాయి. కఠోరంగా సాధన చేస్తున్నాయి. ఈ టోర్నీలో దాయాది దేశాలు మూడు మ్యాచుల్లో తలపడే అవకాశం ఉండటంతో అభిమానులు ఎగిరి గంతేస్తున్నారు. గ్రూప్ స్టేజిలో ఒకసారి, సూపర్-4లో రెండోసారి రోహిత్, బాబర్ సేనలు ఆడతాయి. అన్నీ కుదిరితే రెండు జట్లు ఫైనల్ చేరడం ఖాయమే! అప్పుడు మూడోసారి మజా వస్తుంది. కాగా కొవిడ్ బారిన పడటంతో భారత్ కోచ్ రాహుల్ ద్రవిడ్ టోర్నీకి అందుబాటులో ఉండటం లేదు. ఆయన స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ వస్తున్నారు.
ఆసియా కప్‌కు భారత జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్