Indian Army Donates Blood:


పరిస్థితి విషమం..


భారత్-పాక్ సరిహద్దుల్లోని రాజౌరి జిల్లాలో భారత సైన్యంపై ఉగ్రవాదులు దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఆగస్టు 21వ తేదీ జరిగిన ఈ ఘటనలో ఓ ఉగ్రవాది తీవ్రంగా గాయపడ్డాడు. ఈ టెర్రరిస్ట్‌కు భారత సైన్యం మూడు బాటిళ్ల రక్తం అందించి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేసింది. గాయపడిన ఉగ్రవాది...పీఓకేలోని కొట్లి జిల్లాలో సబ్జ్‌కోట్‌ గ్రామానికి చెందిన తబరక్ హుస్సేన్‌గా గుర్తించారు. నౌషేర బ్రిగేడ్ కమాండర్ కపిల్ రాణా ఈ వివరాలు వెల్లడించారు. తొడ, భుజాల్లోకి బులెట్స్‌ దూసుకుపోవటం వల్ల తీవ్రంగా గాయపడ్డాడని, పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. "మా టీమ్‌ నుంచి ఆ టెర్రరిస్ట్‌కు మూడు బాటిళ్ల రక్తం అందించాం. ఐసీయూకి తరలించాం" అని బ్రిగేడియర్ రాజీవ్ నాయర్ స్పష్టం చేశారు. హుస్సేన్‌చో పాటు అతడి సోదరుడు 15 ఏళ్ల హరూన్ అలి కూడా 2016 ఏప్రిల్‌లో అదే సెక్టార్‌లోకి చొచ్చుకుని రావటానికి ప్రయత్నించారని ఆర్మీ వెల్లడించింది. ఆ సమయంలో ఇద్దరూ పట్టుబడ్డారని, కానీ..మానవతా దృక్పథంతో 2017 నవంబర్‌లో వాళ్ల దేశానికి పంపామని తెలిపింది. ఇంటరాగేషన్‌లో భాగంగా హుసేన్ కీలక వివరాలు వెల్లడించాడు. పాకిస్థాన్ ఇంటిలిజెన్స్ ఆఫీసర్ కల్నల్ యూనుస్ చౌదరి...భారత భూభాగంపై దాడి చేయాల్సిందిగా తమకు ఆదేశాలు ఇచ్చినట్టు వివరించాడు. అందుకోసం రూ.30,000 పాకిస్థానీ కరెన్సీ ఇచ్చినట్టు పేర్కొన్నాడు. హుసేన్‌తో పాటు మరింకొందరు ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడేందుకు ప్లాన్‌ చేసింది చౌదరీయేనని తెలిపాడు. పాకిస్థాన్ ఇంటిలిజెన్స్‌లో హుస్సేన్ దాదాపు రెండు సంవత్సరాలుగా పని చేస్తున్నాడు. లష్కరే తోయిబా అతడికి ఆరు వారాల పాటు శిక్షణనిచ్చింది.   


ల్యాండ్‌మైన్ పేలి..


ఆగస్ట్ 22న నౌషేరా సెక్టార్‌లో నియంత్రణ రేఖకు 150 మీటర్ల దూరంలో పాకిస్థాన్‌కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు అనుమానాస్పదంగా సంచరించడాన్ని భారత ఆర్మీ గుర్తించింది. అయితే ఆ ఉగ్రవాదులు అక్కడి మైన్‌ఫీల్డ్‌లోకి ప్రవేశించి ల్యాండ్‌ మైన్‌పై అడుగుపెట్టారు. దీంతో అది పేలడంతో వారిద్దరూ మరణించినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి.కాగా, పేలుడు తర్వాత మరణించిన ఉగ్రవాదుల మృతదేహాలను డ్రోన్‌ ద్వారా గుర్తించినట్లు రక్షణ శాఖ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ తెలిపారు. సోమవారం, మంగళవారం మధ్య రాత్రి సమయంలో నౌషేరా సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వద్ద భారత్‌ వైపు ఈ సంఘటన జరిగిందని చెప్పారు. పేలుడులో మరణించిన ఉగ్రవాదుల మృత దేహాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.ఈ సంఘటనకు సంబంధించిన ఒక వీడియోను భారత ఆర్మీ విడుదల చేసింది. ఇద్దరు పాక్‌ ఉగ్రవాదులు మైన్‌ఫీల్డ్‌లోకి ప్రవేశించిన తర్వాత పేలుడు సంభవించింది. అనంతరం ఉగ్రవాదులు మరణించిన దృశ్యాలు కూడా ఆ వీడియోలో ఉన్నాయి. జమ్మూకశ్మీర్‌లో ఇటీవలి కాలంలో ఉగ్రవాద కార్యకలాపాలు పెరుగుతున్నాయి. సరిహద్దుల అవతలి నుంచి ఇటు వైపునకు టెర్రరిస్టులను పంపడం కూడా పెరిగింది. అయితే అలాంటి వారు రాకుండా సైన్యం అన్ని రకాల జాగ్రత్తలుతీసుకుంటోంది. ఈ క్రమంలో ల్యాండ్ మైన్లను కూడా అమర్చారు. ఈ విషయం తెలియక చాలా మంది అటు వైపు వస్తున్నారు. అలా వచ్చిన వారికి.. ఆయుధాలను 
డ్రోన్ల ద్వారా పంపుతున్నారు. ఇలాంటి డ్రోన్లను కూడా  చాలా సార్లు ఆర్మీ ధ్వంసం చేసింది. అయినా  పాకిస్తాన్ వైపు నుంచి  చొరబాట్లు మాత్రం ఆగడం లేదు.